Yadagirigutta: సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ సంస్థకు యాదగిరిగుట్ట నరసన్నతో తెగిపోనున్న 35 ఏళ్ల అనుబంధం..?

2014లో యాదగిరిగుట్ట ఎలా ఉండేది. ఆ తర్వాత ఎలా మారిపోయింది. ఇక భవిష్యత్తులో ఎలా మారనుంది. చాలా సాధారణంగా ఉన్న యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి. ఆలయం.. ఆ తర్వాత ఒక అద్భుతమైన దేవాలయంగా మారింది. యాదాద్రి పేరునుయాదగిరిగుట్టగా మార్పు చేసిన సీఎం రేవంత్ రెడ్డి సర్కార్. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ఈ క్రమంలో సంచలన నిర్ణయాలతో పూర్తి ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు.

Yadagirigutta: సర్కార్ సంచలన నిర్ణయం.. ఆ సంస్థకు యాదగిరిగుట్ట నరసన్నతో తెగిపోనున్న 35 ఏళ్ల అనుబంధం..?
Yadagirigutta
Follow us
M Revan Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Dec 29, 2024 | 10:11 AM

తాము కోరుకున్న కోరికలు తీరాలని భక్తులు దేవుళ్లను కోరుకుంటారు. మరికొన్ని సంస్థలు, మరికొందరు భక్తులైతే దేవుడు సేవలో పునీతమవుతారు. ఆ సంస్థ 35 ఏళ్లుగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామికి తమ ఉత్పత్తులతో సేవలందిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంతో ఆ బంధం తెగిపోనుంది. ఆ సంస్థకు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఉన్న బంధం ఏంటి..? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటి..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ మదర్ డైయిరీకి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఏటా కోట్ల రూపాయల్లో ఆదాయం కోల్పోనుంది. మదర్ డైయిరీకి ప్రధాన ఆదాయ వనరుగా యాదగిరిగుట్ట దేవస్థానానికి నెయ్యి విక్రయానికి బ్రేక్ పడుతోంది. మదర్ డైయిరీకి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంతో ఉన్న నాలుగు దశాబ్దాల అనుబంధం తెగిపోనుంది. ఇప్పటికే నష్టాల ఊబిలో కూరుకుపోయిన మదర్ డైయిరీకి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం శరాఘాతంగా మారనుంది. మదర్ డైయిరీ ఎందుకు ఆదాయాన్ని కోల్పోతోంది..? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటి..?

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రం తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతోంది. ఆలయ ఉద్ఘాటన తర్వాత స్వామివారి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువైంది. స్వామివారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. సాధారణ రోజుల్లో స్వామివారిని 30 వేల మంది భక్తులు దర్శించు కుంటున్నారు. శని ఆదివారాల్లో 50వేల మంది భక్తుల స్వామి వారిని దర్శించుకుంటున్నారు. తిరుపతి లడ్డు తర్వాత రుచి శుచిలో యాదగిరిగుట్ట నరసన్న లడ్డును భక్తులు అమితంగా ఇష్టపడతారు. స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తుడు మహా ప్రసాదంగా భావించే యాదాద్రి లడ్డును కొనుగోలు చేస్తున్నారు. స్వామివారి నైవేద్యంగా భావించే లడ్డును ఇంటికి తీసుకువెళ్లి బంధువులకు కుటుంబ సభ్యులకు పంపిణీ చేస్తుంటారు. యాదగిరిగుట్ట ఆలయంలో ప్రతిరోజు 22వేల లడ్డూలను తయారు చేస్తున్నారు. ఈ లడ్డు తయారీకి ప్రభుత్వ రంగ సంస్థ మదర్ డైయిరీ నెయ్యిని వినియోగిస్తున్నారు.

ఈ ఏడాది సెప్టెంబర్ లో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అప్రమత్తమై రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో విజయ డైయిరీ నెయ్యిని కొనుగోలు చేయాలని ఆదేశించింది. దీంతో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి జనవరి 1నుంచి విజయ డెయిరీ నెయ్యి సరఫరా కానుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మదర్‌ డైయిరీ ఏటా కోట్ల రూపాయల్లో ఆదాయం కోల్పోనుంది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని యాదగిరిగుట్ట, చెర్వుగట్టుతో పాటు రాష్ట్రంలోని కీసర, వేములకొండ తదితర ఆలయాలకు కొన్నేళ్లుగా మదర్‌ డెయిరీ నెయ్యి సరఫరా చేస్తోంది. తద్వారా మదర్‌ డెయిరీకి ఏటా రూ.36 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. ఇందులో ఒక్క యాదగిరిగుట్ట దేవస్థానం నెలకు 30 టన్నుల నెయ్యిని మదర్‌ డెయిరీ నుంచి కొనుగోలు చేస్తున్నారు. 35 ఏళ్లుగా మదర్ డైరీ నెయ్యిని వినియోగిస్తున్నామని, ఇందుకు గాను దేవస్థానం ఏటా రూ.18 కోట్ల వరకు చెల్లిస్తున్నామని ఆలయ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరి ఒకటో తేదీ నుండి విజయ డైయిరీ నెయ్యిని వినియోగిస్తామని అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో లడ్డూలు, ఇతర ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిని ఇకపై విజయ డెయిరీ నుంచి కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 1 నుండి విజయ నెయ్యిని అన్ని ఆలయాలు వినియోగించనున్నాయి. ఇప్పటికే నష్టాల్లో ఉన్న మదర్‌ డైయిరీ.. ప్రభుత్వ నిర్ణయంతో మరింత చతికిలపడే పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నల్లగొండ- రంగారెడ్డి జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న నార్ముల్‌ మదర్‌ డైయిరీలో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రైతులే ఉన్నారు. జిల్లాలో 24 చిల్లింగ్‌ సెంటర్లు ఉండగా, 435 సొసైటీల ద్వారా సుమారు 45 వేల మంది రైతులు రోజూ సగటున లక్ష లీటర్ల పాలు పోస్తున్నారు. మదర్ డైయిరీకి వేల లీటర్ల పాలు పోసి ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ గడిచిన 40 ఏళ్లుగా కొనసాగుతోంది. ప్రైవేట్‌ డైయిరీలు పుట్టగొడుగుల్లా పుట్టుకువచ్చినా రైతులు మదర్‌ డైయిరీని కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంలో యాదగిరిగుట్ట, చెరువు గుట్టు దేవాలయాలను మినహాయించాలని రైతులు కోరుతున్నారు.

యాదగిరిగుట్ట దేవస్థానానికి ప్రతి నెలా 30 టన్నుల నెయ్యి మదర్‌ డైయిరీ సరఫరా చేస్తుంది. ఇది డెయిరీకి అతిపెద్ద ఆదాయ వనరుగా ఉంది. లడ్డూ ప్రసాద తయారీలో వినియోగిస్తున్న మదర్ డైయిరీ నెయ్యి స్వచ్ఛమైనదేనని, ఎలాంటి కల్తీ లేదని స్టేట్ ఫుడ్ లేబొరేటరీ రిపోర్ట్ ఇచ్చింది. కాగా యాదగిరిగుట్టకు గత 40 ఏళ్లుగా మదర్ డెయిరీనే నెయ్యి సరఫరా చేస్తోంది. ఈ డెయిరీ కాంట్రాక్ట్ మార్చి 2025 వరకు ఉంది. ఈ నేపథ్యంలో గుట్టకు మదర్‌ డెయిరీ నెయ్యినే సరఫరా చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. మదర్ డైయిరీలో యాదాద్రి జిల్లా రైతులే అత్యధికంగా ఉన్నారని, రైతుల ప్రయోజనం కాపాడేందుకు తాము ప్రయత్నిస్తున్నామని నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం నుంచి యాదగిరిగుట్టను మినహాయించేలా ప్రయత్నిస్తామని నేతలు చెబుతున్నారు.

కచ్చితంగా విజయ డైయిరీ నెయ్యినే వినియోగించాలన్న ప్రభుత్వ నిర్ణయం అమలైతే యాదగిరిగుట్ట దేవస్థానంతో మదర్ డైయిరీకి ఉన్న నాలుగు దశాబ్దాల బంధానికి తెరపడనుంది. మరోవైపు వేలాది మంది రైతులకు అండగా ఉన్న మదర్‌ డైయిరీ మరింత నష్టాలబారిన పడే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి..!

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..