మీ దగ్గరున్న 1 రూపాయి నాణెం తయారీ విలువ ఎంతో మీకు తెలుసా..? తెలిస్తే షాకే..!
ఒక రూపాయి నాణేం తయారు చేయడానికి 1.11 రూపాయలు ఖర్చవుతుండటంతో రాబోవు రోజుల్లో రూపాయి నాణేం ముద్రణ నిలిపివేసే అవకాశాలున్నాయి.
నోట్లతో పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తే సరిపోదు, చిన్న వ్యాపారానికి చిల్లర ఉండాలి. భారతీయ కరెన్సీలో రిటైల్ నాణేలు అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి మీ వద్ద చిల్లర నాణేలు కూడా ఉన్నాయా? అయితే మీరు ఈ వార్తను తప్పక చదవండి.
కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి నాణేల ముద్రణను నిలిపివేస్తుందన్న ఉహాగానాలు నెలకొన్న నేపథ్యంలో అసలు ఒక్క రూపాయి నాణెం తయారు చేయడానికి ఎంత ఖర్చు వస్తుందన్న ఆలోచనలో పడిపోయారు. సాధారణంగా ఏదైనా నాణెం తయారీకి అయ్యే ఖర్చు నాణెం విలువ కంటే తక్కువగా ఉంటుంది. అయితే ఖర్చు ఎక్కువైతే అలాంటి నాణేలు తయారు చేయరు. ఒకప్పుడు నాణేలా పరిమాణం పెద్దదిగా ఉండేది.. కాని రాను రాను చాలా నాణేలు చిన్న పరిమాణంలో వస్తున్నాయి. ఒకప్పుడు పెద్దగా ఉన్న నాణేలు క్రమంగా చిన్నవిగా మారాయి. ఈ తరుణంలో ప్రస్థుతం ఉన్న ఒక్క రూపాయి నాణేం తయారికి దాని ధర కంటే ఎక్కువ ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది.
ఒక రూపాయి నాణెం తయారు చేయడానికి 1.11 రూపాయలు ఖర్చవుతుందట. 1992 నుంచి చెలామణిలో ఉన్న ఒక్క రూపాయి నాణెం తయారీ ఖర్చుపై 2018లో నివేదిక రూపొందించిన ఆర్బీఐ అందుకు రూ.1.11 పైసలు అవుతుందని వెల్లడించింది. ప్రస్తుతం 1 రూపాయి నాణెం స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేస్తున్నారు. దీని వ్యాసార్థం 21.93 mm, మందం 1.45 mm మరియు బరువు 3.76 గ్రాములు. ఒక రూపాయితో పోల్చితే మిగతా నాణేల ఉత్పత్తి ఖర్చు తగ్గుతుందని చెబుతున్నారు. అంటే రూ.2 నాణెం ఉత్పత్తి చేయడానికి రూ.1.28, రూ.5 నాణెం ఉత్పత్తి చేయడానికి రూ.3.69, రూ.10 నాణెం ముద్రించడానికి రూ.5.54 ఖర్చవుతుంది. కానీ 1 రూపాయి చేయడానికి 1.11 రూపాయలు ఖర్చవుతుందని చెబుతోంది ఆర్బీఐ.
ఈ నాణేలను ముంబై మరియు హైదరాబాద్‌లోని ఇండియన్ గవర్నమెంట్ మింట్ (IGM) ముద్రించింది. హైదరాబాద్ మింట్ ఈ నాణెం ఉత్పత్తి ధరను వెల్లడించింది. కానీ ముంబై మింట్ వెల్లడించలేదు. ముంబై మింట్ RTI చట్టం 2005 సెక్షన్ 8(1)(d) ప్రకారం, కాబట్టి ఎలాంటి సమాచారం వెల్లడించే అవకాశం లేదు. దీంతో 2018లో వెల్లడయిన ఖర్చు వివరాలు, హైదరాబాద్ మింట్‌కి సంబంధించినవి. కేంద్రం నివేదిక ప్రకారం 2015-16లో 215.1 కోట్ల నాణేలు ముద్రించబడ్డాయి. అలాగే 2016-17 ఆర్థిక సంవత్సరంలో 220.1 కోట్ల నాణేలను ముద్రించారు.
ప్రస్తుతం ఒక్క రూపాయి ముద్రణకు ఎంత ఖర్చవుతుందో తెలియదు. అయితే 2018 నుంచి 2024 వరకు ద్రవ్యోల్బణం గణనీయంగా పెరిగింది. అంటే ధరలు బాగా పెరిగాయి. తద్వారా రూపాయి నాణేల తయారీ వ్యయం కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా ముద్రించడం కంటే ఆపడమే మంచిదన్న వాదన వినిపిస్తోంది.