AP Weather: ఆగస్టు వచ్చినా ఏపీలో మండుతున్న ఎండలు.. కారణమిదే అంటోన్న వాతావారణ శాఖ.. వివరాలివే..
Andhra Pradesh: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి.. పది రోజులుగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తోడు ఉక్కపోతతో జనాలు ఇబ్బందిపడుతున్నారు. సాధారణంగా ఆగస్టు నెలలో వర్షాలు కురువాల్సింది పోయి.. ఇలా ఉష్ణోగ్రతలు పెరగడం విచిత్రంగా ఉందంటున్నారు. దీనిపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ క్లారిటీ ఇచ్చింది.. ఎండలు ఇలా మండిపోవడానికి కారణాలను వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్, ఆగస్టు 16: ఏపీలో విభిన్న వాతావరణం కనిపిస్తోంది. ఆగస్టు నెలలో వర్షాలు కురవాల్సింది పోయి ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత కూడా తోడు కావడంతో జనాలు అల్లాడిపోతున్నారు.. దీనిపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. వాతావరణంలో సోలార్ రేడియేషన్ ప్రసరణ ఎక్కువగా ఉండటం వల్లనే ఇలా జరుగుతోందని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు చెబుతున్నారు. సూర్యుడి నుంచి కిరణాలు నేరుగా భూమిపై పడటంతో ఇలా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయని.. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రతతో పగటి పూట ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయని తెలిపింది. ఎండలకు తోడు ఉక్కపోత కూడ తోడవుతుంది అన్నారు. వాతావరణంలోని మార్పుల వలన ఈ పరిస్థితి ఉందని.. మామూలుగా అయితే మే నెల నుంచి ఆగష్టు వరకు ఏపీ వాతావరణంపై సోలార్ రేడియేషన్ ప్రసరణ ఎక్కువగా ఉంటుంది అన్నారు. భూమి ఉపరితలంకి వచ్చే సూర్యకిరణాల ప్రసరణ వర్షాకాలంలో ఉండే మేఘాల కారణంగా వేసవితో పోలిస్తే ఎండ తీవ్రత తక్కువగా ఉంటుంది అన్నారు.
ప్రస్తుతం ఏపీ పైభాగంలో మేఘాలు తక్కువగా ఏర్పడటంతో సూర్యుడి నుంచి నేరుగా కిరణాలు పడటం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి అసౌకర్యంతో కూడిన వాతావరణం ఉంటుందని తెలిపారు. ఈ పిరస్థితుల కారణంగానే రాష్ట్రంలో ఎండ తీవ్రతతో పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు అవుతున్నాయని, ఉక్కపోత కూడ తోడవ్వడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నాని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు పెరిగాయి.. పైగా వానాకాలంలో వర్షాలు కురిసింది తక్కువే. జులైలో అక్కడక్కడా వర్షాలు కురిశాయే తప్ప ఆశించిన స్థాయిలో మాత్రం వర్షాలు పడలేదు. వాస్తవానికి ఆగస్టులో వర్షాలు విస్తారంగా కురవాలి.. కానీ ఆ పరిస్థితులు కనిపించడం లేదు. మొత్తానికి ఆగస్టు నెల కూడా ఎండా కాలాన్ని తలపిస్తుందనే చెప్పాలి అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు.
ఎండల సంగతి అలా ఉంటే పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచ మోస్తరు జల్లులు కురుస్తున్నాయి. విజయనగరం జిల్లాలోని చీపురు పల్లిలో 45.6 మి మీటర్లు, ఎస్‌కోటలో 44 మి. మీటర్లు.. శ్రీకాకుళం జిల్లాలోని మందసలో 45 మి. మీటర్లు, కాకినాడ జిల్లాలోని పెద్దాపురంలో 23 మి. మీటర్లు, పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరంలో 21 మి. మీటర్లు, విశాఖపట్నంలో 20 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే రాయలసీమలోని తిరుపతి జిల్లా పాకాలలో 37.2 మిల్లీ మీటర్లు, చిత్తూరు జిల్లా నగరిలో 18, కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడ్డాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..