Tirumala: తిరుమల నడక మార్గాల్లో లబ్ డబ్.. హార్ట్ ఎటాక్ ఫియర్…?
తిరుమల నడక మార్గాల్లో భక్తుల మరణాలపై టీటీడీ దృష్టి పెట్టింది. వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు కొండకు నడక దారిలో రావొద్దని విజ్ఞప్తి చేస్తోంది. ఈ మేరకు భక్తుల్లో అవగాహన కల్పించడంతో పాటు ఇబ్బందులు ఎదురు కాకుండా వైద్య సదుపాయం కూడా కల్పిస్తోంది. అయితే కోవిడ్ అనంతరం కొనసాగుతున్న భక్తుల మరణాల సంఖ్య టీటీడీని కలవర పెడుతోంది.

ఆపద మొక్కుల స్వామిని దర్శించుకునేందుకు తిరుమల కొండకు చేరుకునే భక్తులది ఒక్కొక్కరిది ఒక్కో మార్గం. దేశ విదేశాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు వెంకన్న మొక్కలు తీర్చు కునేందుకు ఎంతో ప్రయాసపడతారు. ఇలా కొండకు చేరే భక్తులు నిత్యం శ్రీవారిని దాదాపు 70 వేల మంది వరకు దర్శించుకుంటారు. నడక మార్గంలో కొందరు, బస్సులు, ఇతర వాహనాలు, సొంత వాహనాల్లో మరికొందరు తిరుమల కొండకు చేరుకుంటున్నారు. నడక మార్గాల్లో తిరుమల కొండకు చేరుతున్న భక్తులు అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వస్తున్నారు. ఇలా వెంకన్న దర్శన కోసం వచ్చే భక్తులు దాదాపు 35 వేల మందికి పైగానే ఉంటున్నారు. శ్రీవారి దర్శనం కోసం కొండ చేరుతున్నారు.
ఈ లెక్కన కొండ కు చేరే భక్తుల్లో కొందరు నడక మార్గాల్లో అస్వస్థతకు గురై అస్తమిస్తున్నారు. టిటిడి లెక్కల ప్రకారం గతేడాది జనవరిలో 14 మంది. ఫిబ్రవరిలో 11, మార్చిలో 12, ఏప్రిల్ లో 7, మే లో 8. జూన్ నెలలో 11. జూలైలో 17. ఆగస్టు లో 9. సెప్టెంబరు 15, అక్టోబరు నెలలో 10, నవంబర్ నెలలో 8, డిసెంబరు నెలలో 10. ఈ ఏడాది జనవరి లో 15, ఫిబ్రవరి 8, మార్చిలో ఇద్దరు చొప్పున 157 మంది భక్తులు చనిపోయారు. చాలా మంది బ్రాడ్ డెత్ కాగా ఒకరిద్దరు తీవ్ర అస్వస్థతతో తిరుపతిలోని వివిధ ఆస్పత్రుల్లో చేరి మృతి మృతి చెందినట్లు టీటీడీ వైద్య శాఖ రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో తిరుమలకు చేరుకునే ప్రయత్నంలో జరుగుతున్న మరణాలపై టిటిడి దృష్టి పెట్టింది. అయితే కోవిడ్ అనంతరం కాలినడకన వచ్చే భక్తుల్లో చాలా మంది గుండె పోటుతో మృతి చెందు తుండటం టీటీడీ ని ఆందోళన కలిగిస్తోంది. నడక మార్గాల్లో వచ్చే యాత్రికులు ఛాతీ నొప్పి అంటూ కుప్పకూలిపోయి కుటుంబాలకు దూరం అవుతుండగా కాలినడక మార్గా ల్లోనే కాకుండా కంపార్టుమెంట్లు, క్యూలైన్లు, తిరుమలలోని కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లోనూ ఇలాంటి గుండెపోటు మరణాలు కూడా నమోదు అవుతుండటం విషాదానికి కారణం అవుతోంది.
గుండెపోటు మరణాలపై ఫోకస్..
