Cyber Crimes: స్మార్ట్ ఫోన్‌లో ఆ యాప్‌పై క్లిక్ చేస్తే రూ.8 లక్షలు ఆంఫట్! సైబర్ నేరగాళ్ల వలలో నుంచి తన సొమ్మును ఎలా రాబట్టాడంటే..
సైబర్ దుండగులు ఒక్కోసారి ఇతరుల బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు కాజేస్తుంటారు. తీరా డబ్బు పోయాక ఏం చెయ్యాలో తెలియక లభోదిభోమంటుంటారు. ఐతే ఓ రైతు మాత్రం ముక్కు పిండిమరీ తన ఖాతా నుంచి కాజేసిన లక్షల రూపాయల సొమ్మును..
సైబర్ దుండగులు ఒక్కోసారి ఇతరుల బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు కాజేస్తుంటారు. తీరా డబ్బు పోయాక ఏం చెయ్యాలో తెలియక లభోదిభోమంటుంటారు. ఐతే ఓ రైతు మాత్రం ముక్కు పిండిమరీ తన ఖాతా నుంచి కాజేసిన లక్షల రూపాయల సొమ్మును రాబట్టుకున్నాడు. రాజస్థాన్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూపింది. వివరాల్లోకెళ్తే.. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌కు చెందిన పవన్‌కుమార్ సోనీ (55) అనే రైతుకు హర్షవర్ధన్ (26) అనే కుమారుడు ఢిల్లీలోని ద్వారకలో చదువుకుంటున్నాడు. వ్యవసాయ ఖర్చుల కోసం పవన్‌కుమార్ అప్పటికే రూ.8 లక్షలు లోన్ తీసుకున్నాడు. శ్రీగంగానగర్‌లోని తండ్రి బ్యాంకు ఖాతా హర్షవర్ధన్ ఫోన్ నంబర్‌తో రిజిస్టరై ఉంది. ఈ క్రమంలో జనవరి 7న హర్షవర్ధన్ ఫోన్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ‘మీ బ్యాంకు అకౌంట్ బ్లాక్ అయ్యింది. వెంటనే కేవైసీ అప్‌డేట్ చేసుకోండి’ అనేది ఆ మేసేజ్ సారాంశం. వెంటనే తన మొబైల్‌లోని ఎస్‌బీఐ యోనో యాప్‌పై హర్షవర్దన్ క్లిక్ చేశాడు. ఆ లింక్‌పై క్లిక్ చేయగానే మరో డూప్లికేట్ యాప్ ఇన్‌స్టాల్ అయిపోయింది. అది కూడా అప్‌డేట్ చేయాలేమో అనుకొని యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేశాడు. వెంటనే బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు డెబిట్ అవుతున్నట్లు వరుసగా మెసేజ్‌లు వచ్చాయి. సైబర్ నేరగాళ్లు డూప్లికేట్ యాప్ ద్వారా మొబైల్‌ను హ్యాక్ చేసి డబ్బులు దోచుకుంటున్నారని తెలుసుకునే లోపే తన తండ్రి పవన్‌కుమార్ సోనీ ఖాతా నుంచి రూ.8,03,899 డెబిట్ అయిపోయాయి. వెంటనే శ్రీగంగానగర్‌లో ఉంటున్న తన తండ్రికి హర్షవర్ధన్ ఫోన్ చేసి చెప్పడంతో అతడు బ్యాంకు మేనేజర్‌కు ఫిర్యాదు చేశాడు.
మరోవైపు హర్షవర్ధన్ ద్వారకలోని సైబర్ సెల్ అధికారులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు. పవన్‌కుమార్ సోనీ ఖాతాను బ్యాంకు మేనేజర్ పరిశీలించగా మొత్తం మూడు ఖాతాల్లోకి డబ్బు ట్రాన్ఫర్ అయినట్లు గుర్తించాడు. పేయూ ఖాతాలో ఒకసారి రూ.5 లక్షలు, మరోసారి రూ.1.24లక్షల చొప్పున బదిలీ అయ్యాయి. ఆ తర్వాత రూ.1.54 లక్షలు సీసీఅవెన్యూ ఖాతాలోకి బదిలీ అయ్యింది. మిగిలిన రూ.25వేలు యాక్సిస్ బ్యాంకు ఖాతాలోజమ అయ్యినట్లు బ్యాంక్ అధికారులు గుర్తించారు. పేయూ, సీసీఅవెన్యూ అనేవి డిజిటల్ పేమెంట్ సంస్థలు. ఇవి వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసినప్పుడు డిజిటల్ పేమెంట్ రూపంలో నగదును సేకరించి, వ్యాపారుల ఖాతాల్లోకి జమ చేస్తుంటాయి. బ్యాంకు మేనేజర్ పేయూ, సీసీఅవెన్యూ సంస్థలకు మెయిల్ పంపగా.. పేయూ మాత్రం రెండు రోజుల్లో రూ.6.24 లక్షలను తిరిగి రైతు ఖాతాలో జమచేసింది. సీసీ అవెన్యూ ఖాతాలోని రూ.1.54 లక్షల్లో రూ.1.20 లక్షల నగదును సైబర్ నేరగాళ్లు కోల్‌కతాలోని ఓ జియో స్టోర్‌లో ఖర్చు పెట్టినట్లు తెలిసింది. దీనిపై హర్షవర్ధన్ కోల్‌కతా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే ఢిల్లీ పోలీసుల నుంచి సమాచారం అందితే తప్ప ఏమీ చేయలేమని చేతులెత్తేశారు. ఇక జనవరి 23న ద్వారక పోలీసులు యాక్సిస్ బ్యాంకు, సీసీ అవెన్యూలో జమ అయిన నగదుపై ఫిర్యాదులు స్వీకరించి మిగతా డబ్బు కూడా త్వరలో జమ అయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు. అపరిచిత నంబర్ల నుంచి వచ్చిన మెసేజ్‌లకు స్పందించి తనలా మోసపోవద్దని చెబుతున్నాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.