TTD: వీఐపీలకు గుడ్ న్యూస్.. సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలకు ఓకే చెప్పిన టీటీడీ!
తిరుమల వెంకన్నను బ్రేక్ దర్శనం చేసుకునే భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. వేసవి రద్దీ దృష్ట్యా గతంలో సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన టిటిడి ఇప్పుడు తిరిగి పునరుద్ధరిచింది. ఈ మేరకు ఏపీ, తెలంగాణ నేతల సిఫార్సు లేఖలను పునరుద్ధరించిన విషయాన్ని స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాలకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల లేఖలపై విఐపి బ్రేక్ దర్శనాలు కల్పిస్తామని ప్రకటించింది. ఈ నెల 15 నుండి సిఫార్సు లేఖలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది.

వేసవిలో కొండపై భక్తుల రద్దీ అంతకంతకు పెరుగు తుందని భావించిన టీటీడీ.. గత నెల 1 నుంచి సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని భావించింది. సర్వదర్శనం సమయాన్ని పెంచడంతోపాటు సామాన్య భక్తులకు శీఘ్రదర్శనం కల్పించాలన్న ఆలోచనతో సిఫారసు లేఖలను రద్దు చేస్తూ గతంలో నిర్ణయం తీసుకుంది. అయితే టీటీడీ విఐపి బ్రేక్ దర్శనాల సమయాన్ని కూడా మార్చింది. మే నెల 1 నుంచి జూలై 15 వరకు అంటే దాదాపు రెండున్నర నెలల పాటు పరిశీలనా త్మకంగా అమలు చేయాలనుకుంది. విఐపిలను కట్టడి చేసి ఎక్కువ సమయం సామాన్య భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు సిఫారసు లేఖలపై తీసుకున్న నిర్ణయాన్ని టీటీడీ వెనక్కి తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలను మళ్లి పునరుద్దరిస్తున్నట్టు ప్రకటన విడుదల చేసింది.
-
యధావిధిగానే బ్రేక్ దర్శన సమయాలు..
మే1 నుంచి విఐపి బ్రేక్ దర్శన సమయాల్లో మార్పులు తీసుకొచ్చిన టిటిడి సిఫారసు లేఖలపై తీసుకున్న నిర్ణయాన్ని మాత్రమే వెనక్కి తీసుకుంది. బ్రేక్ దర్శన సమయాల్లో తీసుకున్న మార్పులు మాత్రం యధావిధిగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది. గురువారం తిరుప్పావడ, శుక్రవారం అభిషేక సేవ కారణంగా బ్రేక్ దర్శనాల సమయం యథాతథం కొనసాగనుండగా మిగతా రోజుల్లో ఉదయం 5:45 నుంచి 11 గంటల దాకా పరిశీలనాత్మకంగా టీటీడీ అమలు చేస్తోంది. ప్రోటోకాల్, రెఫరల్, జనరల్ బ్రేక్, శ్రీవాణి, టిటిడి ఉద్యోగులకు ప్రత్యేకంగా సమయం కేటాయించింది. ఉదయం 5:45 గంటలకు ప్రోటోకాల్, 6:30 గంటలకు రెఫరల్, 6:45 గంటలకు జనరల్ బ్రేక్ దర్శనం కల్పించనుంది. ఇక ఉదయం 10:15 గంటలకు శ్రీవాణి, 10:30 డోనర్స్, 11 గంటలకు టిటిడి ఉద్యోగులకు శ్రీవారి బ్రేక్ దర్శన సమయం కేటాయించింది టిటిడి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి