AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Account: మీకు ఒకే బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే జాగ్రత్త.. ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి..!

Bank Account: కరోనా మహమ్మారి కారణంగా బ్యాంకుల కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. నిజానికి మహమ్మారికి ముందే కొన్ని సహకార బ్యాంకులు ఇబ్బందుల్లో పడిపోయాయి...

Bank Account: మీకు ఒకే బ్యాంక్ అకౌంట్ ఉందా? అయితే జాగ్రత్త.. ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి..!
Bank Account
Subhash Goud
|

Updated on: Aug 06, 2021 | 9:47 AM

Share

Bank Account: కరోనా మహమ్మారి కారణంగా బ్యాంకుల కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. నిజానికి మహమ్మారికి ముందే కొన్ని సహకార బ్యాంకులు ఇబ్బందుల్లో పడిపోయాయి. కొన్ని షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల పనితీరు సైతం గాడి తప్పింది. దీంతో ఆయా బ్యాంకుల ఖాతాదారుల ప్రయోజనాలను సంరక్షిచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో బ్యాంకులలో ఎక్కువగా పొదుపు చేస్తున్నవారు.. తమ డిపాజిట్లు సురక్షితంగా ఉన్నాయా లేదా అని ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్య ఎదురు కాకుండా ఉండాలంటే.. పొదుపు చేయడానికి ముందే డబ్బును బ్యాంక్ డిపాజిట్లలో ఎలా సురక్షితంగా పెట్టుబడి పెట్టాలో గుర్తించాలని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు.

బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో డబ్బులు దాచుకునేవారు ఒకే బ్యాంకును ఎంచుకోకూడదని కొందరు సలహాలు ఇస్తున్నారు. ఒక వేళా బ్యాంకు దివాళా తీస్తే ఖాతాదారులు నష్టపోవాల్సి ఉంటుంది. చాలా మంది బ్యాంకు బ్రాంచ్‌ ఇంటికి దగ్గరగా ఉందనో, లేక అక్కడి ఉద్యోగులు ఇతర బ్యాంకుల కంటే ఎక్కువ సహాయపడతారనో భావిస్తుంటారు. డిజిటల్ టెక్నాలజీకి దూరంగా ఉండేవారు, సీనియర్ సిటిజన్లు ఈ పద్ధతిని అనుసరిస్తారు. మీ డిపాజిట్లను మూడు, నాలుగు బ్యాంకుల్లో.. వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టాలి. అవి ప్రైవేట్ బ్యాంకులైనా, ప్రభుత్వ బ్యాంకులైనా ఫర్వాలేదు. వీటిలో ఏదైనా ఒక బ్యాంకు ఇబ్బందుల్లో పడితే.. ఇతర బ్యాంకుల్లోని డబ్బు భద్రంగా ఉంటుంది. సంబంధిత డిపాజిట్ల నుంచి ఆదాయం కూడా వస్తుంది. చాలా మంది కస్టమర్లు ఒకే బ్యాంకులో తమ డబ్బును పొదుపు చేస్తుంటారు. అలాంటి సమయాల్లో ఏదైనా బ్యాంకు దివాలా తీస్తే ఆదాయం తగ్గిపోవడమే కాకుండా డబ్బుల పరంగా కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే ఒకే బ్యాంకులో కాకుండా పొదుపులో కొంత భాగాన్ని వేరే అకౌంట్‌కు మళ్లించడం మంచిదంటున్నారు నిపుణులు.

దివాలా తీసిన బ్యాంకు వేరే బ్యాంకుకు మళ్లింపు..

