Vayve eva: అదిరిపోయిన సోలార్ కార్.. 50 పైసల ఖర్చుతో కిలోమీటర్ ప్రయాణం
సాధారణంగా పెట్రోలు, డీజిల్ తో నడిచే కార్ల గురించి అందరికీ తెలుసు. పూర్వ కాలం నుంచి ఇవి వినియోగంలో ఉన్నాయి. ఆ తర్వాత సీఎన్‌జీతో నడిచే కార్లు మార్కెట్‌లోకి వచ్చాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగింది. ఈ విభాగంలో కార్లు, స్కూటర్లు, బైక్, బస్సులు కూడా విడుదలవుతున్నాయి. కాలుష్యాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణకు ఇవి దోహద పడతాయి.
ఎలక్ట్రిక్ కార్లు నడవాలంటే విద్యుత్ ను ఉపయోగించి వాటి బ్యాటరీలను చార్జింగ్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మరో కొత్త టెక్నాలజీ కారు అందుబాటులోకి రానుంది. సోలార్ తో నడిచే ఈ ఎలక్ట్రిక్ కారు పేరు ఈవా. దీన్ని వాయ్‌వే అనే కంపెనీ తయారు చేసింది. వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానుంది ఈ కారు ప్రత్యేకతలను తెలుసుకుందాం. మన దేశంలో సోలార్ తో నడిచే మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారుగా ఈవా రికార్డు నెలకొల్పనుంది. వచ్చే ఏడాది జనవరిలో జరిగే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో లో దీన్ని ప్రదర్శించనున్నారు. ఈ కారులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మహీంద్రా ఈ20, రెవా తదితర చిన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ మాదిరిగా కనిపిస్తుంది. కేవలం 50 పైసల ఖర్చుతో కిలోమీటరు ప్రయాణం చేయవచ్చు. డ్యూయర్ డిజిటల్ స్క్రీన్లు, డ్రైవర్ ఎయిర్ బ్యాగు, ఫిక్స్‌డ్ గ్లాస్ రూఫ్ తదితర ప్రత్యేకతలున్నాయి. ఈ కారు ప్రీ లాంచ్ బుక్కింగ్ లు వచ్చే ఏడాది జనవరిలో మొదలవుతాయి.
నగర పరిధిలో ప్రయాణానికి అనుకూలంగా ఉండేలా ఈవా కారును తీర్చిదిద్దారు. దీనిలో రెండు డోర్లు, రెండు సీట్లు మాత్రమే ఉంటాయి. 3060 మి.మీ పొడవు, 1150 మిమీ వెడల్పు, 1590 మిమీ ఎత్తుతో 2200 మిమీ వీల్ బేస్‌తో రూపొందించారు. దీన్ని నడపడం చాలా సులభం. వాయ్‌వే కంపెనీ రూపొందించిన ఈవా సోలార్ కారు సుమారు 250 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణం చేయవచ్చు. సోలార్‌తో దీన్ని చార్జింగ్ చేస్తే ఏడాదికి 3 వేల కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. అత్యంత వేగంగా చార్జింగ్ కావడం దీని అదనపు ప్రత్యేకత. దీనిలో 14 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిక్ మోటారు ద్వారా 8.15 పీఎస్/ 40 ఎన్‌ఎం శక్తి విడుదల అవుతుంది. సూర్యకాంతి లేనప్పుడు హైస్పీడ్ చార్జర్‌తో కేవలం ఐదు నిమిషాల్లోనే చార్జింగ్ చేసుకుని సుమారు 50 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు.
ఈవా అనేది ఒక కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారు. దీనిలో కేవలం ముగ్గురు మాత్రమే ప్రయాణం చేసే వీలుంటుంది. డ్రైవర్ తో పాటు వెనుక ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. బైక్ మాదిరిగా ఉండే ఈ కారు ఇరుకైన వీధులు, రోడ్లపై సైతం చక్కగా దూసుకుపోతుంది. ఎలక్ట్రిక్ మార్కెట్‌లో తమ కారు విప్లవాత్మక మార్పు తీసుకువస్తుందని వాయ్‌వే యాజమాన్యం భావిస్తోంది. నగర వాసుల అవసరాలకు అనుగుణంగా తయారు చేయడంతో ఆదరణ పెరుగుతుందని చెబుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి