Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. త్వరలో వైకుంఠ ద్వార సర్వ దర్శన టోకెన్లు రిలీజ్.. ఎప్పుడు, ఎక్కడ లభ్యమవుతాయంటే..
తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా టీటీడీ చేపట్టిన పలు కార్యకమాల గురించి భక్తులకు తెలియజేశారు. వైకుంఠ ద్వార దర్శనం కొరకు భక్తులు క్యూలైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా భక్తులకు టైంస్లాట్ టోకెన్లు జారీ చేశామని చెప్పారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని 2025 జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కొరకు విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని ఈవో శ్రీ జె.శ్యామల రావు తెలిపారు. 10 రోజుల పాటు జరగనున్న వైకుంట ద్వార దర్శనం కోసం రూ.300/- ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లను డిసెంబరు 24న ఆన్‌లైన్‌లో 1.40 లక్షలు విడుదల చేశామని తెలిపారు. అంతేకాదు జనవరి 10న శ్రీవాణి దర్శన టికెట్లు 1500 రిలీజ్ చేసినట్లు.. మిగిలిన 9 రోజులకు 2000 టికెట్లు, గదుల కోటాను డిసెంబరు 23న ఆన్‌లైన్‌లో విడుదల చేసినట్లు వెల్లడించారు. ఈ టికెట్లను పొందిన భక్తులకు మహా లఘు దర్శనం ఉంటుందని అన్నారు.
దాతలకు దర్శనం, బస
ఆన్‌లైన్‌లో వైకుంఠ ద్వార దర్శనం బుక్ చేసుకున్న దాతలకు రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూలైన్ ద్వారా దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు.
సామాన్య భక్తుల సౌకర్యార్థం జనవరి 8 నుంచి 11వ తేదీ వరకు దాతలకు గదుల కేటాయింపు ఉండదు. మిగతారోజుల్లో దాతలు యథావిధిగా గదులు బుక్ చేసుకోవచ్చని చెప్పారు.
ఆఫ్‌లైన్‌లో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల వివరాలు
తిరుపతిలోని 8 కేంద్రాలలో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్ల ద్వారా వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లు మంజూరు చేస్తామని ప్రకటించారు.
జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొదటి మూడు రోజులకు జనవరి 9వ తేదీన ఉదయం 5 గం.ల నుంచి టోకెన్లు ఇవ్వనున్నామని.. 1.20 లక్షల టోకెన్లు జారీ చేస్తామని వెల్లడించారు.
అయితే జనవరి 13 నుంచి 19వ తేదీ వరకు ఏ రోజుకారోజు ముందు రోజు భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణు నివాసంలలో టోకెన్లు జారీ చేస్తామని తెలిపారు.
తిరుపతి, తిరుమలలో కౌంటర్లు
భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో ఇందిరా మైదానం, రామచంద్ర పుష్కరిణి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణునివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, భైరాగిపట్టెడలోని రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్ పల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జీవకోనలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అదేవిధంగా తిరుమల స్థానికుల కొరకు తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో టోకెన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏర్పాటు చేస్తున్న కౌంటర్ల వద్ద భక్తులకు సౌకర్యాలను కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న ప్రాంతాల్లో భక్తులకు ప్రత్యేకంగా క్యూలైన్లు, బారీకేడ్లు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. సర్వదర్శనం టోకెన్ల కలిగిన భక్తులు తమకు కేటాయించిన సమయంలోనే తిరుమలకు వచ్చి స్వామివారి దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గోవిందమాల ధరించిన భక్తులు కూడా దర్శన టోకెన్లు పొంది దర్శనానికి రావాల్సి ఉంటుందని సూచించారు.
స్వామివారి భక్తులకు విజ్ఞప్తి
వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు సూచన ఏమిటంటే.. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు అంటే ఈ పది రోజులు దర్శనటోకెన్లు ఉన్న భక్తులు మాత్రమే తిరుమల శ్రీవారి దర్శనానికి రావాలని సూచించారు. కేవలం టికెట్లు, లేదా టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుమలకు ప్లాన్ చేసుకోవాలని కోరుతున్నారు.
స్పెషల్ కోటా టికెట్లు రద్దు
స్వామివారి దర్శనం కోసం వచ్చే చంటిపిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులు, దివ్యాంగులు, ఎన్‌ఆర్‌ఐ, రక్షణ సిబ్బంది తదితర ప్రత్యేక దర్శనాలను ఈ పది రోజులపాటు రద్దు చేశారు.
భక్తుల అధిక రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ 10 రోజులలో విఐపి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని తెలిపారు. అయితే ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వస్తే వారికి మాత్రం శ్రీవారి దర్శనం కల్పిస్తామని చెప్పారు.
శ్రీవారి ఆలయంలో సేవలు
జనవరి 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుందని చెప్పారు. జనవరి 10న వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంపై ఆలయ నాలుగుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. మర్నాడు అంటే జనవరి 11న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 5.30 నుంచి 6.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహించనున్నమని ప్రకటించారు.
అధ్యయనోత్సవాలు ఎప్పటి నుంచి అంటే
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 30వ తేదీ నుండి అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 11 రోజులు ముందు నుంచి శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
భక్తులకు అందుబాటులో టీటీడీ డైరీలు, క్యాలెండర్లు
2025వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు తిరుమల, తిరుపతితోపాటు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, వైజాగ్‌లోని శ్రీవారి ఆలయాలు, ముంబయి, న్యూఢల్లీి, వేలూరు, కాంచీపురంలోని సమాచార కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్ ద్వారా కూడా క్యాలెండర్లు, డైరీలు బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు.
జనవరి 13వ తేదీ కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం
హిందు ధర్మ ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ రాజ్(అలహాబాద్) వద్ద 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26వ తేది వరకు నిర్వహించనున్న ప్రతిష్టాత్మక కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
ప్రయాగ్‌రాజ్‌లోని భజరంగ దాస్ రోడ్డు, వాసుకీ ఆలయం ప్రక్కనే గల సెక్టారు 6 నందు శ్రీవారి ఆలయంను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఉత్తరాది భక్తులు శ్రీవారి వైభవాన్ని సంతృప్తిగా తిలకించేలా తిరుమల తరహాలో స్వామివారి కైంకర్యాలు, ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
ప్రతిరోజు ఈ నమూనా ఆలయంలో తిరుమల తరహాలో నిత్యం సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు సేవలు నిర్వహించానున్నామని తెలిపారు
ఈ సందర్భంగా జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీలలో శ్రీవారి కల్యాణాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
నవంబరు నెలలోశ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 20.35 లక్షలుకాగా స్వామివారికి హుండీ ద్వారా వచ్చిన కానుకలు రూ.111.30 కోట్లు.. ఇక స్వామి వారి 97.01 లక్షల లడ్డు ప్రసాదాన్ని విక్రయించినట్లు పేర్కొన్నారు. నవంబర్ నెలలో అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 19.74 లక్షలు ఉండగా స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య ` 7.31 లక్షలు అని ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి వెల్లడించారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..