AP News: కొక్కొరొకో ‘కోటి’..! పందెం పుంజా.. మజాకానా.. దెబ్బకు రాత మారిపోలా
పశ్చిమ గోదావరిలో రికార్డు పందెం జరిగింది. తాడేపల్లిగూడెంలో జరిగిన కోడిపందాల్లో ఓ కోడి ఏకంగా కోటి 25 లక్షలు గెలిచింది. డింకీ పందెంలో రసంగిపై గెలిచింది అబ్రాస్ జాతి కోడి. భారీ మొత్తంలో బెట్టింగ్ పెట్టిన నేపథ్యంలో ఇలాంటి పందేలకు కత్తులు కట్టరు. కత్తులు లేకుండా జరిగే ఈ పందాలను డింకీ పందేలు అంటారు. బరిలోకి దిగినవి రెండూ పెద్ద వరస జాతి పుంజులు కావడంతో పందెం రసవత్తరంగానే సాగింది.
ఇలా.. సంక్రాంతి కోడి పందాలు జాతరను తలపించాయి. కొబ్బరి తోటల్లో.. మామిడి తోటల్లో పెద్దఎత్తున కోడి పందాల బరులు దర్శనమిచ్చాయి. ఒక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే 1500కి పైగా బరుల్లో కోడి పందాలు జరిగాయి. పెద్ద పెద్ద కోడి పందాల బరులు ఏర్పాటుతో పాటు.. ఎల్‌ఈడీ స్క్రీన్లలో ప్రత్యక్ష ప్రసారాలు, కామెంట్రీలతో స్టేడియాల తరహాలో కాక్ ఫైట్‌లు కేక పుట్టించాయి.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కోటి 25 లక్షల భారీ కోడి పందెం జరిగింది. హోరా హోరీగా జరిగిన ఈ కోడి పందెంలో.. పందెం రాయుళ్లు భారీగా పందాలు కాశారు. తాడేపల్లిగూడెం పైబోయిన వెంకట్రామయ్య కోడి పందెల బరిలో కోటి 25 లక్షల రూపాయలు పందెం వేశారు. గత పది రోజులుగా ఈ కోటి రూపాయల పందెం గురించి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. గుడివాడ ప్రభాకర్ రావు చెందిన నెమలి పుంజు, రంగాపురం రత్తయ్య రసంగి పుంజు ఈ బరిలోకి దిగాయి.
కోటి 25 లక్షలతో రెండు పుంజులను నిర్వాహకులు పందెంలోకి దింపారు. ఈ పందాన్ని చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి సైతం పందెం రాయుళ్లు బరి వద్దకు వచ్చారు. పందెం మొదలు నుంచి ఆఖరి వరకు ఎంతో ఉత్కంఠగా కోడి పందెం సాగింది. రెండు పుంజులు ఒకదానికొకటి వీరోచకంగా కొట్లాడుకున్నాయి. పందెంలో చివరకు గుడివాడ ప్రభాకర్ రావు(నెమలి పుంజు)విజేతగా నిలిచింది. దాంతో వారందరూ బరి వద్దే పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు.