Indian Railway: సంక్రాంతి వేళ ఓవరాక్షన్ వద్దు.. తేడా వస్తే జైలుకే.. గట్టి వార్నింగ్ ఇచ్చిన రైల్వేశాఖ
సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగులు ఎగురవేయడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. కైట్ ఫెస్టివల్స్ కూడా పలు ప్రాంతాల్లో జరుగుతూ ఉంటాయి. పతంగుల వల్ల ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఈక్రమంలో రైల్వేశాఖ ప్రజలను అలర్ట్ చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది.

సంక్రాంతి వస్తుండటంతో పిల్లలు పతంగులు ఎగరేస్తూ సందడి చేస్తుంటారు. వీరితో కలిసి పెద్దలు కూడా గాలి పటాలు ఎగరేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒక్కొసారి వీటి వల్ల ప్రమాదాలు కూడా ఏర్పడే అవకాశముంది. గాలి పటాలు కరెంట్ వైర్లకు చుట్టుకోవడం, వాహనాలపై వెళ్లేవారికి తగలడం వల్ల ప్రమాదాలు ఏర్పడే అవకాశమంది. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే పతంగుల విషయంలో హెచ్చరికలు జారీ చేసింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియచేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. రైల్వే విద్యుత్తు లైన్ల దగ్గర గాలిపటాలు ఎగురవేయవద్దని, విద్యుత్తు తీగల నుండి వేలాడుతున్న గాలిపటం దారాలను తాకడాన్ని నివారించాలని సూచించింది.
రైల్వేశాఖ నుంచి అలర్ట్
రైల్వే ప్రాంగణాల పరిసరాలు, యార్డులు, ట్రాక్‌లు, సమీపంలోని జనసంచార ప్రాంతాలలో గాలిపటాలు ఎగురవేయవద్దని రైల్వేశాఖ సూచించింది. వీటి వల్ల కరెంట్ షాక్ తగిలి ప్రమాదం సంభవించవచ్చని తెలిపింది. చైనా నుండి దిగుమతి చేయబడిన గాలిపటాల దారాలు విద్యుత్ వాహకం అవడం వల్ల మనుషుల ప్రాణాలను తీయడమే కాకుండా రైల్వే విద్యుత్ తీగలకు కూడా తీవ్ర ముప్పును కలిగిస్తాయంది. ఈ కారణంతో రైల్వే సేవలకు అంతరాయం కలగవచ్చని తెలిపింది. రైల్వే ట్రాక్‌లు, స్టేషన్లు, యార్డులు, ఇతర రైల్వే స్థలాల వద్ద గాలిపటాలు ఎగురవేయవద్దని వార్నింగ్ ఇచ్చింది. ఓవర్ హెడ్ ట్రాక్షన్ లైన్లు అధిక వోల్టేజ్ విద్యుత్‌తో ఛార్జ్ చేయబడి ఉంటాయని, వాటిని తాకినప్పుడు ప్రమాదం ఏర్పడుతుందంది.
గతంలో అనేక కేసులు
ప్రతి ఒక్కరూ పండుగలను బాధ్యతాయుతంగా జరుపుకోవాలని, రైలు కార్యకలాపాలకు విఘాతం కలిగించవద్దని దక్షిణ మధ్య రైల్వే ప్రజలను కోరింది. ఈ ఏడాది సంక్రాంతి పండుగ సీజన్‌లో గాలి పటాల వల్ల ప్రమాదం జరిగిన సంఘటనలు భారతీయ రైల్వేలోని అనేక జోన్‌లలో చోటుచేసుకున్నాయి. ఇందుకుగాను కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. 25 కె.వి ట్రాక్షన్ ఓవర్‌హెడ్ కండక్టర్‌లలో చిక్కుకున్న గాలిపటం దారాలను తాకడంతో విద్యుత్ షాక్‌లు తగిలి ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయాలపాలయ్యారు. దీంతో ముందు జాగ్రత్తగా ప్రజలకు రైల్వేశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని, రైల్వే సేవలకు అంతరాయం కలిగిస్తే కేసులు కూడా నమోదు చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది.