ఇక శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం అపోలో సంస్థ కొన్నేళ్లుగా ఉచిత సేవలు అందిస్తోంది. తిరుమలలోని అశ్విని ఆస్పత్రి పక్కనే ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అశ్వని ఆసుపత్రికి ఛాతీ నొప్పితో వచ్చే వారికి వివిధ రకాల పరీక్షలు చేయడంతో పాటు అత్యంత ఖరీదైన టెనెక్టిప్లెస్ అనే ఇంజెక్షన్ కూడా ఉచితంగా ఇస్తోంది. నడక మార్గాల్లో గుండెపోటు మరణాలు పెరుగుతున్నట్లు గుర్తించి అలిపిరి నడక మార్గంలోని ఏడో మైలు వద్ద అపోలో సంస్థ అత్యవసర హృదయ చికిత్స కేంద్రం ఏర్పాటు కు అంగీకరిచింది. ఈసీజీ, డీఫిబ్ రిలేటర్, ఎకో కార్డియోగ్రామ్ వంటి పరికరాలతో వైద్యులను నియమించి త్వరలోనే అందుబాటులోకి తీసుకు రాబోతోంది. మరణాల నివారణ కోసం టీటీడీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కాలినడకన వస్తూ తీవ్ర అలసటతో చాలా మంది భక్తులు మృతి చెందినట్టు గుర్తిస్తున్న టీటీడీ భక్తుల్లో అవగాహన పెంచుతోంది. శ్రీవారి మొక్కు తీర్చు కోవాలనే ఉద్దేశ్యంతో అనారోగ్యంతో ఉన్నా మొండి తనంతో కొండ మెట్లు ఎక్కవద్దని చెబుతోంది. అలా వచ్చే వారే చనిపోయినట్లు వైద్యుల ద్వారా తెలుసుకుంటున్న టిటిడి శ్రీవారి దర్శనం కోసం వస్తూ ఇకపై ఎవరు మరణించ కూడదనే లక్ష్యంతో టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
వృద్ధులు, జబ్బులుంటే నడక మార్గం సేఫ్ కాదంటున్న టీటీడీ.
ఇక 60 ఏళ్లు దాటిన వృద్ధులు. గుండె సంబంధిత, మధుమేహం, అధిక రక్తపోటు, ఉబ్బసం, మూర్చ వంటి వ్యాధులున్న వారు కాలినడకన వెళ్లడం మంచిది కాదని విస్తృత ప్రచారం చేస్తోంది. బ్రాడ్కాస్టింగ్ ద్వారా టీటీడీ సూచిస్తోంది. అలిపిరి నడక మార్గం లో 1500వ మెట్టు, గాలిగోపురం, భాష్యకార్ల సన్నిది ప్రాంతాల్లో డిస్సెన్సరీలను ఏర్పాటు చేసిన టిటిడి గుండెకు సంబందించిన ప్రత్యేక వైద్య నిపుణులను కూడా అందుబాటులో తీసుకొస్తోంది. ఒక్కో డిస్పెన్సరీ లో నలుగురు వైద్య సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్న టిటిడి ఈసీజీ, డీఫిట్రెలేటర్ వంటి పరికరాలను, క్యాన్వాస్ స్ట్రచర్ ను సమకూర్చు తోంది. ఇక శ్రీవారిమెట్టు మార్గం లోని 1200వ మెట్టు వద్ద కూడా మరో డిస్పెన్సరీ ని ఏర్పాటు చేయాలని టీటీడీ ప్రయత్నిస్తోంది. భక్తులు దర్శనం కోసం వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లె క్స్-2 లో ఉన్న డిస్పెన్సరీ లోనూ తగిన వైద్య సిబ్బందిని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 లోనూ నూతన డిస్సెన్సరీ ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఛాతీ నొప్పితో ఇబ్బంది పడే భక్తులకు వైద్యులు అందుబాటులో వచ్చేలోపు సిబ్బందే సీపీఆర్ చేసేలా శిక్షణ కూడా ఇస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి