AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vasavi Penugonda: పెనుగొండ ఊరి పేరు మార్పు వెనుక అసలు కథ ఇదే..! 

ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి మాత జన్మస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ ఇక నుంచి వాసవి పెనుగొండగా మారనుంది. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో బాగంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘంతో సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినతులను సమీక్షించారు. ఈ మేరకు వచ్చిన వినతులను పరిగణనలోకి తీసుకొని పెనుగొండలో వాసవి పెనుగొండగా మార్పు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు..

Vasavi Penugonda: పెనుగొండ ఊరి పేరు మార్పు వెనుక అసలు కథ ఇదే..! 
History Of Vasavi Penugonda Village
B Ravi Kumar
| Edited By: Srilakshmi C|

Updated on: Nov 26, 2025 | 7:50 PM

Share

ఏలూరు, నవంబర్‌ 26:  ఆర్య వైశ్యుల విజ్ఞప్తి మేరకు గతంలోనే పెనుగొండ శ్రీ వాసవి మాతను దర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాసవి పెనుగొండ గా మార్పు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నిన్న ప్రకటన చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియచేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే వాసవి పెనుగొండగా నామకరణం చేసిన సందర్భంగా ఆర్యవైశ్యులు త్వరలో పెనుగొండ వాసవీ ధాంలో కలసి ఆనందాన్ని పంచుకుందామని అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ ట్రస్టు చైర్మన్ గోవిందరాజులు తెలియచేశారు. అలాగే వాసవి పెనుగొండగా నామకరణంచేయడానికి కృషి చేసిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు ధన్యవాదాలు తెలియ చేశారు.

పెనుగొండ క్షేత్రం చరిత్ర ..

పూర్వం పెనుగొండ నగరంలో కుసుమశ్రేష్టి అనే ఉత్తముడు నివసించేవాడు. ఆయన సతీమణి కౌసుంబి సుగుణాల రాశి. పెళ్లయ్యి చాలాకాలం దాకా సంతాన భాగ్యం కలుగలేదు. అందుకని కుసుమశ్రేష్టి యాగం చేశారు. యాగానికి సంతసించిన ఉమామహేశ్వరి దేవి హోమగుండంలో ఉద్భవించి, రెండు ఫలములను ప్రసాదించి కౌసుంబిని భుజించమంది. ఆ ఫలములను భుజించిన కౌసుంబి పది నెలలో ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డను కవలపిల్లలను ప్రసవించింది. పిల్లల జాతకాలను గణించి చూసిన జ్యోతిష్యులు ఉమామహేశ్వరి అంశంతో జన్మించినందువల్ల ఆడశివుకు వాసవి అని విష్ణు అంశంతో పుట్టిన మగ శిశువుకు విరూపాక్షుడని నామకరణం చేయమని చెప్పారు. కుసుమశ్రేష్టి వారి సలహా మేరకు నామకరణం చేశారు. చూసినవారందరు ప్రశంసించేలా పిల్లలను పెంచారు కుసుమశ్రేష్టి. వాసవి విరూపాక్షలు యుక్తవయస్కులైయ్యారు.

ఆ సమయంలో ఉత్తరాది నుంచి దక్షిణాదికి విజయయాత్ర చేస్తూ తన రాజధానికి తిరిగి వెళ్తూ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు రాజు విష్ణువర్ధనుడు. అలా వెళ్తున్నప్పుడు కుసుమశ్రేష్టి ఇంటిముందు నిల్చున్న అపురూప సౌందర్యవతి వాసవిని చూశాడు. అప్సరసలా వున్న వాసవిని రెప్పవాల్చక చూస్తూ నిలబడిపోయాడు. మంత్రిని పిలిచి వెంటనే పెనుగొండకెళ్ళి కుసుమశ్రేష్టిని కలిసి, వాసవిని పెళ్లి చేసుకోవడానికి అతని అనుమతి తీసుకొని రమ్మని పంపాడు విష్ణువర్ధనుడు. మంత్రి రాజు చెప్పిన విషయాన్ని కుసుమశ్రేష్టికి తెలియజేయగా… అయ్యా మేము వైశ్యులము. క్షత్రియ కులానికి చెందిన రాజుతో వియ్యమందుకోలేము. ఇది అసాధ్యం కుసుమశ్రేష్టి. ఆయన నిర్ణయం తెలుసుకుని ఆగ్రహించిన రాజు వాసవితో తన పెళ్లికి అంగీకరించకపోతే ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవడానికి కూడా వెనుకాడనని తెలపమని మంత్రిని మళ్లీ రాయాబారానికి పంపాడు విష్ణువర్ధనుడు. దీంతో పెనుగొండ ప్రజలు అయోమయంలో పడ్డారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా వాసవిని తీసుకెళ్లి వివాహం చేసుకోవడానికి విష్ణువర్ధనుడు సైన్యంతో పాటు పెనుగొండకు బయల్దేరాడు. ఊరి ప్రజలకు ఈ విషయం తెలిసింది. ఈ వివాహాన్ని అంగీరించమని కుసుమశ్రేష్టి అభిప్రాయంతో ఏకీభవించిన ప్రజలు ఈ వివాహం జరగకూడదంటే వాసవి అగ్నిప్రవేశం చేయాలని అన్నారు. రాజుకు భయపడి అగ్నిప్రవేశం చేయడానికి ప్రజలు కూడా ముందుకు వచ్చారు. కుమార్తెను కలిసి ఆమె అభిప్రాయం తెలపమన్నాడు కుసుమశ్రేష్టి. తండ్రి! అంబిక అంశమైన నేను మానవ మాత్రులను వివాహమాడలేను. అందుకే ఈ జ్యోతిష్యులు ఆనాడే నాకు కన్యక అని మరో పేరు కూడా పెట్టారు కదా. అగ్నిప్రవేశం చేయడానికి నాకు అభ్యంతరం లేదు. అలాచేసినా నాకేం కాదు మీరు దిగులుచెందకండి అని వాసవి తండ్రికి పరమేశ్వరిలా దర్శనం ఇచ్చి అందరూ ఒకేసారి అగ్నిప్రవేశం చేయనక్కర్లేదు. ఒక్కో కుటుంబం నుండి ఒక్కొక్కరు చేస్తే చాలని అన్నది. వాసవి తల్లిదండ్రులతో పాటు అగ్నిగుండానికి మూడు ప్రదక్షిణలు చేసింది. అందరు అగ్నిగుండం లోకి దూకి ఆహుతయ్యారు. వాసవి కూడా అగ్నిగుండంలోకి దూకగా ఆమెను తాకిన అగ్నిజ్వాలలు శాంతించాయి.

