08 April 2025
Subhash
ఇంటి అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం సోమవారం రూ.50 చొప్పున పెంచింది. పెరిగిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి.
రాష్ట్రంలో అటు సామాన్యలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై కలిపి ప్రతినెలా రూ.71 కోట్లకు పైగా భారం పడనుంది. రాష్ట్రంలో వినియోగదారులు నెలకు దాదాపు కోటి వరకు సిలిండర్లు కొనుగోలు చేస్తున్నారు.
మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆయా లబ్ధిదారులకు సంబంధించి రూ.21.45 కోట్లను అదనంగా చెల్లించనుంది.
హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.855 నుంచి రూ.905కి పెరిగింది. పంపిణీ కేంద్రాల నుంచి దూరాన్ని బట్టి రవాణా ఛార్జీలను ఉంటాయని గుర్తించుకోండి.
ఉజ్వల పథకం కింద ఇస్తున్న14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర 503 నుంచి 553 రూపాయలకు పెరుగుతుంది. ధర పెరగడంతో సామాన్యులకు కొంత భారం ఏర్పడనుంది.
ప్రతి నెలా గ్యాస్ సిలిండర్ ధరల సవరింపు ఉంటుందని గతంలో ప్రకటించిన కంపెనీలు.. ఆగస్టు 2024 నుంచి ధరలు పెంచుతూ వస్తున్న సంగతి తెలిసిందే.
లీటర్ పెట్రోల్ ధర సుమారు 110 రూపాయలకు చేరుకోవడంతో వాహనదారులు భారాన్ని మోస్తున్నారు. నిత్యావసరాలు పెరుగుదల, ద్రవ్యోల్పణం, ఆర్థిక సంక్షోభం కారణంగా దేశ ప్రజలు సతమతమవుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ ధరలు కూడా పెరగడంతో మధ్యతరగతి వాళ్లు బతకడమే కష్టంగా మారిందని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.