మండుతున్న ఎండలు – పెరుగుతున్న వడదెబ్బలు.. అనారోగ్యానికి గురైతే బీమా వర్తిస్తుందా?
ప్రస్తుత రోజుల్లో వేసవి కాలం పేరు వింటేనే ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఏటా రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాలుల కారణంగా జనజీవనం అతలాకుతలమవుతోంది. ఈ వాతావరణ మార్పుల వల్ల వడదెబ్బ బారిన పడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రజలు ఎంతగా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, ఏదో ఒక సందర్భంలో తీవ్ర అనారోగ్యానికి గురవుతూనే ఉన్నారు.

ప్రస్తుత రోజుల్లో వేసవి కాలం పేరు వింటేనే ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఏటా రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాలుల కారణంగా జనజీవనం అతలాకుతలమవుతోంది. ఈ వాతావరణ మార్పుల వల్ల వడదెబ్బ బారిన పడే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రజలు ఎంతగా జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, ఏదో ఒక సందర్భంలో తీవ్ర అనారోగ్యానికి గురవుతూనే ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో అందరినీ వేధించే ఒకే ఒక్క పెద్ద ప్రశ్న. “ఒకవేళ వడదెబ్బ కారణంగా తీవ్ర అనారోగ్యం పాలై ఆసుపత్రి చేరితే, దానికి చికిత్స ఎలా పొందాలి? మనకున్న ఆరోగ్య బీమా దీనికి ఉపయోగపడుతుందా?” నిపుణుల అభిప్రాయం ప్రకారం, వడగాలుల వల్ల మీరు అనారోగ్యానికి గురైతే ఆరోగ్య బీమా ద్వారా చికిత్స పొందడం ఖచ్చితంగా సాధ్యమే. అయితే, దీనికి కొన్ని ముఖ్యమైన షరతులు, నియమాలు వర్తిస్తాయి. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఆరోగ్య బీమాతో వడదెబ్బకు చికిత్స సాధ్యమేనా?
మనీ కంట్రోల్ కథనం ప్రకారం, భారతదేశంలోని మెజారిటీ ప్రామాణిక ఆరోగ్య బీమా పాలసీల కింద వడదెబ్బ చికిత్సకు కవరేజ్ లభిస్తుంది. ఒకవేళ వడదెబ్బ తీవ్రత ఎక్కువగా ఉండి, రోగి ఆసుపత్రిలో చేరాల్సి వస్తే.. పాలసీ కింద ఖర్చులను క్లెయిమ్ చేసుకోవచ్చు.
* ఆసుపత్రి గది అద్దె (Room Rent)
* ఐసీయూ (ICU) ఖర్చులు
* డాక్టర్ సంప్రదింపుల ఫీజు
* రోగ నిర్ధారణ పరీక్షలు (Diagnostic Tests)
* చికిత్సకు అవసరమైన మందుల ఖర్చులు
పాలసీ నిబంధనలు – షరతులు ఏమిటి?
- వడదెబ్బకు క్లెయిమ్ పొందాలంటే బీమా కంపెనీలు కొన్ని ప్రాథమిక షరతులను విధిస్తాయి. వాటిని నెరవేర్చినప్పుడే క్లెయిమ్ సులువుగా ఆమోదం పొందువచ్చు.
- రోగి కనీసం 24 గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్‌గా చేరి చికిత్స పొందాలి.
- సదరు రోగి వడదెబ్బ లేదా తీవ్రమైన ఎండ వేడి వల్లే అనారోగ్యానికి గురయ్యాడని నిపుణులైన వైద్యుడు తన నివేదికలో స్పష్టంగా పేర్కొనాలి.
- అన్నింటికంటే ముఖ్యంగా, సకాలంలో ప్రీమియం చెల్లించి పాలసీ చురుకుగా ఉండాలి.
ఏ సందర్భాలలో క్లెయిమ్‌లు తిరస్కరించబడవచ్చు?
కొన్ని పొరపాట్లు లేదా పాలసీ నిబంధనల అవగాహన లోపం వల్ల వడదెబ్బ క్లెయిమ్‌లు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది.
1. మీరు ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వకుండా, కేవలం అవుట్-పేషెంట్ విభాగంలో సెలైన్ ఎక్కించుకుని లేదా మందులు తీసుకుని ఇంటికి వచ్చేస్తే, ప్రాథమిక పాలసీలలో ఆ ఖర్చు కవర్ కాదు.
2. కొన్ని పాత లేదా పరిమిత కవరేజ్ ఉన్న పాలసీలలో ప్రకృతి వైపరీత్యాలు లేదా వాతావరణ మార్పుల వల్ల వచ్చే కొన్ని అనారోగ్యాలను మినహాయించవచ్చు. పాలసీ తీసుకునేటప్పుడే ఈ విషయాలు సరిచూసుకోవాలి.
3. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో ఇచ్చే బిల్లులు, మెడికల్ రిపోర్టులు, డిశ్చార్జ్ సమ్మరీ పక్కాగా లేకపోయినా క్లెయిమ్ తిరస్కరించబడుతుంది.
4. ఆసుపత్రిలో చేరిన వెంటనే లేదా నిర్దేశిత సమయం లోపు బీమా సంస్థకు సమాచారం అందించాలి. ఆలస్యం చేస్తే క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.
ఎండల తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఒకవేళ దురదృష్టవశాత్తూ వడదెబ్బ తగిలినా, మీ ఆరోగ్య బీమా పాలసీ నిబంధనలపై అవగాహన ఉంటే.. ఆర్థిక భారం లేకుండా మెరుగైన వైద్యం పొందవచ్చు. బీమా కంపెనీకి సకాలంలో సరైన పత్రాలతో సమాచారం అందించడమే ఇందులో అత్యంత కీలకం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
