Vijayawada: రామవరప్పాడు రింగ్ వద్ద లారీని ఆపిన పోలీసులు.. తనిఖీ చేయగా..
ఛత్తీస్‌గఢ్ నుంచి తమిళనాడుకు తరలిస్తున్న 1,300 కిలోల గంజాయిని విజయవాడ డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. రామవరప్పాడు రింగ్ వద్ద తనిఖీ చేసిన లారీ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెట్టెలో 38 సంచుల్లో దాచిన 561 ప్యాకెట్లు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

విజయవాడలో డ్రగ్స్ రవాణా ముఠా గుట్టు రట్టు చేశారు డీఆర్‌ఐ అధికారులు. ఛత్తీస్‌గఢ్ నుంచి తమిళనాడుకు తరలిస్తున్న 1,300 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా నుంచి సేలంకు గంజాయి తరలిస్తారన్న నిఘా సమాచారంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) బృందం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. సెప్టెంబర్ 28న విజయవాడ రామవరప్పాడు రింగ్ సమీపంలో జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో పైపుల లోడ్‌తో వెళ్తున్న లారీని ఆపి తనిఖీ చేశారు.
లోతుగా పరిశీలించగా, లారీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెట్టెలో గంజాయి దాచినట్లు గుర్తించారు. వాటిని తెరిచి చూసిన అధికారులు 38 సంచుల్లో 561 ప్యాకెట్లుగా నింపిన 1,300 కిలోల గంజాయి బయటకు తీశారు. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ సుమారు రూ.2.6 కోట్లుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
లారీని సీజ్ చేసి డ్రైవర్ ఎస్.మురుగేశన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇచ్చిన సమాచారంతో సేలంకు చెందిన ప్రధాన నిందితుడు వెంకటేశన్ రామస్వామిని మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై డీఆర్‌ఐ అధికారులు కేసు నమోదు చేసి మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




