Honda NX200: అడ్వెంచర్ టూర్ల కోసం స్పెషల్ బైక్.. విడుదల చేసిన హోండా కంపెనీ
స్టైలిష్ లుక్, నాణ్యమైన పనితీరు, మంచి మైలేజీ ఇచ్చే హోండా మోటారు సైకిళ్లకు మన దేశంలో మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీ విడుదల చేసిన అన్ని రకాల ద్విచక్ర వాహనాలు భారతీయుల ఆదరణ పొందాయి. ఈ నేపథ్యలో మార్కెట్ లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవడానికి హోండా కంపెనీ కొత్త మోడళ్లతో ముందుకు వస్తోంది. దానిలో భాగంగా హోండా ఎన్ఎక్స్ 200 బైక్ ను ఇటీవల ఆవిష్కరించింది. రూ.1.68 లక్షల ధరకు అందుబాటులో ఉన్న ఈ బైక్ ప్రత్యేకతలను తెలుసుకుందాం.

దేశంలో అడ్వెంచర్ టూరిజం మార్కెట్ విపరీతంగా పెరుగుతోంది. బైకులపై దూర ప్రాంతాలకు వెళ్లడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. అలాంటి టూర్లకు ఉపయోగపడే హైసెట్ బైక్ లకు మార్కెట్ లో డిమాండ్ ఏర్పడింది. దీంతో వాహన చోదకుల అభిరుచికి అనుగుణంగా పలు మోటారు సైకిళ్ల కంపెనీలు కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి. ఆ క్రమంలోనే హోండా నుంచి ఎన్ఎక్స్ 200 బైక్ మార్కెట్ లోకి వచ్చింది. దీన్ని సీబీ200 ఎక్స్ రీబ్రాండెడ్ వెర్షన్ అని చెప్పవచ్చు. రోజు వారీ అవసరాలతో పాటు అడ్వెంచర్ టూర్లకు కూడా ఈ బైక్ ను వినియోగించుకోవచ్చు. కొత్త మోటారు సైకిల్ విడుదలతో మన దేశంలో ఎన్ఎక్స్ విభాగంలో హోండా బైక్ ల సంఖ్య రెండుకి చేరింది. ఈ రేంజ్ లో ఇప్పటికే ఎన్ఎక్స్ 500 అందుబాటులో ఉంది. ఎన్ఎక్స్ బైకులకు లభిస్తున్న ఆదరణతో ఈ కొత్త బైక్ ను హోండా కంపెనీ తీసుకువచ్చినట్టు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
హోండా ఎన్ఎక్స్ 200 బైక్ మంచి స్లైలిష్ లుక్ తో ఎంతో ఆకట్టుకుంటోంది. పాత వెర్షన్ తో పోల్చితే దీనిలో చిన్న పాటి మార్పులు చేశారు. వాటిలో కొన్ని ప్రధాన ఫీచర్ అప్ గ్రేడ్ లు ఉన్నాయి. డ్యూయల్ చానల్ ఏబీఎస్, బ్లూటూత్ ఇంటిగ్రేషన్ తో కూడిన టీఎఫ్ టీ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఆకట్టుకుంటున్నాయి. కొత్త మోటారు సైకిల్ లో అదే 184 సీసీ సింగిల్ – సిలిండర్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఓబీడీ2బీ కాంప్లియన్స్ తో వచ్చింది. ఇంజిన్ నుంచి 17 పీఎస్ శక్తి, 16.1 ఎన్ఎం టార్కు విడుదల అవుతుంది. స్లిప్పర్ క్లచ్ తో కూడిన ఐదు స్పీడ్ గేర్ బాక్స్ ను ఇంజిన్ కు జత చేశారు. ముందు ఎల్ఈడీ లైటు, ఎక్స్ ఆకారంలోని ఎల్ఈడీ టెయిల్ లైట్, ఎల్ఈడీ ఇండికేటర్లు, మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, ఆకట్టుకునే గ్రాఫిక్ డిజైన్ ఎంతో బాగున్నాయి.
వీటితో పాటు ఎస్ఎంఎస్ అలర్టులు, కాల్ నోటిఫికేషన్లు, నావిగేషన్ సపోర్టు అదనపు ప్రత్యేకతలు. వీటిని హోండా రోడ్ సింక్ యాప్ సహాయంతో ఆపరేట్ చేయవచ్చు. యూఎస్ బీ టైప్ సీ చార్జింగ్ పోర్టు కూడా అమర్చారు. కంపెనీ ప్రీమియం డీలర్ షిప్ ల ద్వారా హోండా ఎన్ఎక్స్ 200 బైక్ విక్రయాలు జరుగుతాయి. మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది. బైక్ బుక్కింగ్ లు ఇప్పటికే మొదలయ్యాయి. ఖాతాదారులకు మార్చి నుంచి డెలివరీలు ప్రారంభించనున్నారు.
మరిన్ని బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








