Silver: వామ్మో.. ఒక్క వారంలోనే రూ.16వేలు పెరిగిన వెండి.. అసలు కారణాలు ఏంటంటే..?
డిసెంబర్ మూడవ వారంలో వెండి ధరలు రికార్డు స్థాయిలో రూ.16,000 పెరిగి, ఈ ఏడాది 126శాతం రాబడినిచ్చాయి. బంగారం ధరలు స్థిరంగా పెరిగాయి. US ఫెడ్ సంకేతాలు, బలహీనమైన డాలర్, పారిశ్రామిక డిమాండ్ ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలు. కొనుగోలుదారులు ధరలు స్వల్పంగా తగ్గినప్పుడు కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

డిసెంబర్ మూడవ వారం ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తే, కొనుగోలుదారులకు మాత్రం ధరల భారంతో చుక్కలు చూపిస్తోంది. గత ఏడు రోజుల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగితే.. వెండి ఏకంగా రూ.16,000 జంప్ చేసి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ ఏడాది ఇప్పటివరకు వెండి ఏకంగా 126 శాతం రిటర్న్స్ ఇవ్వడం గమనార్హం.
పసిడి ధరల ప్రస్తుత పరిస్థితి
బంగారం ధరలు ప్రస్తుతం నిలకడగా కానీ, స్థిరమైన పెరుగుదలతో సాగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం గడచిన వారంలో రూ.260 పెరిగింది. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల ధర రూ.1,34,330 వద్ద ఉంది. అదే 22 క్యారెట్ల బంగారం రూ.250 పెరిగి, 10 గ్రాముల ధర రూ.1,23,150 వద్ద ట్రేడవుతోంది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్సుకు 4,322.51 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
వెండిలో రికార్డు స్థాయి పెరుగుదల
ఈ వారం అసలు సిసలైన హీరో వెండి అని చెప్పాలి. కేవలం ఒక్క వారంలోనే కిలో వెండిపై రూ.16,000 పెరగడం మార్కెట్ ప్రకంపనలు సృష్టిస్తోంది. డిసెంబర్ 21 నాటికి కిలో వెండి ధర రూ.2,14,000కు చేరుకుంది. అంతర్జాతీయంగా వెండి ఔన్సుకు 65.85 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ధరల పెరుగుదల వెనుక ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు:
US ఫెడ్ రిజర్వ్ సంకేతాలు: అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుందనే అంచనాలు బంగారం, వెండికి కలిసొస్తున్నాయి.
బలహీనమైన డాలర్: అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ బలహీనపడటం, కార్మిక మార్కెట్ డేటా నెమ్మదించడం వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మళ్లుతున్నారు.
పారిశ్రామిక డిమాండ్: క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ తయారీలో వెండి వినియోగం పెరగడం వల్ల వెండి ధరలు అసాధారణంగా పెరుగుతున్నాయి.
కొనుగోలుదారులకు సూచన
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ ఎక్కువగా ఉంది. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం.. ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఏదైనా చిన్నపాటి తగ్గుదల కనిపిస్తే అది కొనుగోలుకు సరైన సమయంగా భావించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