అయితే బ్యాంకింగ్‌ వ్యవస్థ ఒక వ్యాపారం లాంటిది. కొన్ని సందర్భాలలో వ్యాపారాల్లో నష్టపోవడం సహజం. ఇది బ్యాంకులకు కూడా వర్తిస్తుంది. మామూలుగా ఒక బ్యాంకు నిర్దిష్ట వడ్డీ రేటుతో డబ్బు తీసుకుంటుంది. ఈ డబ్బును అధిక వడ్డీ రేటుతో ఖాతాదారులకు అప్పుగా ఇస్తుంది. అయితే బ్యాంకులకు రావాల్సిన డబ్బు ఆగిపోతే.. ఆ ప్రభావం కస్టమర్లు అందరిపై పడుతుంది. ఈ సందర్భంలో డిపాజిట్లలో కొంత భాగాన్ని బ్యాంకులు తిరిగి చెల్లించకపోవచ్చు. ఒక బ్యాంకు దివాలా తీసే దశకు చేరుకున్నప్పుడు.. ఆర్బీఐ దాన్ని మరో బ్యాంకులో విలీనం చేస్తుంది.

ఇలా బ్యాంకు దివాలా తీసినప్పుడు ఆ బ్యాంకుల్లో చేసిన డిపాజిట్ల ఉపసంహరణపై ఆర్బీఐ పరిమితులు విధిస్తుంది. ఈ సమస్యలన్నీ ఎదురవ్వకుండా జాగ్రత్తపడాలి. అన్ని అవసరాలకు ఒకే బ్యాంకు, ఒకే అకౌంట్‌పై ఆధారపడటం తగదని ఇలాంటి ఉదాహరణలు నిరూపిస్తున్నాయి.

లోపాలను అవకాశం..

సహకార బ్యాంకులు, చిన్న ప్రైవేటు బ్యాంకులు డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని అందిస్తాయి. అయితే డిపాజిటర్ల నుంచి తీసుకునే డబ్బుతో ఈ బ్యాంకులు ఎలాంటి వ్యాపారాలు చేస్తున్నాయనే అంశంపై పారదర్శకత ఉండదు. రాజకీయ నాయకులు, సమాజంలో పలుకుబడి ఉన్నవారు ఇలాంటి బ్యాంకులను నడుపుతారు. సహకార బ్యాంకింగ్ వ్యవస్థల్లో ఉన్న లోపాలను వీరు అవకాశంగా మల్చుకునే అవకాశం ఉంటుంది. వీటిపై ఆర్బీఐ నియంత్రణ సైతం పరిమితంగానే ఉంటుంది. అందువల్ల ప్రధాన వాణిజ్య బ్యాంకుల కంటే డిపాజిట్లపై అధిక వడ్డీ రేట్లు ఇచ్చినప్పటికీ.. ఇలాంటి బ్యాంకులకు దూరంగా ఉండటం మంచిది.

బ్యాంకుల హిస్టరీ..

అయితే కస్టమర్లు డిపాజిట్ల విషయంలో బ్యాంకుల హిస్టరీని సైతం పరిగణలోకి తీసుకోవడం మంచిది. కొన్ని బ్యాంకులు మొండి బకాయిలతో ఇబ్బంది పడుతుంటాయి. 90 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం తిరిగి చెల్లించని రుణాలను మొండి బకాయిలు అంటారు. కొన్ని ప్రధాన ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా వీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బ్యాంకుల బ్యాడ్ లోన్స్ రేటు వివరాలు ఇంటర్నెట్‌లో లభిస్తాయి. ఈ రేటు అధికంగా ఉండే బ్యాంకుల్లో డిపాజిట్లు చేయాలనుకోవడం మంచి ఆలోచన కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఆర్థికపరమైన బ్యాంకింగ్‌ విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకుని డిపాజిట్లు చేయడం మంచిందంటున్నారు.

ఇవీ కూడా చదవండి

LIC Aadhar Shila scheme: ఎల్‌ఐసీ నుంచి అదిరిపోయే స్కీమ్‌.. రోజుకు రూ.29తో రూ.4 లక్షల ఆదాయం..!

Gas Cylinder: పేటీఎం అదిరిపోయే ఆఫర్‌.. గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేస్తే రూ.2700 క్యాష్‌బ్యాక్‌.. పూర్తి వివరాలు

RBI: బ్యాంకింగ్‌ మోసాలపై ఆర్బీఐ కీలక నిర్ణయం.. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులపై కొత్త నిబంధనలు..!