10th Class Result Date 2025: రేపటితో ముగుస్తున్న ‘టెన్త్’ జవాబు పత్రాల మూల్యాంకనం.. ఫలితాలు ఎప్పుడంటే?
రాష్ట్రంలో పది పరీక్షలు ముగిశాక ఏప్రిల్ 7వ తేదీ నుంచే జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన ఏప్రిల్ 15వ తేదీతో ముగియనుంది. అయితే టార్గెట్ తేదీలోపు మూల్యాంకనం పూర్తి చేసేందుకు హడావుడిగా పేపర్లు దిద్దుతున్నారనే ఆరోపణలొస్తున్నాయి..

హైదరాబాద్, ఏప్రిల్ 14: తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే. పరీక్షలు ముగిశాక ఏప్రిల్ 7వ తేదీ నుంచే జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన ఏప్రిల్ 15వ తేదీతో ముగియనుంది. అయితే టార్గెట్ తేదీలోపు మూల్యాంకనం పూర్తి చేసేందుకు హడావుడిగా పేపర్లు దిద్దుతున్నారనే ఆరోపణలొస్తున్నాయి. ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్ చేత రోజుకు 50 పేపర్లు మూల్యాంకనం చేయిస్తున్నట్టు టీచర్లు గగ్గోలు పెడుతున్నారు. కొన్ని చోట్ల 45 నుంచి 60 వరకు పేపర్లు దిద్దిస్తున్న ఉదంతాలున్నాయని, ఒక్కో టీచర్‌కు 40 సమాధానపత్రాలు ఇవ్వాడానికి బదులు గరిష్టంగా పేపర్లు దిద్దిస్తున్నారని అంటున్నారు.
హైదరాబాద్ జిల్లాలో 50 పేపర్లు ఇస్తున్నారనీ, సిద్దిపేట జిల్లాలోనూ 45 నుంచి 50 వరకు పేపర్లు ఇచ్చినట్టు టీచర్లు చెబుతున్నారు. మూల్యాంకనాన్ని ఈ నెల 15తో పూర్తిచేయాల్సి ఉండగా.. కొన్ని జిల్లాల్లో సోషల్, ఇంగ్లిష్ పేపర్ల మూల్యాంకనం ఇంకా పూర్తికాలేదని అంటున్నారు. దీంతో మూల్యాంకనం త్వరగా పూర్తిచేయాలని రోజుకు 50 పేపర్లు ఇస్తున్నట్టు చెబుతున్నారు. ఇక అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకనం చేసిన తర్వాత మార్కుల క్రోడీకరణ ప్రక్రియను స్క్రూటీనైజర్లు పూర్తి చేస్తారు. ఇలా ఒక్కో స్క్రూటీనైజర్‌కు రోజుకు 200 వరకు పేపర్లు ఇస్తున్నారు. దీంతో పనిభారం ఎక్కువవడంతో స్క్రూటీనైజర్లు తలలు పట్టుకుంటున్నారు.
పరిమితికి మించి తమతో పదో తరగతి మూల్యాంకన చేయిస్తున్నందున పారితోషికాన్ని పెంచాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అసిస్టెంట్ ఎగ్జామినర్‌కు ఒక పేపర్‌కు రూ.10, కన్వెయన్స్ కింద రోజుకు రూ.50 చెల్లిస్తున్నారు. ఇలా రోజుకు రూ.500 చెల్లిస్తున్నారు. గతేడాది మూల్యాంకనం పారితోషికాన్ని ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేశారు. ఈయేడు మాత్రం మూల్యాంకనం ముగిసిన రోజు పారితోషికాన్ని చెల్లించాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. రేపటికి మూల్యాంకనం పూర్తవకపోతే ఫలితాల వెల్లడి కాస్త అలస్యమయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలు వెల్లడిస్తామన్న విద్యాశాఖ తాజా పరిణామాల దృష్ట్యా మరికాస్త ఆలస్యంగా వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.