Andhra Pradesh: గేదెను తప్పించబోయి.. బైకు అదుపు తప్పి.. ఇద్దరు మిత్రులు మృతి
వాళ్లు నలుగురు స్నేహితులు.. దైవదర్శనానికి బయలుదేరారు. విజయనగరం పైడితల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. మరి కాసేపట్లో ఇళ్లకు చేరుకుంటారు. ఇంతలో.. ఎదురుగా వస్తున్న గేదెను చూసి దాన్ని తప్పించబోయారు. ఆ వెంటనే ఘోర ప్రమాదం.. ఇద్దరు స్నేహితులు ఒకేసారి.. రెండు కుటుంబాల్లో తీరని విషాదం.
విశాఖపట్నం, ఫిబ్రవరి 07; విశాఖలో మరో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకుల ప్రాణాలు బలిగొంది. రెండు కుటుంబాలు, స్నేహితుల్లో విషాదాన్ని నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ పెదవాల్తేరు ప్రాంతానికి చెందిన మణికంఠ రెడ్డి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. నిరంజన్ డిగ్రీ ఫైనల్ ఇయర్. వీరిద్దరూ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి.. రెండు బైకులపై విజయనగరం బయలుదేరారు. అక్కడ పైడితల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత తిరిగి మళ్లీ ఇళ్లకు బయలుదేరారు. మరో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే వీళ్లకు చెరిపోతారు. ఈ సమయంలో.. మధురవాడ జాతీయ రహదారి బోరవానిపాలెం వద్దకు వచ్చేసరికి.. ఓగేదే రోడ్డుకు అడ్డంగా వెళుతుంది. బైక్ కు ఎదురుగా ఒకసారిగా గేదె వచ్చేయడంతో… దాన్ని తప్పించబోయారు. ఇంతలో.. మణికంఠ నిరంజన్ ప్రయాణిస్తున్న బైక్.. అదుపు తప్పింది. అదే రోడ్డు మార్గంలో వెళ్తున్న గ్యాస్ సిలిండర్ల లారీ ని ఢీకొని.. ఆ బైక్ లారీ చకరాల కిందకు వెళ్లిపోయింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న మణికంఠ నిరంజన్ తీవ్ర గాయాలు పాలై.. ఘటనా స్థలంలోనే ప్రాణాలు కొల్పోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తీవ్ర విషాదంలో కుటుంబాలు..
– విశాఖ పెదవాల్తేరు ప్రాంతానికి చెందిన మణికంఠ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. తల్లితండ్రులు రమణ, అప్పల నరసమ్మ కూలీలు. కష్టపడి కొడుకును చదివిస్తూ అలారం ముద్దుగా పెంచుకుంటున్నారు. చేతికి అంది వచ్చిన కొడుకు ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇక ఏఓబి ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం కూలీ పనుల కోసం 30 ఏళ్ల క్రితమే విశాఖకు వచ్చేసారు. రెక్కలు ముక్కలు చేసుకుని ముగ్గురు పిల్లలను చదివిస్తున్నారు. పెద్దకొడుకు నిరంజన్ డిగ్రీ చదువుతున్నాడు. మరో ఏడాదిలో డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం అండగా ఉంటానని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చాడు. ఇంతలో రోడ్డు ప్రమాదం నిరంజన్ ను కబలించడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదన అందరినీ కలచి వేస్తుంది. ఇక ప్రాణ స్నేహితులు.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తీవ్ర విషాదంలోకి వెళ్లారు నిరంజన్ మణికంఠకు చెందిన ఫ్రెండ్స్.