AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: కొంపముంచిన ‘కుల్సుమ్ గోల్డ్’.. వాసనకు అడ్డం పడిన విద్యార్థులు.. పరుగులు పెట్టిన ఉపాధ్యాయులు

తన దగ్గర మంచి సువాసన రావాలని.. అందరినీ ఆకట్టుకోవాలని ఓ విద్యార్థి బాడీ స్ప్రే కొట్టుకుని క్లాస్‌కు వచ్చాడు.. అంత వరకు బాగానే ఉంది.. కానీ.. ఆ వాసన పీల్చి విద్యార్థులు అంతా ఒక్కసారిగా కింద పడిపోయారు.. దీంతో ఎప్పుడూ సందడిగా ఉండే పాఠశాలలో అలజడి మొదలైంది.. అసలేమైందో తెలియక ఉపాధ్యాయులు.. విద్యార్థుల తల్లిదండ్రులు పరుగులు పెట్టారు..

Andhra Pradesh: కొంపముంచిన ‘కుల్సుమ్ గోల్డ్’.. వాసనకు అడ్డం పడిన విద్యార్థులు.. పరుగులు పెట్టిన ఉపాధ్యాయులు
Konaseema News
Pvv Satyanarayana
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Oct 12, 2023 | 6:14 PM

Share

తన దగ్గర మంచి సువాసన రావాలని.. అందరినీ ఆకట్టుకోవాలని ఓ విద్యార్థి బాడీ స్ప్రే కొట్టుకుని క్లాస్‌కు వచ్చాడు.. అంత వరకు బాగానే ఉంది.. కానీ.. ఆ వాసన పీల్చి విద్యార్థులు అంతా ఒక్కసారిగా కింద పడిపోయారు.. దీంతో ఎప్పుడూ సందడిగా ఉండే పాఠశాలలో అలజడి మొదలైంది.. అసలేమైందో తెలియక ఉపాధ్యాయులు.. విద్యార్థుల తల్లిదండ్రులు పరుగులు పెట్టారు.. వామ్మో.. వాయ్యో అంటూ ఆసుపత్రికి తరలించారు.. వెంటనే చికిత్స అందించిన వైద్యులు ప్రాణాలకు ప్రమాదమేమి లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం ముంజివరంకొట్టు జడ్పీ హైస్కూల్‌లో చోటుచేసుకుంది. మధ్యాహ్నం వేళ విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థత గురయ్యారు. స్కూల్ రూమ్‌లోకి టెన్త్ క్లాస్ విద్యార్థి సెంటు (బాడీ స్ప్రే) కొట్టుకువచ్చాడు. అలా వచ్చిన కొద్ది సేపటికే బాడీ స్ప్రే వాసనకి ఎనిమిది మంది విద్యార్థులు అస్వస్థత గురై కింద పడిపోయారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు అస్వస్థతకు గురైన నాలుగు, ఆరు, ఏడు తరగతి చదువుతున్న విద్యార్థులను పి.గన్నవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంటనే చికిత్స అందించిన వైద్యులు.. ప్రాణాపాయ స్థితి ఏమి లేదనీ చెప్పడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.

మధ్యాహ్నం లంచ్ బ్రేక్ సమయంలో ఇంటికి వెళ్లిన టెన్త్ విద్యార్ధి బాడీ స్ప్రే కొట్టుకు వచ్చి క్లాస్ రూముల్లో తిరుగుతుండగా.. ఆ వాసనకు ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయామని ఎనిమిది మంది విద్యార్థులు వైద్యులు, పోలీసులకు తెలిపారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనకు కారణమైన బాడీ స్ప్రే ని పోలీసులు విద్యార్థి దగ్గర నుంచి స్వాధీనం చేసుకుని వైద్యులకు అప్పగించారు.

కుల్సుమ్ గోల్డ్ పేరుతో ఉన్న బాడీ స్ప్రేను పరిశీలించిన అనంతరం వైద్యులు నివేదిక ఇవ్వనున్నారు. ఈ స్ప్రే నాణ్యత గురించి తనిఖీలకు పంపించినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..