TG Inter Result Date 2025: ఇంటర్ విద్యార్ధులకు అలర్ట్.. ఫలితాల వెల్లడి తేదీలు వచ్చేశాయ్! ఎప్పుడంటే..
పరీక్షలు రాసి పలితాల కోసం ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ఇంటర్ ఫస్ట్, సెకండియర్ విద్యార్ధులకు అలర్ట్. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేసిన ఇంటర్ బోర్డు మార్కులను ఆన్ లైన్ లో క్రోడీకరించే పనిలో పడ్డారు. ఈ విధానం మరో వారంలోనే పూర్తి చేసి ఆ తర్వాత వెనువెంటనే ఫలితాలు విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు..

హైదరాబాద్, ఏప్రిల్ 15: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్ధుల జవాబు పత్రాల మూల్యాంకనం ముగిసిన సంగతి తెలిసిందే. మొత్తం 19 సెంటర్లల్లో మార్చి 19 నుంచి ప్రారంభమైన ఈ మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్ 10వ తేదీతో ముగియనుంది. ప్రతి సెంటర్‌లో దాదాపు 600 నుంచి 1200 మంది వరకు సిబ్బంది మూల్యాంకన విధుల్లో పాల్గొన్నారు. ఇక ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షల్లో వచ్చిన మార్కులను అన్‌లైన్‌లో క్రోడీకరించి ఫలితాల విడుదలకు ఇంటర్ బోర్డు చకచకా ఏర్పాట్లు చేస్తుంది. అంతా సవ్యంగా జరిగితే ఏప్రిల్ 25 లేదంటే 27వ తేదీల్లో ఇంటర్ ఫలితాలు వెల్లడించాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
తెలంగాణ ఇంటర్ 2025 ఫలితాలు
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఏపీలో ఇంటర్ ఫలితాలు రావడంతో తెలంగాణ రాష్ట్ర అధికారులు కూడా కసరత్తులు మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఇంటర్ ఫలితాలను కూడా వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 9.96 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి చేసి మార్కుల ఎంటర్ ప్రక్రియను అధికారులు మొదలుపెట్టారు. ఇక ఏప్రిల్ 20వ తేదీ నాటికి రీ -వెరిఫికేషన్ కూడా పూర్తి అవుతుందని సమాచారం. దీనిని బట్టి చూస్తే ఏప్రిల్ 20 తర్వాత ఏ క్షణమైనా ఫలితాలు విడుదలయ్యే ఛాన్స్ ఉందని స్పష్టంగా తెలుస్తుంది.
ఇక రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలన్నింటికీ వేసవి సెలవులు కూడా ఇచ్చేశారు. జూన్ 1వ తేదీ వరకు జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు కొనసాగనున్నాయి. అనంతరం జూన్ 2వ తేదీ నుంచే జూనియర్ కాలేజీలు పునఃప్రారంభమవుతాయి. ఇక రాష్ట్రంలోని పాఠశాలలకు జూన్ 12వ తేదీ నుంచి కొత్త అకడమిక్ ఇయర్ ప్రారంభమవుతుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.