నేడు ఏపీలోని ఆ జిల్లాలో పాఠశాలలకు సెలవు.. వర్షాలు ఇలానే కొనసాగితే..
Visakhapatnam: విశాఖ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటం, నేడు కూడా భారీ వర్ష సూచన ఉండడం తో పాఠశాలలను మూసివేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థుల రవాణా, తరగతి గదుల నిర్వహణను దృష్టిలో ఉంచుకుని..
విశాఖపట్నం, జూలై 27: విశాఖ నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటం, నేడు కూడా భారీ వర్ష సూచన ఉండడం తో పాఠశాలలను మూసివేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థుల రవాణా, తరగతి గదుల నిర్వహణను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లిఖార్జున ఆదేశాలతో డీ ఈ వో చంద్రకళ ఈ నిర్ణయం తీసుకుంది. శిథిలావస్థలో ఉన్న గదుల్లో తరగతులు నిర్వహించవద్దని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అన్ని యాజమాన్య పాఠశాలలనూ మూసివేసేలా పర్యవేక్షించాలని ఎం ఈ వో, డెప్యూటీ డీ ఈ వో లకు ఆదేశించారు కలెక్టర్.
10 సెంటీ మీటర్ల వర్షానికే విశాఖ నగరం నీటిమయమైంది. నిరంతరాయంగా నిన్నటినుంచి కురుస్తున్న వర్షం ఒకవైపు – మరొక వైపు డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడా సరిగా లేకపోవడం తో నీళ్లన్నీ విశాఖ నగర రోడ్లపైనే నిలిచిపోయాయి. దీంతో నగర వాసులకు నరకయాతన ఎదురయింది. పూడుకుపోయిన డ్రైనేజీలతో నీటి ప్రవాహం రోడ్లపైకి చేరి ముఖ్యమైన కూడళ్లు సైతం జలదిగ్బంధంలో కనిపించాయి. బీచ్ రోడ్ లో కూడా నీళ్ళు రోడ్ పైనే నిలిచిపోవడం, మరోవైపు డివైడర్ ల మధ్య చెట్లు నాటే క్రమంలో అక్కడకు తరలించిన మట్టి నీళ్లలో కలిసి ఎర్రగా మారి బీచ్ రోడ్ లో ఇరువైపులా ప్రవహిస్తుండడంతో చూడడానికే ఇబ్బందికరంగా మారింది.
వన్ టౌన్ లో గతంలో కూడా వర్షం వస్తె నరకమే కనిపించేది. తాజాగా కొత్తగా గతం కంటే భిన్నంగా మున్సిపల్ స్టేడియం, పోర్టుకు వెళ్లే మార్గంలో నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నీరు రోడ్లపైనే నిలచిపోవడం తో వివిధ పనులపై ఆ ఏరియా కు వచ్చిన ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. నిన్న సాయంత్రం పాఠశాలల సమయం ముగిసే సమయానికి పెద్ద వర్షం పడుతూ ఉండడం తో స్కూల్స్ నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు ఇళ్లకు వెళ్లేందుకు అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. తడుస్తూనే ఆ వర్షంలోనే బస్సులు రావడంతో అతి కష్టంపై ఎక్కి ఆలస్యంగా గమ్యానికి చేరారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ఈరోజు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అదే సమయంలో జ్ఞానపురం రైల్వే అండర్ బ్రిడ్జ్ సమీపంలో భారీగా నీళ్ళు నిలవడం, కార్లు కూడా మునిగిపోయే వరకు నీళ్ళు నిల్వ ఉండడం తో చాలా సేపటివరకు ఆ మార్గంలో వెళ్లేందుకు వాహన దారులు సంకొచించారు. రాత్రికి కానీ ఆ నీళ్ళు అక్కడనుంచి ఖాళీ కాకపోవడం తో అందరూ ప్రత్యామ్నాయ రూట్లకు వెళ్ళడం తో అక్కడా ట్రాఫిక్ జామ్ అయ్యి చాలా సమయం పాటు ఇబ్బందులు పడ్డారు
అలెర్ట్ ఆయిన జిల్లా యంత్రాంగం
విశాఖ జిల్లా తో పాటు నగర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో యంత్రాంగం అలెర్ట్ అయింది. జిల్లా కలెక్టర్ మల్లికార్జున, జేసీ విశ్వనాథన్ లు కంట్రోల్ రూం ఏర్పాటు చేసి అన్ని స్థాయి అధికారులతో పూర్తి వర్షాలతో ఎదురయ్యే పరిస్థితులను తట్టుకోవడానికి సిద్దం చేసారు. ఎమ్మార్వో, ఎండీఓలతో మండల స్థాయి అధికారులు, విలేజ్, వార్డ్ సెక్రటేరియట్ ఉద్యోగులు, గ్రామ, డివిజన్ వాలంటీర్లు అందరూ అందుబాటులో, స్టేషన్ లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా విద్యుత్, సమాచార వ్యవస్థలు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయాలని, జనరేటర్లు, పెట్రోల్ లాంటివి రెడీ గా ఉంచుకోవాలని, నిత్యావసరాలు, బియ్యం, గ్యాస్ తగిన స్థాయిలో నిల్వలు ఉంచాలని స్థానిక అధికారులకు జిల్లా అధికారులు సూచించారు.
అదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ లో అందుబాటులో ఉన్న ఎన్ డీ అర్ ఎఫ్, ఎస్ డీ అర్ ఎఫ్, కోస్ట్ గార్డ్ తో పాటు అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించేందుకు సిద్దంగా ఉండాలని నేవీ ని సైతం అప్రమత్తం చేసిన జిల్లా యంత్రాంగం ఫిషర్ మెన్ లను తాత్కాలికంగా వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే సముద్రంలో ఉన్న వారు వెనక్కి రావాలని జిల్లా యంత్రాంగం కోరింది. కలెక్టరేట్ తో పాటు జీవీఎంసీ, రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, ఎం అర్ వో ల కార్యాలయాలలో కంట్రోల్ రూం లు ఏర్పాటు చేసి నిరంతరం సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..