RBI కొత్త రూల్స్.. ఆన్‌లైన్ యాప్స్‌లో లోన్లు తీసుకునేవారు తప్పక తెలుసుకోండి!
డిజిటల్ రుణాల వ్యవస్థలో పారదర్శకత, భద్రత పెంచేందుకు ఆర్‌బిఐ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి తీసుకొచ్చింది. EMIలపై పరిమితులు, తప్పనిసరి KFS, కఠిన KYC, కూలింగ్-ఆఫ్ పీరియడ్ వంటి నిబంధనలతో రుణగ్రహీతలకు మెరుగైన రక్షణ కల్పించనుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి..

దేశంలో వేగంగా పెరుగుతున్న డిజిటల్ రుణాల వ్యవస్థను మరింత పారదర్శకంగా, సురక్షితంగా మార్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా అధిక రుణభారం, రహస్య ఛార్జీలు, అనధికారిక డిజిటల్ లెండింగ్ యాప్‌ల సమస్యలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ కొత్త నిబంధనలు రుణగ్రహీతలకు పెద్ద ఊరటనిస్తున్నాయి. ఆర్‌బిఐ తాజా మార్గదర్శకాల ప్రకారం ఒక వ్యక్తి తీసుకునే మొత్తం రుణాల EMIలు అతని నెలవారీ ఆదాయంలో 50 శాతాన్ని మించకూడదు. దీనిని ‘లోన్ టు ఇన్‌కమ్ రేషియో’ (LTI)గా పేర్కొంటూ బ్యాంకులు, NBFCలు రుణం మంజూరు చేసే ముందు దరఖాస్తుదారుడి ప్రస్తుత రుణభారం, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, క్రెడిట్ బ్యూరో వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలి.
ఇకపై రుణ ఆమోదాల్లో క్రెడిట్ స్కోర్‌కు మరింత ప్రాధాన్యం లభించనుంది. 750కు పైగా స్కోర్ ఉన్న వారికి తక్కువ వడ్డీ రేట్లతో మెరుగైన రుణ ఆఫర్లు లభించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. తక్కువ స్కోర్ ఉన్నవారికి రుణ పరిమితులు తగ్గే అవకాశమూ ఉంది. అత్యంత కీలకమైన మార్పుగా, రుణదాతలు ఇప్పుడు కీ ఫ్యాక్ట్ స్టేట్‌మెంట్ (KFS)ను తప్పనిసరిగా ఇవ్వాలి. ఇందులో వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ఆలస్యపు జరిమానాలు వంటి అన్ని వివరాలు స్పష్టంగా ఉండాలి. దీంతో రుణగ్రహీతలకు ముందుగానే మొత్తం రుణ వ్యయం అర్థమవుతుంది.
డిజిటల్ రుణ యాప్‌లపై కూడా ఆర్‌బిఐ కఠిన వైఖరి అవలంబించింది. రుణగ్రహీతలు రుణం తీసుకున్న తర్వాత నిర్ణీత కూలింగ్ ఆఫ్ పీరియడ్‌లో ఎటువంటి భారీ జరిమానా లేకుండా రుణాన్ని రద్దు చేసుకునే అవకాశం కల్పించాలని ఆదేశించింది. ఈ సమయంలో కేవలం ఉపయోగించిన రోజుల వడ్డీ మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అదే సమయంలో KYC నిబంధనలను కూడా మరింత కఠినతరం చేశారు. ఆదాయపు పన్ను రిటర్నులు, ఉద్యోగ వివరాలు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు తప్పనిసరిగా పరిశీలించాల్సి ఉంటుంది. ముఖ్యంగా గిగ్ వర్కర్లు, స్వయం ఉపాధి పొందుతున్న వారి విషయంలో అదనపు ధృవీకరణ ఉండనుంది. ఆర్థిక క్రమశిక్షణను పెంపొందిస్తూ, బాధ్యతాయుత రుణ వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ కొత్త మార్గదర్శకాల ప్రధాన లక్ష్యమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
