Tirupati : క్లాస్ రూమ్‌లో ఒంటరిగా విద్యార్థిని.. ఆమె వద్దకు వెళ్లి ప్రొఫెసర్ వికృత చేష్టలు
తిరుపతి SV అగ్రికల్చర్ కాలేజీలో ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థిని పట్ల ప్రొఫెసర్ అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. క్లాస్ రూమ్‌లో ఒంటరిగా ఉన్న స్టూడెంట్‌తో ఉమామహేష్ అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఉమామహేష్‌ను అదుపులోకి తీసుకొని తిరుపతి రూరల్ పీఎస్‌కు తరలించారు పోలీసులు.
టెంపుల్ సిటీలో ఆచార్యుడి వక్రబుద్ధి బయట పడింది. క్లాస్ రూమ్‌లో ఒంటరిగా ఉన్న విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆచార్యుడి బాగోతం వెలుగులోకి వచ్చింది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అగ్రికల్చర్ కాలేజీలో ప్రొఫెసర్ ఉమా మహేష్ వ్యవహారంపై తిరుపతి రూరల్ పిఎస్‌లో కేసు నమోదు అయింది. అనంతపురంకు చెందిన 22 ఏళ్ల యువతి తిరుపతి ఎస్వీ అగ్రికల్చర్ కాలేజీలో చదువుతోంది. గత ఏడాది అటెండెన్స్ తక్కువగా ఉండడంతో పరీక్షలకు అర్హత సాధించలేకపోయింది. ఫీజులు చెల్లించడంతో నవంబర్ నుంచి విద్యార్థిని ఒక్కరికే క్రాప్ ఫిజియాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ ప్రొఫెసర్ ఉమామహేష్ క్లాసులు చెబుతున్నారు. టైం టేబుల్ ప్రకారం క్లాసెస్‌కు అటెండ్ అవుతూ వస్తున్న విద్యార్థిని పట్ల క్రాప్ ఫిజియాలజీ హెచ్ఓడి ప్రొఫెసర్ ఉమా మహేష్ వక్రబుద్ధిని ప్రదర్శించాడు.
గత నవంబర్ నుంచి పాఠ్యాంశాలను బోధిస్తున్న ప్రొఫెసర్ ఉమా మహేష్ ఒంటరిగా ఉన్న విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు దిగాడు. క్లాస్ రూమ్‌లో ఒంటరిగా ఉంటూ పాఠాలు వింటున్న విద్యార్థిని పట్ల ప్రొఫెసర్ చేస్తున్న చేష్టలు నచ్చక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. లైంగిక వేధింపులు ఎక్కువ కావడంతో భరించలేక పోయింది. దీంతో అనంతపురం నుంచి వచ్చిన తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. తగిన ఆధారాలతో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రొఫెసర్ ఉమామహేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మరోవైపు విద్యార్థిని పట్ల ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడడంపై విద్యార్థులు ఆందోళనకు దిగారు. అతడిని వెంటనే విధులు నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి