Andhra Pradesh: వామ్మో.. దొంగలొచ్చారు.. పట్టపగలే ఊడ్చేస్తున్నారు.. బీ అలర్ట్..
Prakasam District News: ప్రకాశం జిల్లాలో పట్టపగలు దొంగలు రెచ్చిపోతున్నారు.. తాళం వేసిన ఇళ్ళను టార్గెట్ చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారు.. తాళం వేసిన ఇళ్ళ దగ్గర ముందుగా రెక్కీ చేసి చోరీకి అనువుగా ఉన్న సమయంలో పట్టపగలే తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్నారు.
Prakasam District News: ప్రకాశం జిల్లాలో పట్టపగలు దొంగలు రెచ్చిపోతున్నారు.. తాళం వేసిన ఇళ్ళను టార్గెట్ చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారు.. తాళం వేసిన ఇళ్ళ దగ్గర ముందుగా రెక్కీ చేసి చోరీకి అనువుగా ఉన్న సమయంలో పట్టపగలే తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్నారు. ఇరవైనాలుగు గంటల వ్యవధిలో ఇటు ఒంగోలు, అటు సింగరాయకొండ ప్రాంతాల్లో తాళం వేసిన రెండిళ్ళల్లో పట్టపగలే చోరీకి పాల్పడి 50 లక్షల విలువైన బంగారు నగలు, నగదు ఎత్తుకెళ్ళారు. దీంతో ఇళ్ళకు తాళం వేసి ఊరెళ్ళాలంటనే ప్రజలు హడలిపోతున్నారు. పట్టపగలే ఇళ్ళలో చోరీ ఘటనలు పోలీసులకు సవాల్ గా మారింది. దీంతో ఈ కేసులను ఛేధించేందుకు పోలీసులు బృందాలుగా విడిపోయి దొంగలకోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ వరుస చోరీలకు లింక్ ఏమైనా ఉందా.. లోకల్ దొంగల పనేనా.. లేక ఇతర రాష్ట్రాల నుంచి దొంగల ముఠాలు దిగాయా. అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
ఒంగోలులో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు..
ఒంగోలులోని టీచర్స్ కాలనీ రెండో వీధిలో కొత్తగా కొనుక్కున్నాడు కృష్ణారెడ్డి.. నగరంలోని గాంధీరోడ్డులోని ఓ చిల్లరకొట్టుగా గుమస్తాగా పనిచేసే కృష్ణారెడ్డి కొత్తింటిలో ఈనెల 6వ తేదిన చేరాడు. కొత్త ఇల్లు కొనుగోలు చేసి గృహప్రవేశం చేసిన సందర్బంగా కుటుంబ సభ్యులు అందరూ ఈనెల 8వ తేదిన దేవుడి దర్శనం కోసం తిరుపతి వెళ్ళారు. అయితే ఇంటి యజమాని కృష్ణారెడ్డి మాత్రం పని ఒత్తిడి కారణంగా తిరుపతి వెళ్ళలేదు. ఇంట్లో అందరూ తిరుపతికి వెళ్ళడంతో ఇంటికి తాళం వేసి యధావిధిగా 11వ తేది షాపుకు వెళ్ళాడు. ఉదయం 9 గంటలకు షాపుకు వెళ్ళి రాత్రి 11 గంటలకు ఇంటికి వస్తుంటాడు. ఈలోగా తిరుపతికి వెళ్ళిన భార్య రాత్రి ఇంటికి చేరుకునే సరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. దీంతో బెంబేలెత్తిన కృష్ణారెడ్డి భార్య కొత్త ఇంట్లో చోరీ జరిగిందేంటబ్బా అనుకుంటూ ఇల్లంతా కలియతిరిగారు.. మెయిన్ డోరు పగులగొట్టి దొంగలు ఇంట్లోకి ప్రవేశించినట్టు గుర్తించారు. ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో వెంటనే భర్తకు సమాచారం ఇవ్వడంతో ఇంటికి చేరుకున్న కృష్ణారెడ్డి తన ఇంట్లో చోరీ జరిగిందని నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒంగోలు డిఎస్‌పి నారాయణస్వామి రెడ్డి, తాలూకా సిఐ రాంబాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.. మెయిన్ గేటు పగులగొట్టి దొంగలు ఇంట్లోకి ప్రవేశించి నేరుగా బెడ్‌రూంలోని బీరువాను పగులగొట్టి నగలు ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు.. బెడ్‌పై బంగారు నగలకు చెందిన బాక్సులు పరిశీలించారు.. వెంటనే క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు సేకరించారు… గత శుక్రవారం తిరుపతి వెళ్ళి తిరిగి ఆదివారం వచ్చి చూసుకుంటే ఇంట్లో చోరీ జరిగిందని ఇంటి యజమాని కృష్ణారెడ్డి భార్య లక్ష్మి చెబుతున్నారు… ఇంట్లోని 60 సవర్ల బంగారు నగలు, 6 లక్షల రూపాయల నగదు అపహరణకు గురయ్యాయని, ఇంకా చిన్నపాటి నగలు ఉన్నాయని, వాటిని కూడా పరిశీలించిన తరువాత ఎంత మేర నగలు పోయాయో స్పష్టంగా చెబుతామంటున్నారు… ఈ చోరీ ఘటనలో దొంగల ఎంవో ఆధారంగా ఎవరు చేశారో గుర్తించే పనిలో ఉన్నామని, త్వరలోనే దొంగలను పట్టుకుంటామని ఒంగోలు డిఎస్‌పి నారాయస్వామిరెడ్డి తెలిపారు.
