మూడేళ్లుగా మూత పడిన కంపెనీలో కోట్ల విలవైన మెషినరీ మాయం.. ఇంతకీ ఎవరి పని..?
జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మూతపడిన సూపర్ మ్యాక్స్ బ్లేడ్ కంపెనీలో భారీ చోరీ జరిగింది. మూడు కోట్లకు పైగా విలువ చేసే మిషనరీ, ఇతర సామాగ్రి మాయం అయినట్టుగా కంపెనీ ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న సూపర్ మ్యాక్స్ బ్లేడ్ తయారీ యూనిట్ గత మూడేళ్లుగా మూతపడి ఉంది.

హైదరాబాద్ మహానగరం జీడిమెట్ల పారిశ్రామిక వాడలో మూతపడిన సూపర్ మ్యాక్స్ బ్లేడ్ కంపెనీలో భారీ చోరీ జరిగింది. మూడు కోట్లకు పైగా విలువ చేసే మిషనరీ, ఇతర సామాగ్రి మాయం అయినట్టుగా కంపెనీ ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న సూపర్ మ్యాక్స్ బ్లేడ్ తయారీ యూనిట్ గత మూడేళ్లుగా మూతపడి ఉంది. జీతాలు ఇవ్వకపోవడంతో కంపెనీ అకస్మాత్తుగా షట్‌డౌన్ అవ్వడంతో కార్మికులు రోడ్డు మీదకి వచ్చారు. మూతపడ్డ కంపెనీ నుంచి మిషన్లు కనిపించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, కంపెనీ ఆర్థికంగా కుదేలవడంతో, అనంతరం ఆ యూనిట్ బ్యాంక్ కస్టడీలోకి వెళ్ళింది. ఈ మధ్య కాలంలో యాజమాన్యం విలువైన యంత్రాలను, పరికరాలను నిశ్శబ్దంగా తరలించిందనే సమాచారమూ బయటకొచ్చింది. కొన్ని ధృవపత్రాలు, డాక్యుమెంట్ల కోసం కంపెనీ వద్దకు వచ్చిన ప్రతినిధులు ప్లాంట్‌లో ఉన్న మిషనరీ కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యారు. గతంలో ఇన్‌స్టాల్‌గా ఉన్న యంత్రాలు, సామాగ్రి చాలా భాగం అక్కడ లేనట్టుగా గుర్తించి, ఇది దొంగతనమై ఉంటుందనే అనుమానంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు సంచలన విషయాల బయటపడ్డాయి. మిషనరీ మాయమైన ప్రదేశంలో గ్యాస్ కట్టర్ల అక్కడ వదిలేసినట్టు గుర్తించారు. గ్యాస్ కట్టలతో మిషన్లను కట్ చేసి తరలించినట్లు నిర్ధారించారు. సూపర్ మ్యాక్స్ యూనిట్‌కు బాధ్యత వహిస్తున్న సెక్యూరిటీ సూపర్‌వైజర్ స్థానిక జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
చాలా ఏళ్లుగా మూతపడిన కంపెనీ కావడంతో ప్రస్తుతానికి ఎంత విలువైన వస్తువులు దొంగిలించారనేదీ ఖచ్చితంగా చెప్పలేమని జీడిమెట్ల సీఐ తెలిపారు. ఆ యూనిట్‌కు కస్టోడియన్‌గా ఉన్న ప్రతినిధి పూర్తి జాబితా ఇస్తే గానీ చెప్పలేమన్నారు. ఏయే మిషన్లు, పరికరాలు మిస్సయ్యాయో స్పష్టతకు వస్తుందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సెక్యూరిటీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాత్రమే కేసు నమోదు చేశామన్నారు. కంపెనీ యాజమాన్యం, బ్యాంక్ ప్రతినిధులు, సెక్యూరిటీ స్టాప్ వాంగ్మూలాలను సేకరిస్తూ దర్యాప్తు కొనసాగుతున్నట్టు సీఐ పేర్కొన్నారు.
జీతాలు ఇవ్వకుండా యూనిట్ మూసివేసి కార్మికులను నిరుద్యోగులుగా వదిలేసిన యాజమాన్యం పాత్రపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కోట్ల విలువైన మిషనరీ మాయం కావడంతో, ఇది నిజంగా బయటి వారు చేసిన దొంగతనమా? లేక యాజమాన్యమా? కస్టోడియన్ల ప్రమేయం ఉందా? అన్న కోణంలో చర్చ నడుస్తోంది. కస్టోడియన్ వివరాల ఆధారంగా అసలు నష్టం ఎంత? ఎవరి నిర్లక్ష్యం లేదా కుట్ర వల్ల ఈ పరిస్థితి తలెత్తిందనే విషయం దర్యాప్తుతో బయటకు రావాల్సి ఉంది..!
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




