Tenali: 30 ఏళ్లుగా గుర్రంపైనే బాబాయ్ ప్రయాణం.. ఎందుకో తెలుసా..?
టెక్నాలజీ యుగంలో బుల్లెట్ ట్రెయిన్లు, ఎలక్ట్రిక్ కార్లు, హైడ్రోజన్ వాహనాలు పరుగులు తీస్తున్నా… తెనాలికి చెందిన లక్ష్మారెడ్డి మాత్రం తన ప్రయాణాన్ని గుర్రంపైనే కొనసాగిస్తున్నాడు. గత ముప్పై ఏళ్లుగా గుర్రంపైనే సవారీ చేస్తూ, గ్రామీణ జీవనానికి నిదర్శనంగా నిలుస్తున్నాడు. చిన్నతనంలో బాబాయి వెటకారం చేసిన మాటను సీరియస్‌గా తీసుకుని పెద్దయ్యాక గుర్రం కొన్నాడట.

ధ్వని వేగాన్ని మించిన విమానాలు వచ్చాయి. జెట్ స్పీడ్‌తో దూసుకెల్లే రాకెట్లపై విశ్వ వీధుల్లో తేలియాడుతున్నాం. విద్యుత్, హైడ్రోజన్‌తో నడిచే ప్రయాణ సాధనాలు వచ్చేశాయి. బుల్లెట్ ట్రెయిన్స్, మెట్రో రైళ్ల సంగతి ఇక చెప్పనక్కర్లేదు. ఎన్ని ప్రయాణ సాధనాలున్నా అతని మాత్రం ఆ ప్రయాణ సాధనాన్ని వదిలిపెట్టలేదు. ముప్పై ఏళ్లుగా దాని మీదే ప్రయాణం చేస్తూ తన ప్రత్యేకత నిలుపుకుంటున్నాడు. ఇంతకీ ఏంటా ప్రయాణ సాధనం అనుకుంటారా అదేనండీ గుర్రం… గుర్రంతో ఆగిపోయారనుకుంటారా కాదు గుర్రం బండి కూడా తయారు చేయించడానికి సిద్దమైపోయాడో తాతగారు…
తెనాలి వీధుల్లో రాచఠీవి లేదుగాని తెల్లని దుస్తుల్లో మెరిసి పోతున్న ఓ పెద్దాయన ఏకంగా గుర్రంపైనే సవారీ చేస్తున్నాడు. ఎందుకు గుర్రం ఎక్కాడో కనుక్కుందామని మాటలు కదిపితే విస్తుపోయే నిజాలెన్నో చెప్పేశాడు. తెనాలి మండలం కారుమూరివారి పాలెంకు చెందిన లక్ష్మా రెడ్డి సోమవారం రోజున ఎల్‌ఐసి కట్టడానికి తెనాలికి గుర్రంపై వచ్చాడు. ఈ రోజుల్లో గుర్రం ఎంటా అని అడిగితే ఇప్పుడే కాదు గత ముప్పై ఏళ్లుగా గుర్రంపైనే ప్రయాణిస్తున్నట్లు చెప్పాడు. తన చిన్నప్పుడు బాబాయి వరసయ్యే వ్యక్తి.. నువ్వు గుర్రం కొంటావా.. నీ వల్ల కాదంటూ వెటకారం ఆడిన మాటలు మనసులో నాటుకుపోయాయట. అందుకే పెద్ద అయిన తర్వాత గుర్రం కొనాలని అప్పుడే నిర్ణయించుకున్నట్లు లక్ష్మారెడ్డి తెలిపాడు. తనకి 25 ఏళ్లు వచ్చిన తర్వాత గుర్రం కొన్నానని ఇప్పటికీ ఐదు గుర్రాలు మార్చినట్లు చెప్పాడు. చుట్టుపక్కల గ్రామాలకే కాదు చుట్టాలింటికి వెళ్లాల్సి వచ్చినప్పుడే గుర్రంపైనే వెళ్తాడట… అంటే బాగా ఆస్తి పరుడు అనుకుంటారేమో అలాంటిదేమి లేదు. పెద్దగా చదుకోవలేదన్న చెప్పిన ఈ పెద్దాయన తనకున్న అరవై సెంట్ల భూమిలోనే వ్యవసాయం చేస్తున్నాడట.
తన ఇద్దరూ పిల్లలు ఉన్నత చదువులు చదువుకుంటున్నారని.. గుర్రాన్ని పోషించడానికి పెద్దగా ఖర్చు కాదని తెలిపాడు. సాధరణ మేతనే వేస్తానంటున్నాడు. రోడ్లు ఎంత దరిద్రంగా ఉన్నా తన గుర్రంపై ప్రయాణానికి ఎటువంటి ఇబ్బంది ఉండదంటూ సవారీ చేసుకుంటూ వెళ్లిపోయాడు.




