Andhra Pradesh: ప్రధాని మోదీ చేతుల మీదగా ప్రారంభానికి సిద్ధమవుతున్న మరో ఉత్తరాంధ్ర మణిహారం.. ఏంటో తెలుసా..?
త్వరలో ప్రారంభం కాబోయే ఓ కీలక గ్రీన్ ఫీల్డ్ హైవే ఆ వెనుకబడిన ప్రాంత అభివృద్ధికి కీలకం కానుంది.అంతేకాకుండా నూతన వ్యాపార, వ్యవహారాలకు బాటలు వేయనుంది. దేశంలో రవాణా వ్యవస్థను వేగవంతం చేయాలన్న లక్ష్యంతో కేంద్రం చేపట్టిన ఆ ప్రాజెక్ట్ పనులు తుది దశకు చేరుకోవడంతో వాహనదారులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వెనుకబడిన ఆ ప్రాంత ఆర్థిక పురోగతికి కీలకంగా మారనున్న ఆ ప్రాజెక్ట్ ఏది? దాని వల్ల రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనాలు ఏమిటి? ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభం కానుంది? దానివల్ల ఆ ప్రాంత అభివృద్ధి ఎలా సాధ్యం కానున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

దేశ ఆర్థిక వృద్ధిని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం భారత్ మాల పరియోజనలో భాగంగా ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభించింది కేంద్రప్రభుత్వం. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజక్ట్ లో భాగంగా విశాఖపట్నం నుంచి రాయపూర్ వరకు సుమారు 468 కిలోమీటర్ల పొడవులో ఆరు లైన్ల హైవే నిర్మాణంకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్ 2017లో ఆమోదం పొందినప్పటికీ ఇప్పటి వరకు అనేక బాలారిష్టాలు ఎదుర్కొని పనులు పట్టలెక్కాయి. మొత్తం మూడు రాష్ట్రాల మీదగా సాగుతున్న ఈ రహదారి నిర్మాణానికి ప్రాథమికంగా పెద్దఎత్తున భూసేకరణ అవసరమైంది.ప్రారంభంలో భూసేకరణలో వచ్చిన ఇబ్బందులు, రైతుల ఆందోళనలు, న్యాయపరమైన సమస్యలు నిర్మాణ పనుల ప్రారంభానికి సమస్యగా మారాయి.ఆ తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక చొరవతో దాదాపు ఆ సమస్యలన్నింటినీ తొలగించి నిర్మాణ పనులను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం.
అలా అన్ని అడ్డంకులను అధిగమించి 2022లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకు శంకుస్థాపన జరిగింది. దాదాపు 20,000 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణం జరుగుతుంది. సుమారు రెండు సంవత్సరాల వ్యవధిలోనే దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి.మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు నిర్మాణ సంస్థలు రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి. ఈ నిర్మాణం పూర్తయితే ప్రస్తుతం 12–13 గంటలు పట్టే విశాఖ–రాయపూర్ ప్రయాణం కేవలం 6–7 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకోవడానికి మార్గం సుగమవుతుంది. దీతో రవాణా సమయం తగ్గడమే కాకుండా ఇంధన ఖర్చులు కూడా భారీగా తగ్గుతాయి. వ్యాపార రవాణా మరింత వేగవంతం అవుతుంది. దీని ద్వారా రవాణా రంగం మరింత అభివృద్ధి చెందనుంది.
ఈ హైవే నిర్మాణం పూర్తయితే విశాఖ పోర్ట్ నుంచి రాయపూర్ వరకు వాహనాలు రయ్యిమననున్నాయి. వివిధ దేశాలకు వెళ్లే వస్తువులు, వచ్చే దిగుబడులు ఈ హైవే ద్వారా పెద్దఎత్తున రవాణా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు రవాణా సౌకర్యం సరిగా లేకపోవడంతో రాయపూర్ నుంచి విశాఖ పోర్ట్ కు వరకు సరుకు రవాణా చేయడానికి అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి.ఇప్పుడు ఆ పరిస్థితికి భిన్నంగా మారి ఎటు నుంచి ఎటు వెళ్ళాలన్నా సీడ్ యాక్సిస్ లో కేవలం ఆరు గంటలలో వాహన రాకపోకలు పరిస్థితి ఉండటంతో షిప్పింగ్ ద్వారా జరిగే వ్యాపార వ్యవహారాలు మరింత పెరిగే చాన్స్ ఉంది.తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ ప్రాంత ఆర్థిక పరిపుష్టి, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.
మరోవైపు ఇప్పటికే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంతో ఈ హైవే కనెక్టివిటీ ఉన్న పలు ప్రాంతాల్లో భూముల ధరలు అమాంతం పెరిగాయి. ఈ హైవే కు కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు కూడా పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే తూర్పు భారతదేశ ఆర్థిక రంగానికి కొత్త దిశగా మారనుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. ఇంధన పొదుపు, సమయం ఆదాతో పాటు వ్యాపార వృద్ధి అన్నీ ఈ నిర్మాణం పూర్తయితే సాధ్యం కానున్నాయి. రాబోయే కొద్ది నెలల్లో ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తే, విశాఖ నుంచి రాయపూర్ వరకు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
