Telangana: ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్.. అదే నా ధ్యేయమంటూ..
పట్టణాల వైపు పరుగులు తీసే యువతరం.. తమ పుట్టిన గ్రామాలను, అక్కడి రాజకీయాలను పట్టించుకోరనే వాదనలను ప్రస్తుత సర్పంచ్ ఎన్నికలు కొట్టిపారేస్తున్నాయి. చదువు, ఉద్యోగాల పేరుతో మెజారిటీ యువత గ్రామాలకు దూరమైనా.. కొందరు మాత్రం తమ సామాజిక బాధ్యతను గుర్తించి గ్రామాభివృద్ధికి నడుం బిగిస్తున్నారు. ఎంబీబీఎస్ చదవుతున్న యువతి గ్రామాభివృద్ధే లక్ష్యమంటూ సర్పంచ్ బరిలో నిలిచింది.

పల్లెల్లో పుట్టి పెరిగిన యువత చదువు, ఉద్యోగం, ఉపాధి పేరుతో పట్టణాలకే పరిమితమవుతోంది. పండుగలు, శుభకార్యాలు, సెలవులకే ఊరికి వచ్చి వెళ్తున్నారు. దీంతో చాలా గ్రామాల్లో రాజకీయాలకు మెజారిటీ యువత దూరంగా ఉంటోంది. ముఖ్యంగా ఉన్నత చదువులు చదివిన వారు ఈ రాజకీయాలు మనకెందుకులే అంటూ తమ పట్టణ జీవితానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. చాలా గ్రామాల్లో ఇదే జరుగుతుంది. కానీ ప్రస్తుత సర్పంచ్ ఎన్నికలు ఈ ధోరణిలో కొంత మార్పు తీసుకువస్తున్నాయి. ఈ ఎన్నికలను పరిశీలిస్తే, హైదరాబాద్, ఇతర నగరాల్లో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న యువత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
ఈ ఆసక్తికర పరిణామాలకు వనపర్తి జిల్లా ఒక మంచి ఉదాహరణగా నిలిచింది. ఇక్కడ ఏకంగా ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థిని సర్పంచ్ ఎన్నికల బరిలోకి దిగి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పెబ్బేరు మండలం శాఖాపూర్(వై) గ్రామానికి చెందిన కేఎన్ నిఖిత సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. నిఖిత ప్రస్తుతం నాగర్ కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం విద్యను అభ్యసిస్తోంది. నిఖిత తండ్రి రాజేంద్ర ప్రసాద్ డిప్యూటీ తహసిల్దార్‌గా, తల్లి చిలకమ్మ టీచర్‌గా పనిచేస్తున్నారు. చిన్న వయసులోనే సర్పంచ్ స్థానానికి పోటీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు వైద్య విద్యను అభ్యసిస్తూనే, మరోవైపు సర్పంచ్ పదవికి పోటీ చేయడం యువతలో కొత్త ఉత్తేజాన్ని నింపుతోంది.
యువత గ్రామాన్ని వదిలి ఉద్యోగాలు, ఉపాధి అంటూ వెళ్తే.. మరి ఊరిని ఎవరు ఉద్ధరిస్తారని నిఖిత ప్రశ్నిస్తోంది. గ్రామాభివృద్ధి పట్ల తనకున్న నిబద్ధతను తెలియజేస్తూ, సర్పంచ్‌గా గెలిస్తే తన గ్రామానికి మెరుగైన అభివృద్ధి బాటలు వేస్తానని స్పష్టం చేసింది. పట్టణాల నుంచి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తున్న యువత పెరుగుతుండటం.. గ్రామాభివృద్ధి పట్ల చూపుతున్న ఆసక్తిని, సామాజిక బాధ్యతను సూచిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
