గాంధీ భవన్‌లో జరిగిన కాంగ్రెస్ సంబరాల్లో టీడీపీ జెండాలు..! క్లారిటీ ఇచ్చిన సీనియర్ నేత బుద్దా వెంకన్న..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏపీలో రాజకీయ కాక కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత గాంధీ భవన్‌లో జరిగిన కాంగ్రెస్ సంబరాల్లో టీడీపీ జెండాలు కనిపించడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు టీడీపీ సంబరాలు చేసుకోవడం విడ్డూరమంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏపీలో రాజకీయ కాక కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత గాంధీ భవన్‌లో జరిగిన కాంగ్రెస్ సంబరాల్లో టీడీపీ జెండాలు కనిపించడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అటు ఏపీలోనూ అక్కడక్కడా టీడీపీ శ్రేణులు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై హర్షం వ్యక్తంచేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఏపీలోనూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ సర్కారును ప్రజలు గద్దె దించుతారంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు టీడీపీ సంబరాలు చేసుకోవడం విడ్డూరమంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఈ అంశంపై మాజీ మంత్రి కొడాలి నాని టీడీపీ, చంద్రబాబు నాయుడిపై చేసిన కామెంట్స్‌కు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు గానీ, టీడీపీ గానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదని ఆయన స్పష్టంచేశారు. గాంధీభవన్ దగ్గర టీడీపీ జెండాలు కనపడితే దానితో చంద్రబాబుకు ఏం సంబంధం? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఎవరైనా చంద్రబాబును దూషిస్తే.. ఇక తాము కూడా అదే రీతిలో స్పందించాల్సి ఉంటుందన్నారు. చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ ఇష్టారీతిలో మాట్లాడుతున్న సొంత పార్టీ నేతలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత జగన్‌దే అన్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఏపీ వదిలి పారిపోయేందుకు చాలామంది సిద్ధమవుతున్నారని బుద్దా వెంకన్న అన్నారు. కొడాలి నాని టీడీపీ సస్పెండ్ చేస్తే వైసీపీలోకి వెళ్లారని అన్నారు. ఆయన చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఇష్టారీతిగా మాట్లాడితే ఇక తాము సహించబోమన్నారు.
టీడీపీ సీటు ఇవ్వకపోతే ప్లాన్ బీ..
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు బుద్దా వెంకన్న వెల్లడించారు. తనకు పార్టీ సీటు ఇవ్వాలని చంద్రబాబు నాయుడిని అడుగుతానని చెప్పారు. బీసీ అభ్యర్థిగా ఇక్కడ తనకు సీటు ఇస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఒకవేళ సీటు ఇవ్వకుంటే ఆప్షన్ బి కూడా ఉందంటూ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కుటుంబం మీద ఈగ వాలకుండా తాను చూసుకుంటూ ఉన్నట్లు చెప్పారు. టీడీపీ నుంచి వైసీపీకి వెళ్లిన ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో గెలవరని బుద్దా వెంకన్న అన్నారు.
ఇంతకీ కొడాలి నాని ఏమన్నారంటే..?
తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అయితే టీడీపీ వాళ్లు ఇక్కడ సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని రెండ్రోజుల క్రితం కొడాలి నాని ఎద్దేవా చేశారు. గెలిస్తే తమ వారు అని, ఓడితే తమ వారు కాదని అనడం టీడీపీకి అలవాటే అన్నారు. ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీని పెడితే… ఆ పార్టీ వాళ్లు సిగ్గులేకుండా గాంధీ భవన్‌కు వెళ్లి టీడీపీ జెండాలు ఎగురవేశారని దుయ్యబట్టారు. జగన్ మీద ఏపీలో ఎలాంటి ప్రజా వ్యతిరేకత లేదని.. మరోసారి జగనే సీఎం కావడం ఖాయమన్నారు. ప్రతిపక్షంలో కూర్చోవడానికే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసారని ఎద్దేవా చేశారు. బీజేపీ, జనసేన కలిసి తెలంగాణలో పోటీ చేస్తే ఎలాంటి ఫలితాలు వచ్చాయో.. అలాంటి ఫలితాలే ఏపీలో కూడా వస్తాయని జోస్యం చెప్పారు.
మరిన్ని ఏపీ వార్తలు చదవండి