AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: దీపమే దైవం.. ప్రకృతి ఒడిలో ఆదివాసీల అద్భుత జాతర.. నాలుగు రాష్ట్రాల నుంచి..

గుడి లేదు.. గుడిలో విగ్రహం లేదు.. కొండనే గుడి.. గుహనే సన్నిది.. జ్యోతి రూపమే దైవం.. దీపజ్యోతి రూపంలో దర్శనమిచ్చే అమ్మే ఆదిపరాశక్తి. అంతటి మహిమాన్వితమైన దైవాన్ని దర్శించుకోవాలంటే రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో కొండ కోనల్లో కొలువైన జంగుబాయి జాతరకు వెళ్లాల్సిందే. ఈ జాతర గిరిజన జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది.

Telangana: దీపమే దైవం.. ప్రకృతి ఒడిలో ఆదివాసీల అద్భుత జాతర.. నాలుగు రాష్ట్రాల నుంచి..
Jangubai Jatara
Naresh Gollana
| Edited By: |

Updated on: Dec 30, 2025 | 6:44 PM

Share

ఆదివాసీల ఆరాద్య దైవం జంగుబాయి‌ జాతర ఘనంగా ప్రారంభమైంది. కొండ కోనల్లో ప్రకృతి ఒడిలో దీపమే దైవంగా తరతరాలుగా పూజలందుకుంటున్న దుర్గమాత పుష్యమాస ఆరంభంతో భక్తులకు దర్శనమిస్తోంది. దీపోత్సవ కార్యక్రమంతో ప్రారంభమైన జాతర.. మహా ఘట్టానికి చేరుకుంది. నాలుగు రాష్ట్రాల నుండి తరలి‌వచ్చిన‌ ఆదివాసీలతో అడవంతా పులకించిపోతోంది. నేడు మహా దర్బార్ కొనసాగనుంది. కొమురంభీం జిల్లా కెరమెరి మండలంలోని మహారాష్ట్ర తెలంగాణ మధ్య సరిహద్దు వివాదాస్పద గ్రామం ముకదమూడ గ్రామ పంచాయతీ పరిధిలోని కొండా కోనల్లో వేల ఏళ్ల కిందట సహజసిద్ధంగా గుహలో వెలిసిన జంగు బాయి దేవతకు దీపోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆదివాసీలు.. జాతరను ఘనంగా ప్రారంభించారు. ఈనెల 22 న దీపోత్సవ కార్యక్రమంతో ప్రారంభమైన జాతర నేడు మహాపూజతో కీలక ఘట్టానికి చేరుకుంది. ఆదివాసీ ఎనిమిది గోత్రాలకు సంబంధించిన కటోడాల ఆధ్వర్యంలో గిరిజన సంప్రదాయం ప్రకారం అత్యంత కఠిన నియమాలతో భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు కొనసాగుతున్నాయి. జనవరు 17న శుద్ధి కార్యక్రమంతో జాతర ముగియనుంది‌. ఈ జాతరకు తెలంగాణలోని ఆదివాసీలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున ఆదివాసీలు తరలి వస్తున్నారు.

సహ్యద్రి కొండల్లో.. గుహాలో అమ్మ దర్శనం

తెలంగాణ -మహారాష్ట్ర సరిహద్దులోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం మహరాజ్ గూడ సమీపంలోని సహ్యాద్రి పర్వతాల్లోని గుహలో సహజసిద్ధంగా కొలువైన జంగుబాయి అమ్మవారిని ఆదివాసీలు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. వేల ఏండ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రంలో ప్రతి ఏటా పుష్యమాసంలో ఘనంగా జాతరను నిర్వహిస్తారు. ఈ ఏడాది 22 న దీప స్వరూప కార్యక్రమంతో మన రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి ఆదివాసీలైన గొండులు, పర్దాన్, కోలాం తెగలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున మహా పూజలో పాల్గొన్నారు‌

ఎనిమిది గోత్రాలే కీలకం

ఆదివాసీ కటోడాల ఆధ్వర్యంలో ఈనెల 22 న దీపోత్సవంతో జాతర ప్రారంభమైంది. తుమ్రం, కొడప, సలాం, రాయిసిడాం,హెర్రె కుమ్ర, మరప, వెట్టి, మందడి.. ఇలా ఎనిమిది గోత్రాల కటోడాలు (పూజరులు) తొలిరోజు కాలినడకన పూజా సామాగ్రి తీసుకొచ్చి అదే రోజు రాత్రి దీపారాధన చేసి ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించారు. ఇలా జాతర ముగిసే వరకు నెల రోజుల పాటు పూజలు కొనసాగనున్నాయి.

