AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Army Agniveer Jobs: భారత సైన్యంలో తీవ్ర కొరత.. ఇక ఏటా లక్ష మంది అగ్నివీర్‌ల నియామకాలు!

దేశ రక్షణకు అహోరాత్రులు శ్రమించే త్రివిధ దళాల్లో ప్రస్తుతం సైన్యం కొరత తీవ్రంగా ఉంది. ఈ కొరతను భర్తీ చేసేందుకు రానున్న రోజుల్లో నియామకాలను పెంచేందుకు భారత సైన్యం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్మీలో దాదాపు 1.8 లక్షల మంది సైనికుల కొరత ఉన్నట్లు తెలుస్తుంది...

Indian Army Agniveer Jobs: భారత సైన్యంలో తీవ్ర కొరత.. ఇక ఏటా లక్ష మంది అగ్నివీర్‌ల నియామకాలు!
Indian Army Aims To Increase Vacancies To 1 Lakh Per Year
Srilakshmi C
|

Updated on: Nov 27, 2025 | 4:11 PM

Share

హైదరాబాద్‌, నవంబర్‌ 26: దేశ రక్షణకు అహోరాత్రులు శ్రమించే త్రివిధ దళాల్లో ప్రస్తుతం సైన్యం కొరత తీవ్రంగా ఉంది. ఈ కొరతను భర్తీ చేసేందుకు రానున్న రోజుల్లో నియామకాలను పెంచేందుకు భారత సైన్యం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్మీలో దాదాపు 1.8 లక్షల మంది సైనికుల కొరత ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఇప్పటి వరకూ యేటా 45 వేల నుంచి 50 వేల మందిని ఆర్మీలో నియమిస్తూ ఉంది. ఈ సంఖ్యను ఇకపై లక్షకు పెంచే ఆలోచనలో ఇండియన్‌ ఆర్మీ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. కరోనా మహమ్మారి సమయంలో రెండేళ్ల పాటు నియామకాలు నిలిపివేయడమే ఈ కొరతకు కారణమట. కరోనా సమయంలో 2020, 2021లో రెండేళ్లపాటు సైన్యంలో నియామకాలు నిలిచిపోయాయి.

మరోవైపు సరిగ్గా ఇదే సమయంలో ఏడాదికి 60 వేల నుంచి 65 వేల మంది వరకు సైనికులు పదవీవిరమణ చేశారు. ఆ తర్వాత నాలుగేళ్ల ఒప్పందం ప్రాతిపదికన నియామకాలకు 2022లో అగ్నిపథ్‌ పథకం ప్రారంభమైంది. అదే ఏడాది త్రివిధ దళాల్లో అంటే ఆర్మీ, నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంతటా దాదాపు 46,000 పోస్టులు మంజూరు చేయగా.. అందులో 40 వేల పోస్టులు ఆర్మీకి కేటాయించారు. ఆ సమయంలో అగ్నివీర్ నియామకాల ద్వారా సైన్యం క్రమంగా పెరుగుతుందని భావించారు. కానీ 2025 నాటికి అగ్నివీర్‌ ద్వారా ఆర్మీలో నియామకాల సంఖ్య కేవలం 1.75 లక్షలకు మాత్రమే పరిమితమైంది. నేవీ, ఎయిర్ ఫోర్స్ కూడా తమ సంఖ్యను దాదాపు 28,700కు పెంచుకోవాలని భావిస్తున్నాయి. 2022 అగ్నివీరుల నాలుగేళ్ల వ్యవధి వచ్చే ఏడాదితో పూర్తి కానుంది. వీరితోపాటు అనేక మంది రెగ్యులర్‌ సైనికులు కూడా పదవీ విరమణ చేయాల్సి ఉంది. దీంతో మునుముందు ఆర్మీలో భారీగా ఖాళీలు ఏర్పడనున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని భర్తీ చేసేందుకు ఏడాదికి లక్ష మంది అగ్నివీరులను నియమించుకోవాలని భారత సైన్యం యోచిస్తుంది.

కేంద్ర ప్రభుత్వం గతంలో వెల్లడించిన వివరాలను పరిశీలిస్తే 2023లోనే త్రివిద దళాల్లో 1.55లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సైన్యంలో ఏటా పదవీ విరమణలకు, నియామకాలకు మధ్య వ్యత్యాసం ఉండటంతో భారీ స్థాయిలో ఖాళీలు ఏర్పడనున్నాయి. ప్రస్తుతం ఏడాదికి దాదాపు 20 నుంచి 25 వేల ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఆ విధంగా ప్రస్తుతానికి 1.8 లక్ష ఖాళీలు ఏర్పడినట్లు అంచనా. ఈ నేపథ్యంలో సైన్యం కొరతను భర్తీ చేసేందుకు అగ్నివీరుల నియామకాలను యేటా లక్షకు పెంచాలని ఆర్మీ భావిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.