ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. శుక్రవారం ఉదయం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించింది. చందా కొచ్చర్తో పాటు వీడియోకాన్ ఎండీ వేణుగోపాల్ ధూత్ ఇంటిపై కూడా ఈడీ రైడ్ చేసింది. ముంబయితోపాటు ఇతర ప్రాంతాల్లోని ఐదు కార్యాలయాలు, నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయని ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.
వీడియోకాన్ గ్రూప్‌కు మంజూరు చేసిన రుణాల వివాదంలో చందా కొచ్చర్తో పాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ ఎండీ వేణుగోపాల్ ధూత్‌లపై సీబీఐ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది.
వీడియోకాన్ గ్రూప్‌కు ఐసీఐసీఐ బ్యాంక్ రూ.3,250 కోట్ల మేర రుణాలు మంజూరు చేయడంలో.. అప్పటి సీఈవో చందా కొచ్చర్ కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి ప్రతిఫలంగా వీడియోకాన్ గ్రూప్ ఎండీ ధూత్ చందా భర్త దీపక్ కొచ్చర్ సంస్థలో పెట్టుబడులు పెట్టారని, ఇలా క్విడ్ ప్రో కో లావాదేవీ ద్వారా ఆమె లబ్ధి పొందారని అభియోగాలు ఉన్నాయి. దీనిపై సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఐసీఐసీఐ కూడా స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించింది. ఈ క్రమంలో అవకతవకలు జరిగినట్టు ప్రాథమిక విచారణలో నిర్థారించిన సీబీఐ వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.