ప్రసాదం.. నైవేద్యం.. పంట నుండే

ఆదివాసీ రైతులు పండించిన వడ్లను దంచి బియ్యం సేకరిస్తారు. గోధుమ పిండి, పప్పు, బెల్లంతో పాటు నువ్వుల నూనెతో నైవేద్యం వండుతారు. దీపారాధనకు నువ్వుల నూనె, నెయ్యి,ఆముదం వినియోగిస్తారు. గంపలో కొబ్బరికాయ, ఆగరవర్తులు,చంద్రం, గుగ్గిలం, కుంకుమ, గులాలు, వంట సామగ్రి పెట్టుకుని సంప్రదాయ వాయిద్యాలతో తరలివెళ్తారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తారు. అనంతరం మైసమ్మ, పోచమ్మ, రావుస్క్ వద్ద మేకలు, కోళ్లు బలిచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. రాత్రి వంటలు చేసుకుని భోజనాలు చేసి పాటలు పాడుతూ అమ్మవారిని ఆరాధిస్తుంటారు. జాతర పూర్తయిన తర్వాత తిరుగు ప్రయాణంలోనూ ఆచారాలను పాటిస్తారు. 8 గోత్రాల పూజారులను కలుస్తారు. గంపను నెత్తిపై పెట్టుకుని ఇంటిదారి పడతారు. ఆడపడుచులు ఎదురుపడి దుస్తులను పరుస్తే కానుకలు సమర్పిస్తూ దాటుకుంటూ వెళ్తుంటారు భక్తులు.

జంగుబాయి జాతర అంటే.. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు మాత్రమే ఉంటాయిక్కడ‌. ఈ ఎత్తైన కొండల నడుమ ఉన్న నది ప్రాంతాన్ని టొప్లకాస్ అని అంటారు. జంగుబాయి పుణ్యక్షేత్రానికి వచ్చిన వారు ముందుగా ఈ టొప్లకాస్ వద్ద నదిలో తమ ఇంటి దైవాలకు పూజలు చేసి స్నానాలు చేయించి, నలుమూలల దండం పెట్టి మొక్కుతారు. తమ ఇంటి దైవాల ప్రతిమలకు స్నానాలు ఆచరించి పూజలు చేస్తారు. డోలు వాయిద్యాల నడుమ పూజలు చేసి పునకాలు విన్యాసాలతో బయలుదేరుతారు. టొప్లకాస నుండి రావుడ్ పేన్‌ను దర్శించుకుంటారు. అక్కడ తమ నైవేద్యాలను దైవాల ప్రతిమల గుళ్లలను పెట్టి మొక్కులు చెల్లించి, అవ్వల్ పేన్ ఆలయంలో పూజలు చేస్తారు. ఈ మూడు చోట్లా పూజలు పూర్తయ్యాకే జంగుబాయిని దర్శించుకుంటారు.

అవ్వల్ పేన్ పూజ దర్శనం అయ్యాక అక్కడ నుండి జంగుబాయి మహాళ్ వద్దకు చేరుకొని, రాయితాడ్ పేన్‌కు పూజలు చేసి జంగుబాయి గుహ‌పైకి ఎక్కి గుహ లోపల జంగుబాయి దీపాన్ని ద‌ర్శించుకుంటారు. ఈ గుహలో ఉన్న దీపమే జంగుబాయి.. పూర్వం ఇక్కడికి జంగుబాయి దీపం రూపంలో వచ్చినట్లు ఆదివాసీలు భావిస్తారు. జంగుబాయిని దర్శించుకోవడంతోనే ఆదివాసీలకంతా మంచి జరిగిందని, అప్పటి నుండి ఇక్కడ జంగుబాయి జాతర కొనసాగుతుందని ఆదివాసీలు చెబుతున్నారు. ప్రతియేటా పుష్యమాసంలో జంగుబాయికి ప్రత్యేక పూజలు చేయడంతో అంతా మంచి జరుగుతుందని ఆదివాసీల నమ్మకం. జంగుబాయి పూజల అనంతరం అందరు కలిసి తమ తమ కుటుంబాలతో సందడిగా వివిధ రకాల వంటకాలు తయారు చేసి ముందుగా తమ దైవాలకు నైవేద్యం పెట్టి ఆ తరువాత అందరు కలిసి విందు చేస్తారు. స్వచ్చమైన నువ్వుల నూనే ఇప్ప నూనేలతో నైవేద్యం పెట్టాక ఆ నూనెలతోనే మహిళలు వంటకాలు గారేలు, బురేలు అప్పాలు చేస్తారు.

జంగుబాయి ఆలయాన్ని చేరుకోవాలంటే

కొమురంభీం ఆసిపాబాద్ జిల్లా నుంచి వెళ్లే భక్తులు కెరమెరి మండల కేంద్రం మీదుగా దేవాపూర్, అనార్ పల్లి, కొండి బాగుడా, మలంగి, మాలేపూర్ నుంచి ఉమ్రి క్రాస్ రోడ్ మీదుగా పరందోళి, మహరాజ్ గూడ చేరుకుని, అక్కడ్నుంచి 2 కిలోమీటర్లు నడక మార్గంలో వెళితే అమ్మవారి ఆలయం వస్తుంది. ఆదిలాబాద్ నుంచి వచ్చే భక్తులు ఉట్నూరు, నాన్నూర్, లోకారి మీదుగా ఉమ్రి క్రాస్ రోడ్ నుంచి చేరుకోవచ్చు. ఆదిలాబాద్ నుంచి డైరెక్ట్‌గా నాన్నూర్, కొత్తపల్లి, మాలేపూర్ మీదుగా ఉమ్రి క్రాస్ రోడ్ నుంచి పరందోళి, మహరాజ్ గూడ ద్వారా వెళ్లొచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.