Telangana Elections: తెలంగాణలో మరో ఎన్నికలకు నగారా..! ఫిబ్రవరిలో నోటిఫికేషన్..?
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల హీట్ ముగియడంతో ఇప్పుడు అందరి ఫోకస్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై పడింది. ఈ ఎన్నికల ప్రక్రియ మొదలైతే మళ్లీ గ్రామాల్లో ఎన్నికల కోలాహలం మొదలుకానుంది. అటు మున్సిపల్ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. వీటిని ఎప్పుడు నిర్వహిస్తారనేది హాట్‌టాపిక్‌గా మారింది.

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల సందడి ముగిసింది. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలవగా.. బీఆర్ఎస్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. మొత్తం మూడు విడతలుగా ఎన్నికలు జరగ్గా.. 1205 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 11,497 స్ధానాలకు ఎన్నికలు జరగ్గా.. 1,25,23,137 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 85.360 శాతం పోలింగ్ నమోదైంది. కాంగ్రెస్ మద్దతుదారులు 7,010, బీఆర్ఎస్ మద్దతుదారులు 3502 మంది గెలిచారు. ఇక బీజేపీ 688 స్థానాలను దక్కించుకుంది.
సర్పంచ్ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఓటర్ల సమగ్ర సవరణ జాబితా సిద్దం చేయాల్సి ఉండటం వల్ల ఈ ఎన్నికల నిర్వహణ ఆలస్యమవుతోంది. వచ్చే ఏడాది జనవరి తొలి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం సమగ్ర సవరణ జాబితా విడుదల చేసే అవకాశముంది. ఈ జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. సర్పంచ్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ న్యాయపరమైన చిక్కుల వల్ల ఆగిపోయాయి. ఓటర్ల సవరణ జాబితా వచ్చిన తర్వాత ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఓటర్ల సవరణ జాబితా అందిన తర్వాత వార్డుల వారీగా ఓటర్ల విభజన చేయాల్సి ఉంటుంది. దీంతో జనవరి చివరి నాటికి ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని తెలుస్తోంది.
ఇక ఫిబ్రవరిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశముందని తెలుస్తోంది. అలాగే మున్సిపల్ ఎన్నికలను కూడా నిర్వహించాల్సి ఉంది. అయితే మున్సిపల్ వార్డుల విభజనకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం ఇంకా ఈసీకి అందించలేదు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశముంది. దీంతో ఫిబ్రవరిలో మిగిలిన స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశముందని సమాచారం. సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన జోష్‌లో కాంగ్రెస్ ఉండగా.. రాబోయే ఎన్నికల్లో కూడా గట్టి పోటీ ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తోంది.




