పాము విషం నుంచి మనిషి ప్రాణాలను కాపాడుతున్నది ఈ జంతువే.. రక్తాన్నే విరుగుడుగా మార్చే శక్తి..
పాము అంటే భయపడని వారు ఉండరు. ఇక పాము కాటు వేస్తే అంతే సంగతులు.. అయితే పాము విషం నుంచి మనుషుల ప్రాణాలను కాపాడుతుంది ఒక జంతువు అని మీకు తెలుసా..? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. మనిషి ప్రాణాలు నిలబెట్టే యాంటీ-వెనమ్ తయారీకి ఆ జంతువు రక్తమే ప్రధాన ఆధారం. అసలు ఆ జంతువు ఏంటి? శాస్త్రవేత్తలు దానినే ఎందుకు ఎంచుకుంటారు? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

పాము కాటు వేసినప్పుడు మనిషి ప్రాణాలు కాపాడటానికి వైద్యులు ఇచ్చే ఏకైక ఔషధం యాంటీ-వెనమ్. అయితే ప్రాణాన్ని నిలబెట్టే ఈ మందును తయారు చేయడానికి గుర్రం కీలక పాత్ర పోషిస్తుందని మీకు తెలుసా..? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అసలు గుర్రం శరీరం నుంచి పాము విషానికి విరుగుడు ఎలా తయారు చేస్తారు..? ఈ ప్రక్రియలో గుర్రాలకు ఏమైనా ప్రమాదం ఉంటుందా..? అనే డౌట్లు చాలా మందికి ఉంటాయి. పాము విషానికి విరుగుడు తయారు చేయడానికి శాస్త్రవేత్తలు గుర్రాలనే ప్రధానంగా ఎంచుకోవడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. గుర్రాలు శరీర పరిమాణంలో పెద్దవిగా ఉండటం వల్ల వాటిలో రక్తం పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. వీటి రోగనిరోధక వ్యవస్థ చాలా బలంగా పనిచేస్తుంది. విషానికి వ్యతిరేకంగా యాంటీబాడీలను వేగంగా, అధిక మొత్తంలో ఉత్పత్తి చేసే సామర్థ్యం గుర్రాలకు సహజంగానే ఉంటుంది.
విరుగుడు తయారీ ప్రక్రియ ఎలా జరుగుతుంది?
యాంటీ-వెనమ్ తయారీ అనేది అత్యంత జాగ్రత్తగా, శాస్త్రీయ పద్ధతిలో జరిగే ప్రక్రియ. ఇది ప్రధానంగా నాలుగు దశల్లో పూర్తవుతుంది.
విషం సేకరణ: ముందుగా నాగుపాము, కట్లపాము, రక్తపింజర వంటి విషపూరిత పాముల నుంచి నిపుణుల పర్యవేక్షణలో విషాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత దానిని గడ్డకట్టించి పొడి రూపంలోకి మారుస్తారు.
గుర్రానికి ఇంజెక్షన్ ఇవ్వడం: సేకరించిన విషాన్ని నీటిలో కలిపి, గుర్రానికి ఏమాత్రం హాని కలగని అత్యంత స్వల్ప మోతాదులో దాని శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తారు.
యాంటీబాడీల ఉత్పత్తి: గుర్రం శరీరంలోకి విషం వెళ్లగానే, దాని రోగనిరోధక వ్యవస్థ అప్రమత్తమై ఆ విషాన్ని నిర్వీర్యం చేయడానికి యాంటీబాడీలను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. ఇలా కొన్ని వారాల పాటు క్రమంగా విషం మోతాదును కొద్దికొద్దిగా పెంచుతూ ఇంజెక్షన్లు ఇస్తారు. దీంతో గుర్రం రక్తంలో ఆ విషాన్ని ఎదుర్కొనే శక్తివంతమైన యాంటీబాడీలు పూర్తిస్థాయిలో తయారవుతాయి.
రక్త సేకరణ, శుద్ధి: గుర్రం రక్తంలో యాంటీబాడీలు గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత దాని మెడ భాగంలోని నరం నుంచి కొద్ది మొత్తంలో రక్తాన్ని సేకరిస్తారు. ఆ రక్తం నుంచి ఎర్ర రక్తకణాలను వేరు చేసి, కేవలం యాంటీబాడీలు ఉండే ప్లాస్మాను మాత్రమే తీసుకుంటారు. దానిని ప్రత్యేక పద్ధతుల్లో శుద్ధి చేసి యాంటీ-వెనమ్ ఇంజెక్షన్లుగా తయారు చేస్తారు.
ఈ ప్రక్రియలో గుర్రాలకు ప్రమాదం ఉంటుందా?
ఈ విషయంలో జంతు ప్రేమికులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే.. ఈ ప్రక్రియ అంతా జంతు సంక్షేమ నిబంధనలకు అనుగుణంగా, పశువైద్యుల పర్యవేక్షణలో జరుగుతుంది. గుర్రానికి ఇచ్చే విషం మోతాదు దాని ప్రాణాలకు ముప్పు కలిగించనంత తక్కువగా ఉంటుంది. పైగా రక్తం సేకరించిన తర్వాత గుర్రాలకు పౌష్టికాహారం, తగిన విశ్రాంతి ఇస్తూ వాటి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు.
మొత్తానికి మనిషికి యమపాశంలా మారే పాము విషాన్ని నిర్వీర్యం చేయడంలో గుర్రాలు నిశ్శబ్దంగా ప్రాణదాతలుగా నిలుస్తున్నాయి. అందుకే పాము కాటుకు గురైనప్పుడు నాటు వైద్యాల వైపు వెళ్లకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లి ఈ యాంటీ-వెనమ్ తీసుకుంటే ప్రాణాలను సురక్షితంగా కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
