కిరాణా బిల్లును సగానికి సగం తగ్గించే మ్యాజిక్ ట్రిక్స్.. షాపుకు వెళ్లినప్పుడు ఇలా చేస్తే చాలు..
కిరాణా సామాను కొనడం ఇప్పుడు సామాన్యుడికి తలకు మించిన భారంగా మారుతోంది. సూపర్ మార్కెట్‌కు వెళ్లి నాలుగు కూరగాయలు, ఒక నూనె డబ్బా, కొద్దిగా గోధుమ పిండి కొని బిల్లు కట్టేసరికి జేబులు ఖాళీ అయిపోతున్నాయి. ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో.. నయా పైసా వృధా కాకుండా నెలవారీ కిరాణా బిల్లును సగానికి సగం ఎలా తగ్గించుకోవచ్చో తెలుసా?

ప్రస్తుత రోజుల్లో మార్కెట్‌కు వెళ్లాలంటేనే సామాన్యుడు హడలిపోతున్నాడు. కూరగాయలు, గోధుమ పిండి, వంట నూనె.. ఇలా ఏది ముట్టినా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రతి వారం కిరాణా బిల్లులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అయితే ధరలు పెరుగుతున్నాయని మనకు ఇష్టమైన ఆహారాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. షాపింగ్ చేసే విధానంలో కొన్ని చిన్న చిన్న మార్పులు, తెలివైన అలవాట్లను అలవర్చుకుంటే.. ఎలాంటి పరిమితులు లేకుండానే నెలకు వేల రూపాయల బడ్జెట్‌ను ఆదా చేసుకోవచ్చు. ఆ సీక్రెట్ కిచెన్ బడ్జెట్ హ్యాక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వెళ్లేముందే ఒక ప్లాన్.. ముందస్తు జాబితా
ఎలాంటి అవగాహన లేకుండా నేరుగా కిరాణా దుకాణంలోకి అడుగుపెట్టడమే అధిక ఖర్చుకు ప్రధాన కారణం. షాపింగ్‌కు బయలుదేరే ముందు మీ వంటగదిలో ఇప్పటికే ఏమేం వస్తువులు ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. ఆ వారానికి చేసుకోబోయే వంటల గురించి ఒక స్థూలమైన ఆలోచనతో అవసరమైన వాటి జాబితా రాసుకోండి. దీనివల్ల ఉన్న వస్తువులనే మళ్లీ కొనడం, అనవసరమైన వాటిపై డబ్బులు వృధా చేయడం లాంటివి అస్సలు జరగవు.
యూనిట్ ధర గమనించండి
ఇది చాలా మందికి తెలియని ఒక నిశ్శబ్ద బడ్జెట్ హీరో. మీరు సూపర్ మార్కెట్ షెల్ఫ్‌లపై చూసే చిన్న ప్రైస్ ట్యాగ్‌లపై కిలోకు, 100 గ్రాములకు లేదా లీటరుకు ఎంత ఖర్చవుతుందో రాసి ఉంటుంది. ప్యాకెట్లు చూడటానికి భిన్నంగా కనిపించినప్పటికీ, రెండు బ్రాండ్ల అసలు ధరను పోల్చడానికి ఈ యూనిట్ ప్రైస్ మీకు హెల్ప్ చేస్తుంది. కొన్నిసార్లు పెద్ద ఫ్యామిలీ ప్యాక్ కంటే చిన్న ప్యాకెట్లే లాభదాయకంగా ఉండటం చూసి మీరే ఆశ్చర్యపోతారు.
హోల్‌సేల్‌గా కొనండి.. కానీ ఒక కండిషన్
బియ్యం, పప్పులు, నట్స్, మసాలాలు, క్లీనింగ్ లిక్విడ్స్ వంటి నిత్యావసరాలను ఎక్కువ మొత్తంలో కొనడం వల్ల ఎక్కువ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే త్వరగా పాడైపోయే వస్తువులు లేదా ఎప్పుడో ఒకసారి వాడే వస్తువులను బల్క్‌గా కొని వృధా చేయకండి. మీ వంటగదిలో నిత్యం ఉపయోగించే వాటిని మాత్రమే ఎక్కువ మొత్తంలో కొనండి.
ఆఫర్లు, సేల్స్‌ను క్యాష్ చేసుకోండి
సూపర్ మార్కెట్లు, ఆన్‌లైన్ యాప్స్ క్రమం తప్పకుండా వీకెండ్ సేల్స్ లేదా మంత్లీ డిస్కౌంట్స్ పెడుతుంటాయి. మీరు రెగ్యులర్‌గా వాడే ఖరీదైన బ్రాండెడ్ వస్తువులపై తగ్గింపులు ఉన్నప్పుడు వాటిని కాస్త ఎక్కువ మొత్తంలో కొని నిల్వ చేసుకోవడం మంచిది. అయితే, ఆఫర్ ఉంది కదా అని మీ జాబితాలో లేని అనవసరమైన వస్తువులను కొని ట్రాప్‌లో పడకండి.
ఆకలిగా ఉన్నప్పుడు షాపింగ్ వద్దు
ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ సైకాలజికల్‌గా ఇది పెద్ద మార్పు తెస్తుంది. ఆకలితో ఉన్నప్పుడు లేదా పరధ్యానంగా ఉన్నప్పుడు కిరాణా దుకాణంలోకి వెళ్తే.. మన మైండ్ జంక్ ఫుడ్స్, స్నాక్స్ వైపు లాగుతుంది. దీంతో లిస్ట్‌లో లేని వస్తువులను ఎమోషనల్ బయింగ్ ద్వారా కొనేస్తాం. కాబట్టి ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉన్నప్పుడే షాపింగ్ చేయండి.
స్టోర్ బ్రాండ్స్‌కు మారండి
ప్రతీ వస్తువు పెద్ద పెద్ద సెలబ్రిటీలు యాడ్స్ ఇచ్చే బ్రాండ్‌దే అవ్వాల్సిన అవసరం లేదు. ఉప్పు, చక్కెర, పిండి, పప్పుల వంటి నిత్యావసర వస్తువుల్లో.. సూపర్ మార్కెట్ సొంత బ్రాండ్స్ తక్కువ ధరకే అదే నాణ్యతను అందిస్తాయి. క్వాలిటీ ఒకేలా ఉన్నప్పుడు బ్రాండ్ ఇమేజ్ కోసం ఎక్కువ డబ్బులు చెల్లించడం కంటే, స్టోర్ బ్రాండ్స్‌కు మారడం వల్ల బిల్లు బాగా తగ్గుతుంది.
వంటగదిలో ఉన్న వాటిని వాడేయండి
కొత్త సామాన్లు కొనడానికి ముందు.. మీ వంటగది షెల్ఫ్ వెనుక మర్చిపోయిన పప్పులు, సగం వాడిన మసాలా ప్యాకెట్లు, మిగిలిపోయిన పాస్తా వంటివి ఏమున్నాయో చూడండి. వారానికి ఒకసారి ఈ ఇన్వెంటరీ తనిఖీ చేయడం వల్ల ఒకే వస్తువును రెండుసార్లు కొనకుండా ఉండవచ్చు. ఉన్న వాటితోనే స్మార్ట్‌గా వంటలు ప్లాన్ చేయడం వల్ల ఆహారం వృధా కాదు, పైగా జేబులో డబ్బులూ మిగులుతాయి.
