Andhra Pradesh: అడవి బిడ్డల అద్భుత పండుగ.. గ్రామస్తుల ఐక్యతను చాటిచెప్పే వేడుక ప్రత్యేకతలివే..
ఏజెన్సీలో పండగైనా.. ఉత్సవమైనా ప్రత్యేకతే.. సాంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ సంబరాలు చేసుకుంటారు అడవి బిడ్డలు. తెలుగు ప్రజలంతా సంక్రాంతి ఘనంగా జరుపుకుంటే.. ఆ సంక్రాంతి ముగింపు కూడా ఉత్సవంలా చేసుకున్నారు గిరిజనులు. సరదాగా సహపంక్తి భోజనాలు చేశారు. బుడియాల విచిత్ర వేషధారణతో సందడే సందడి.. పాడేరు ఏజెన్సీలో జరిగిన గొట్టి పండుగ విశేషాల గురించి తెలుసుకుందాం..

ప్రాంతాలకు తగ్గట్టుగా గిరిజనులు తమ సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తుంటారు. పండుగలు ఉత్సవాల్లో సందడిగా పాల్గొంటారు. ఇక అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీ సంక్రాంతి ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సహపంక్తి భోజనాలు చేసి సరదాగా ఆడి పాడారు. సంక్రాంతి సంబరాల ముగింపులో గొట్టి పండుగది ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఎందుకంటే పండుగ పూట ఎవరి ఇళ్లల్లో వాళ్లు బంధువులు సన్నిహితులతో సరదాగా గడిపితే.. సంక్రాంతి ముగిశాక చేసుకునే గొట్టి పండుగలో గ్రామస్తులంతా కలిసి సంబరాలు చేసుకుంటారు. ఒక్కచోట చేరి ఒకే వేదికపైకి వచ్చి.. సరదాగా గడుపుతామని పాత పాడేరు కు చెందిన శంకరరావు, అప్పలమ్మ తెలిపారు.
గొట్టి పండుగలో సహ పంక్తి భోజనాలకు కూడా ఓ ప్రత్యేకత ఉంది. గ్రామస్తులంతా గ్రామాల్లోని షాపుల వద్దకు వెళ్లి బియ్యం, ఇతర వస్తువులు సేకరిస్తారు. వారికి దినుసులు ఇవ్వడంలో కూడా ఆసక్తి చూపుతుంటారు దుకాణదారులు. విచిత్ర వేషధారణలతో.. బుడియాలు పాటలు పాడుతూ సందడి చేస్తూ ఊరంతా తిరుగుతారు. వచ్చిన దాంతో గ్రామ చావడి, పొలిమేరలో వంటలు చేస్తారు. వాటినే గ్రామస్తులంతా ఒక్కచోట చేరి సరదాగా భోజనం చేస్తామని కోటిబాబు చెప్పారు.
అదే సమయంలో.. గొట్టి పండగ సందర్భంగా అందరూ కలిసి ఒక చోట కూర్చుని సమావేశమవుతారు. ఆ ఏడాది గ్రామానికి కావలసిన తలారి, పశువుల కాపరిని కూడా ఎన్నుకుంటారు. గొట్టి అంటే మాట్లాడుకోవడం అని అర్థం. ఆ రోజంతా గ్రామస్తులంతా ఒక్కచోట చేరి గ్రామం కోసం కలిసి మాట్లాడుకోవడాన్ని పండగలా జరుపుకుంటారు. దాన్నే గొట్టి పండగ అంటారు. చూశారు కదా సంక్రాంతి ఎంత ఆనందంగా ఆరంభమవుతుందో.. అంతే ఆనందంగా ముగింపు కూడా ఒక ఉత్సవంలో నిర్వహిస్తారు పాడేరు ఏజెన్సీలో అడవి బిడ్డలు.
