ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. జనవరి 1 నుంచి మారనున్న రూల్స్.. జేబుకు చిల్లు..
ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నిబంధనల్లో జనవరి నుండి కీలక మార్పులు రానున్నాయి. ఆన్‌లైన్ గేమింగ్, వాలెట్ లోడ్లు, ప్రయాణ ఖర్చులపై కొత్త ఫీజులు వర్తిస్తాయి. రివార్డ్ పాయింట్ల విధానంలోనూ కోత విధించారు. అసలు ఎంత ఛార్జ్ చేస్తారు..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా.. అయితే ఇది మీకోసమే. జనవరి నుంచి ఈ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ ఫీజులను, రివార్డ్ పాయింట్ల నిబంధనలను సవరించింది. ఈ మార్పుల వల్ల ఆన్‌లైన్ గేమింగ్, వాలెట్ లోడ్లు, ప్రయాణ ఖర్చులు మరింత భారం కానున్నాయి.
ఆన్‌లైన్ గేమింగ్‌పై 2శాతం
డ్రీమ్ 11, ఎంపీఎల్, జంగ్లీ గేమ్స్, రమ్మీ వంటి ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో క్రెడిట్ కార్డ్ ద్వారా చేసే చెల్లింపులు ఇకపై ఖరీదైనవి కానున్నాయి. ప్రతి లావాదేవీపై 2శాతం ట్రాన్సాక్షన్ ఫీజు విధించాలని బ్యాంక్ నిర్ణయించింది. గేమింగ్ ప్రియులకు ఇది పెద్ద దెబ్బ అనే చెప్పాలి.
వాలెట్ లోడ్ చేయడం కూడా ఖరీదే!
అమెజాన్ పే, పేటీఎమ్, మొబిక్విక్ వంటి వాలెట్లలోకి మీ క్రెడిట్ కార్డ్ ద్వారా డబ్బులు లోడ్ చేస్తున్నారా..? అయితే కొత్త నిబంధనల ప్రకారం.. ఒకవేళ మీరు రూ.5,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని వాలెట్‌లో యాడ్ చేస్తే దానిపై 1శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రయాణ ఖర్చులపై అదనపు భారం
ట్రాన్స్‌పోర్ట్ మర్చంట్ కేటగిరీల కింద చేసే ఖర్చులపై కూడా బ్యాంక్ కన్ను పడింది. ఒకవేళ మీరు రవాణా సేవల కోసం రూ.50,000 కంటే ఎక్కువ లావాదేవీ చేస్తే, అదనంగా 1శాతం ఫీజు వర్తిస్తుంది. తరచుగా ప్రయాణాలు చేసే వారికి ఇది అదనపు ఖర్చు కానుంది.
రివార్డ్ పాయింట్లలో కోత
2026 నుండి రివార్డ్ పాయింట్ల విధానంలో కూడా మార్పులు రానున్నాయి. ఇన్సూరెన్స్, రవాణా ఖర్చులపై వచ్చే రివార్డ్ పాయింట్లపై బ్యాంక్ పరిమితులు విధించింది. దీనివల్ల గతంలోలాగా అన్ని ఖర్చులపై ఒకే రకమైన పాయింట్లు రావు. కొన్ని ప్రీమియం కార్డులకు మాత్రమే పాత రేట్లు వర్తిస్తాయి.
సినిమా ప్రియులకు నిరాశ
బుక్ మై షో ద్వారా లభించే బై వన్ గెట్ వన్ లేదా ఉచిత టిక్కెట్ల ఆఫర్లపై నిబంధనలు కఠినతరం అయ్యాయి. కొన్ని కార్డులకు ఈ సదుపాయాన్ని పూర్తిగా తొలగించగా, మరికొన్ని కార్డులపై త్రైమాసికానికి నిర్దిష్ట మొత్తం ఖర్చు చేస్తేనే ఈ ఆఫర్ వర్తిస్తుందని బ్యాంక్ స్పష్టం చేసింది.
విదేశీ ప్రయాణాలు – యాడ్-ఆన్ కార్డులు
ఇకపై యాడ్-ఆన్ కార్డుల కోసం వన్-టైమ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. విదేశీ కరెన్సీ లావాదేవీలపై డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ ఫీజులను పెంచారు. దీనివల్ల అంతర్జాతీయ షాపింగ్ మరింత భారం కానుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




