Pre Primary in Govt Schools: ఇక సర్కారు బడుల్లోనూ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ క్లాసులు.. ఉచిత రవాణా సౌకర్యం కూడా!
సాధారణంగా సర్కారు బడుల్లో ఒకటో తరగతి నుంచి మాత్రమే చదువుకునే అవకాశం ఉంటుంది. అంగన్‌వాడీ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ నిర్వహించేవారు. ఇక ప్రైవేట్ పాఠశాలల్లో అయితే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు నడుస్తున్నాయి. అయితే ప్రభుత్వ బడుల్లో విద్యార్ధుల సంఖ్య పెంచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే..

హైదరాబాద్, ఏప్రిల్ 14: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై ప్రీ ప్రైమరీ తరగతులు కూడా ప్రారంభించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం సర్కారు బడుల్లో ఒకటో తరగతి నుంచి మాత్రమే చదువుకునే అవకాశం ఉంది. అంగన్‌వాడీ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ నిర్వహించేవారు. ఇక ప్రైవేట్ పాఠశాలల్లో అయితే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు నడుస్తున్నాయి. దీంతో మూడేళ్లు నిండిన పిల్లలను తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రమే చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందువల్ల ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తే అటు తల్లిదండ్రులకు ఆర్ధిక బరోసా ఇవ్వడంతోపాటు ఇటు ఏటేటా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందన్న భావన ప్రభుత్వానికి ఉండదు. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో శిశు విద్యను ప్రారంభించాలని నిర్ణయించింది. త్వరలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించి, పిల్లలకు ఉచిత రవాణా సౌకర్యం కూడా కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 18,133 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 50కి మించి విద్యార్థులున్న పాఠశాలలు కేవలం 6 వేలు మాత్రమే. ఇక 10 మంది, 20 మంది విద్యార్ధులున్న పాఠశాలలు లెక్కకు మించి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రవేశపెడతారో తెలియాల్సి ఉంది. ఇక దాదాపు 15 వేల అంగన్‌వాడీ కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణాల్లోనే నడుస్తున్నాయి. ఒకవేళ ప్రీ ప్రైమరీ తరగతులను ప్రవేశపెడితే పాఠాలు బోధించేందుకు అంగన్‌వాడీ టీచర్లనే ఏర్పాటు చేస్తారా? లేదంటే ప్రభుత్వ ఉపాధ్యాయులే పాఠాలు చెబుతారా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. వచ్చే విద్యా సంవత్సరం (2025-26) నుంచే మండలానికి 1 లేదా 2 పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి కారణం ఆంగ్ల మాధ్యమం లేకపోవడమేనని భావించిన ప్రభుత్వం 2022-23 నుంచే ఇంగ్లిష్ మీడియం ప్రారంభించారు. అయినా విద్యార్థుల సంఖ్య పెరగకపోగా, తగ్గుతూ వచ్చింది. పేరుకు తప్ప ఆంగ్ల మాధ్యమంలో బోధన జరగకపోవడమే అందుకు కారణం. ప్రీ ప్రైమరీ తరగతులు ప్రవేశపెడితే పరిస్థితిలో మార్పువస్తుందా అనేది సందేహాత్మకంగా ఉంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.