Andhra News: జమ్మూలో తెలుగులో మాట్లాడుతున్న మహిళ.. ఆరా తీయగా.. 20 ఏళ్ల తర్వాత
ఆ పేద ఇంట్లో అసలుసిసలు పండుగ వేడుక జరిగింది.. వారు జరుపుకున్న సంక్రాంతి పండుగలో ఊరుఊరంతా పాల్గొన్నారు. వారే కాదు ఊరు వాడా సంబరాలు జరుపుకున్నారు. ఇంతకీ ఆ కుటుంబానికి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆ పండుగ ఏంటి? వారికి మంచి జరిగితే ఆ ఊరు ఎందుకు సంబరపడుతుంది. అదేంటో తెలియాలంటే ఈ విషయాలన్నీ తెలుసుకోవాల్సిందే..
ఆ పేద ఇంట్లో అసలుసిసలు పండుగ వేడుక జరిగింది.. సంక్రాంతి పండుగలో ఊరుఊరంతా పాల్గొన్నారు.. కూలీ పనుల కోసం ఇంటి నుండి వెళ్లి తప్పిపోయిన ఓ మహిళ ఇరవై ఏళ్ల సంవత్సరాల తరువాత స్వగ్రామానికి చేరుకున్న ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. జామి మండలం విజినిగిరికి చెందిన వాకాడ కొండమ్మ సుమారు ఇరవై ఏళ్ల క్రితం తన కుటుంబసభ్యులతో కలిసి పొరుగు జిల్లాకు కూలీ పనుల కోసం వెళ్లారు. అక్కడ నుండి తీర్థయాత్రల కోసం బయలుదేరారు. పలు ఆలయాల దర్శనం తరువాత జమ్మూ కాశ్మీర్ కి చేరుకున్నారు. అక్కడ టూరిజం స్పాట్స్ ను అందరితో కలిసి సందర్శించారు. చివరికి తిరిగి జమ్మూకు చేరుకున్నారు. అక్కడ జనరద్దీ ఎక్కువగా ఉండటంతో ఆ జనాల్లో కొండమ్మ తప్పిపోయింది. అప్పట్లో కొండమ్మని వెతికేందుకు మొబైల్ ఫోన్స్ కానీ ఇతర టెక్నాలజీ కానీ లేదు. దీంతో కుటుంబసభ్యులు కొండమ్మ కోసం వెదకడం ప్రారంభించారు. ఒక రోజు కాదు రెండు రోజులు కాదు సుమారు పది రోజులు అక్కడే ఉండి పరిసర ప్రాంతాలన్నీ వెదికారు. అయినా కొండమ్మ ఆచూకీ మాత్రం తెలియలేదు. దీంతో చేసేదిలేక నిస్సహాయంగా జమ్మూ నుండి స్వగ్రామం వచ్చేశారు కొండమ్మ కుటుంబసభ్యులు. దాదాపు ఇరవై ఏళ్లుగా కొండమ్మ ఆచూకీ కానీ, ఆమె క్షేమసమాచారాలు కానీ తెలియలేదు. తరువాత కొన్నేళ్ళకి కొండమ్మ మరణించి ఉంటుందని అంతా అనుకున్నారు.
ఈ క్రమంలో ఇటీవల అదే గ్రామానికి చెందిన సైలాడ సాయి అనే యువకుడు ఆర్మీ జవాన్‌గా జమ్మూలో పనిచేస్తున్నాడు. అందులో భాగంగా జమ్మూలో విధులు నిర్వహిస్తుండగా తెలుగులో మాట్లాడుతున్న కొండమ్మ జవాన్ సాయికి కనిపించింది. వెంటనే కొండమ్మ పేరు, ఊరు కోసం ఆరా తీశాడు. అప్పుడు సాయి గ్రామస్తులకు ఫోన్ చేసి కొండమ్మ చెప్పింది నిజమో కాదో కనుక్కున్నాడు. గ్రామస్తులు కూడా కొండమ్మ తీర్థయాత్రలకు వెళ్లి తప్పిపోయిందని, చనిపోయి ఉంటుందని చెప్పారు.. అయితే.. అది నిజయం కాదని.. కొండమ్మ క్షేమంగా ఉందని, జమ్మూలో యాచక వృత్తి చేసుకుంటూ బ్రతుకుతుందని చెప్పాడు సాయి… ఇది తెలుసుకున్న కుటుంబసభ్యలు సంతోషపడ్డారు..
ఆ వెంటనే విజినిగిరిలో ఉన్న హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ వారు చొరవ తీసుకొని పదివేల రూపాయలు ఏర్పాటు చేసి సాయికి పంపించారు. అమౌంట్ అందుకున్న సాయి విజయనగరం జిల్లాకి చెందిన మరో ఆర్మీ జవాన్ సహకారంతో కొండమ్మను గ్రామానికి చేర్చారు. కొండమ్మ గ్రామానికి రావడంతో కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.. అయితే అప్పటికే భర్త అనారోగ్యంతో మంచం పై ఉన్నాడు. ఈమెకు ఒక కూతురు, కొడుకు ఉన్నారు. అలా అయినవారికి దూరంగా ఇరవై ఏళ్లు అవస్థలు పడి.. చివరకు కొండమ్మ ఇంటికి చేరడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రామమంతా వచ్చి ఆమెను చూసి ఆనందపడుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..