సింగరాయకొండలో ఇదే వరస..
ఒకవైపు ఒంగోలులో పట్టపగలు దొంగలు భారీ చేశారని పోలీసులు నానా హైరానా పడుతుంటే మరోవైపు శింగరాయకొండ మండలం మూల గుంటపాడులో ఇదే తరహాలో దొంగలు తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ చేసి పోలీసులకు సవాల్ విసిరారు.. మూలగుంటపాడులోని విద్యానగర్ లో ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ ఇంట్లో పట్టపగలు దొంగలు బీభత్సం సృష్టించారు. చంద్రశేఖర్ ఆయన భార్య ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు.. ఉదయం 9 గంటలకు స్కూలుకు వెళ్ళి 12 గంటలకు తిరిగి వచ్చి చూసుకుంటే ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ఘటనా స్థలానికి చేరుకున్న ఒంగోలు డిఎస్‌పి నారాయణస్వామిరెడ్డి చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఇంతకు ముందు ఒంగోలు ఇదే తరహాలో జరిగిన చోరీకి, ప్రస్తుతం జరిగిన చోరీకి సారూప్యతలను పరిశీలించారు. ఇక్కడ కూడా క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ ఇంట్లో 25 సవర్ల బంగారు నగలు, కిలో వెండి చోరీ జరిగినట్టు గుర్తించారు. చోరీకి పాల్పడిన సమయంలోని ఇంటి ముందు ఉన్న సిసి కెమెరాల్లో ముగ్గురువ్యక్తుల కదలికలను పోలీసులు గుర్తించారు. ఈ చోరీలో ముగ్గురు యువకులు పాల్గొన్నట్టు గుర్తించామని, వారి ఫోటోలను రిలీజ్ చేస్తున్నామని తెలిపారు… వీరిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే ఇంటికి తాళం వేసి ఊర్లకు వెళ్ళే సమయంలో పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని, విలువైన వస్తువులను ఇంట్లో కాకుండా బ్యాంకుల్లో, బంధువుల ఇళ్ళల్లో దాచుకుని ఊర్లకు వెళ్ళాల్సిందిగా ఒంగోలు డిఎస్‌పి నారాయణస్వామిరెడ్డి ప్రజలకు సూచిస్తున్నారు.
లోకల్ దొంగలా.. పక్క రాష్ట్రాలనుంచి వచ్చారా..
ఒంగోలు, సింగరాయకొండ ప్రాంతాల్లో పట్టపగలు తాళం వేసిన ఇళ్ళల్లో వరుస చోరీలు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాళం వేసిన ఇళ్ళను టార్గెట్ చేసుకుని చోరీలకు పాల్పడే ముఠా సభ్యులు తిరుగుతున్నట్టు గుర్తించారు.. ఈ రెండు చోరీలు చేసింది ఒకే ముఠా పనా.. లేక స్థానిక దొంగలు చేశారా.. అన్న కోణంలో విచారిస్తున్నారు. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ప్రకాశంజిల్లాలో చోరీలకు పాల్పడిన ముఠాల వివరాలు సేకరిస్తున్నారు. ఇంటికి తాళం వేసి ఊరెళ్లే ప్రజలు తమ బంగారం, నగదు, ఇతర విలువైన వస్తువులను జాగ్రత్త చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
-ఫైరోజ్ బేగ్, టీవీ9 రిపోర్టర్, ఒంగోలు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..