AP News: ప్రజాభిమానం పెల్లుబికిందన్న టీడీపీ.. అన్ని గంటలు కారులో ఎలా కూర్చున్నారంటున్న వైసీపీ
చంద్రబాబు రాజమహేంద్రవరం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన భారీ ర్యాలీగా ఇంటికి వచ్చారు. అయితే చంద్రబాబు మాత్రం కారులో నుంచి ఎక్కడా బయటకు రాలేదనేది టీడీపీ నేతల వాదన. హైకోర్టు ఆదేశాలను చంద్రబాబు ఉల్లంఘించారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి హైకోర్టులో ఇప్పటికే వాదనలు కూడా ముగిసాయి.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజులు రిమాండ్‌లో ఉన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. అనారోగ్య కారణాల వల్ల చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలన్న.. ఆయన తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ వచ్చిన రోజే చంద్రబాబు రాజమహేంద్రవరం జైలు నుంచి విడుదలయ్యారు. సాయంత్రం 4.15కు సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు.. బయట ఎదురుచూస్తున్న పార్టీ కేడర్‌కు అభివాదం చేసారు. ఆ తర్వాత ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో భారీ ర్యాలీగా బయలుదేరారు. రాజమహేంద్రవరం జైలు నుంచి చంద్రబాబు కాన్వాయ్ ఏ మార్గంలో రావాలి… ఎక్కడెక్కడ పార్టీ కార్యకర్తలు స్వాగతం పలకాలనేదానికి సంబంధించి సుమారు ఆరున్నర గంటల రూట్ మ్యాప్ సిద్దం చేసారు. అనుకున్న విధంగానే చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు పార్టీ కేడర్ ఆయా జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల నుంచి తరలివచ్చింది. రాజమండ్రి సిటీలోనే చంద్రబాబు కాన్వాయ్ ముందుకు వెళ్లేందుకు గంటల సమయం పట్టింది. ఇలా భారీ ర్యాలీతో విజయవాడ వచ్చేందుకు సుమారు 14 గంటల సమయం పట్టింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు మొదలైన చంద్రబాబు కాన్వాయ్ బుధవారం తెల్లవారుజామున 6 గంటలకు ఇంటికి చేరుకుంది. అనారోగ్యంగా ఉందంటూ బెయిల్ తీసుకున్న చంద్రబాబు ఇన్ని గంటలపాటు కారులో ఎలా ప్రయాణం చేస్తారనే దానిపైనే ఇప్పడు పార్టీల మధ్య మాటల యుద్దానికి తెరదీసింది.
చంద్రబాబుపై సజ్జల సెటైర్లు….అదంతా అభిమానమే అంటున్న అచ్చెన్నాయుడు, పయ్యావుల
చంద్రబాబు రాజమహేంద్రవరం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన భారీ ర్యాలీగా ఇంటికి వచ్చారు. అయితే చంద్రబాబు మాత్రం కారులో నుంచి ఎక్కడా బయటకు రాలేదనేది టీడీపీ నేతల వాదన. హైకోర్టు ఆదేశాలను చంద్రబాబు ఉల్లంఘించారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి హైకోర్టులో ఇప్పటికే వాదనలు కూడా ముగిసాయి. కోర్టు విషయం పక్కన పెడితే చంద్రబాబు యాత్రపై వైసీపీ-టీడీపీ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. చంద్రబాబు విడుదలయ్యాక రోడ్ల మీదకు జనసునామీ వచ్చిందంటున్నారు ఆ పార్టీ నేతలు అచ్చెన్నాయుడు,పయ్యావుల కేశవ్. రాజమండ్రి నుంచి విజయవాడకు 14 గంటల సమయం ఎందుకు పట్టిందో అర్ధం చేసుకోవాలంటూ ప్రభుత్వానికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు పయ్యావుల. చంద్రబాబు కారు దిగలేదని.. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదని అంటున్నారు. చంద్రబాబుపై ఉన్న నమ్మకమే జనాన్ని రోడ్ల మీదకు వచ్చేలా చేసిందన్నారు. రోడ్లపై పడుకుని చంద్రబాబు కారు రాగానే చూడడానికి వచ్చారని అన్నారు. నిబంధనల ప్రకారమే అంతా జరిగిందంటున్నారు. అయితే చంద్రబాబు తీరును తప్పు పట్టారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి. ఆరోగ్యం బాగాలేదని చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందని గుర్తు చేసారు. మూడు గంటల్లో రాజమండ్రి నుంచి విజయవాడ చేరుకోవచ్చని…కానీ చంద్రబాబు రావడానికి 14 గంటలు సమయం పట్టిందన్నారు. అనారోగ్యంగా ఉన్న వ్యక్తి ఎవరైనా అన్ని గంటలు కారులో ఎలా కూర్చుంటారా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు అర్ధరాత్రి వరకు రోడ్లు మీద ఉండి ప్రజలు బ్రహ్మ రథం పట్టారని కొంతమంది వ్యాఖ్యలు చేయటం హాస్యంగా ఉందని సెటైర్లు వేసారు. అటు హైదరాబాద్ లో కూడా చంద్రబాబు వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు .హైదరాబాదులో ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని…అలాంటి ప్రాంతంలో చంద్రబాబు కాన్వాయ్ పెట్టి ప్రజలు భారీగా తరలివచ్చారని చెప్పటం సిగ్గుగా ఉందని విమర్శించారు.హైదరాబాదులో చంద్రబాబు అని చూసేందుకు వచ్చింది పచ్చ బ్యాచ్ మాత్రమేనని అన్నారు సజ్జల.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
