Indian Railways: టిక్కెట్ క్యాన్సిలేషన్ వల్ల రైల్వేస్‌కు ఎంత ఆదాయమో.. దీనిపై కేంద్ర మంత్రి ఏమన్నారంటే..?
2021-22 ఆర్థిక సంవత్సరంలో కౌంటర్ వద్ద ఈ-టికెట్ల రద్దు వల్ల రూ.694.08 కోట్లు వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో 2022 డిసెంబరు..
మనలో చాలా మంది ప్రయాణం కోసం ముందుగానే రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకుంటారు. అయితే అనుకోని కారణాల వల్ల కొన్ని సందర్భాలలో ఆ టికెట్లను క్యాన్సిల్ కూడా చేస్తుంటారు. అలా చేయడం వల్ల వారు టికెట్‌కు చెల్లించిన మొత్తంలో కొద్ది మాత్రాన్నే రీఫండ్‌గా పొందగలుగుతారు. మిగిలినది ఇండియన్ రైల్వేస్‌కు ఆదాయంగా మిగిలిపోతుంది. రైల్వే పాసింజర్స్ రూల్స్ 2015 ప్రకారం దీనిని విధిస్తారు. అలాగే టికెట్ బుక్ చేసుకున్న ప్రతి సారి కూడా కన్వీనియెన్స్ ఫీజ్‌గా కూడా మనం కొంత మేర చెల్లించవలసి ఉంటుంది. ఈ ఫీజు కూడా రైల్వేస్‌కు ఆదాయమే. అయితే ఇలా క్యాన్సిలేషన్, కన్వీనియెన్స్ ఫీజుల రూపంలో ఇండియన్ రైల్వేస్‌కు ఎంత మొత్తంలో ఆదాయం లభిస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? అది ఎంత అంటే.. తెలిస్తే షాక్ కావాల్సిందే.
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) పార్లమెంటుకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో, ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) ఈ-టికెటింగ్ ప్లాట్‌ఫాం ద్వారా ఆన్‌లైన్ రిజర్వ్‌డ్ ఈ-టిక్కెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికుల నుంచి కన్వీనియెన్స్ ఫీజును వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ-టిక్కెట్లతో సహా రైల్వే ప్రయాణ టిక్కెట్లను రద్దు చేసుకున్నపుడు 2019-20 నుంచి 2022 డిసెంబరు వరకు రూ.1,949.98 కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు. అలాగే 2021-22 ఆర్థిక సంవత్సరంలో కౌంటర్ వద్ద ఈ-టికెట్ల రద్దు వల్ల రూ.694.08 కోట్లు వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో 2022 డిసెంబరు వరకు టికెట్ల క్యాన్సిలేషన్ ద్వారా రూ.604.40 కోట్లు వచ్చినట్లు తెలిపారు.
అలాగే ఎయిర్ కండిషన్డ్ తరగతిలో ప్రయాణించడం కోసం రైలు టికెట్‌ను నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ద్వారా బుక్ చేసుకుని, దానిని ఆ తర్వాత రద్దు చేసుకుంటే, ప్రతి టిక్కెట్‌కు రూ.30 చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలిపారు. యూపీఐ(Unified Payments Interface) ద్వారా బుక్ చేసుకున్న టికెట్‌ను రద్దు చేసుకుంటే, ప్రతి టిక్కెట్‌కు రూ.20 వసూలు చేస్తున్నట్లు తెలిపారు. నాన్ ఏసీ తరగతుల్లో ప్రయాణించడం కోసం తీసుకున్న టిక్కెట్‌ను రద్దు చేసుకోవాలంటే, దానిని నెట్ బ్యాంకింగ్ లేదా డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ద్వారా బుక్ చేసుకుంటే, ప్రతి టికెట్‌కు రూ.15 చొప్పున వసూలు చేస్తున్నట్లు తెలిపారు. యూపీఏ ద్వారా బుక్ చేసుకున్న టిక్కెట్‌ను రద్దు చేయడానికి ప్రతి టికెట్‌కు రూ.10 వసూలు చేస్తున్నట్లు చెప్పారు.
ఈ క్రమంలోనే టికెట్‌ను రద్దు చేసుకునేటపుడు కన్వీనియెన్స్ ఫీజును వసూలు చేయడం లేదని చెప్పారు. రైల్వేలు ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనల ప్రకారం ఐఆర్‌సీటీసీ క్యాన్సిలేషన్ లేదా కన్వీనియెన్స్ ఛార్జీలను వసూలు చేస్తుందన్నారు. ప్రస్తుతం ప్రతి నిమిషానికి 25,000 టికెట్లను బుక్ చేసే సామర్థ్యం రైల్వేలకు ఉందన్నారు. దీనిని నిమిషానికి 2.25 లక్షలకు పెంచాలన్నది తమ లక్ష్యమని తెలిపారు. దీని కోసం సాఫ్ట్‌వేర్‌ను తీసుకొచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం నిమిషానికి 40 వేల విచారణల (enquires)కు సమాధానం చెప్పే సామర్థ్యం రైల్వేలకు ఉందని, రానున్న రోజుల్లో ఈ సంఖ్యను నాలుగు లక్షలకు పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.