అంబిక తన విశ్వరూపాన్ని చూపింది. ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మల్ని కాపాడతాను, నన్ను ఆరాధించి పూజించిన వారు అష్టైశ్వర్యాలు పొందగలరు నన్ను కాపాడడం కోసం అగ్నికి ఆహుతి అయినవారందరూ మోక్షం పొందుతారని తెలిపింది వాసవి. విష్ణువర్ధనుడు పెనుగొండ నగరం సరిహద్దు ల్లోనికి ప్రవేశించాడు. వాసవి అగ్ని ప్రవేశం చేసిందని తెలిసి దిగ్భ్రమ చెందాడు. ఆ సమయంలో భద్రకాళి ప్రత్యక్షమై, రాజును తన ఖడ్గంతో సంహరించింది. విష్ణువర్ధనుడి మరణం గురించి తెలిసిన అతని కుమారుడు రాజరాజనరేందడు క్రుంగిపోయాడు. తగని కోరిక వల్ల తన తండ్రి ఆ అంబిక చేత సంవరించ బడ్డాడని తెలుసుకున్నాడు. పెనుగొండకు వెళ్లి వాసవి విరూపాక్షుడిని కలిసి క్షమాభిక్ష పెట్టమని ప్రార్ధించాడు. విరూపాక్షుడిని పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం చేశాడు.

ఆలయ నిర్మాణం…

పెనుగొండ ప్రజలు దేవి ఆజ్ఞ మేరకు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో వాసవి విగ్రహాన్ని ప్రతిష్ట కావించారు. వాసవి ఆలయ గోపురం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఎంతో గొప్ప శిల్పకళా చాతుర్యం చాటిచెప్పే ఇలాంటి గోపురం వేరెక్కడా చూడలేం. ఆలయం లోపలికి ప్రవేశించగానే ఇరువైపులా నందులు, ధ్వజస్తంభం.. దాని ముందు నల్లరాతితో చెక్కిన నాగవిగ్రహం ప్రతిష్టించారు. విశాలమైన ప్రాకారం ప్రదక్షిణలు చేసి వస్తే ముందు దర్శనమిచ్చేది వినాయకుడు, ఆ తర్వాత నవగ్రహాల సన్నిధి, ఆ తర్వాత తోరణమండపం వెనుకవైపు ద్వారం కనిపిస్తుంది.

వెంకటేశ్వరస్వామికి ప్రత్యేకమైన సన్నిధి చిన్నగోపురం వున్న ఆలయంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ట చేశారు. పుట్టలో వున్న శ్రీనివాసుడికి పాలాభిషేకం చేస్తున్న గోమాత విగ్రహం, తర్వాత ఆంజనేయస్వామి విగ్రహం. ప్రధాన మండపంలో మూడు గర్భగుడులు వరుసగా వున్నాయి. ఒక దాంట్లో ఈశ్వరుడు కొలువైయ్యాడు. ఎడమవైపున గర్భగుడిలో మహిషాసురమర్ధిని విగ్రహం దర్శించగలం. ఈశ్వరుడికి కుడివైపున వాసవి దేవి కొలువైం ది. ఒకచేత చిలుక, మరొక చేత వీణ, మరో రెండు చేతులలో తామరపువ్వు, పాశము వున్నాయి. ఎంతో అందంగా అలంకరించిన ఆభరణాలతో వాసవి కోటి సూర్య ప్రకాశంతో జ్వలిస్తోంది. వైశ్యుల కులగౌరవం కాపాడడం కోసం అగ్నిప్రవేశం చేసి ఆత్మత్యాగం చేసిన తల్లి.. ఆ వాసవి దేవి, వంశప్రతిష్ట కోసం కన్యగానే ఆత్మాహుతికి సిద్దపడిన వాసవిదేవి త్యాగానిరతి కొనియాడబడినది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.