Pulivendula: మరికొన్ని గంటల్లో పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నికల కౌంటింగ్.. ఎన్ని ఓట్లు పోలయ్యాయంటే
ఉద్రిక్తతలు, ఉత్కంఠగా సాగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం కల్లా ఈ ప్రక్రియ పూర్తి కానుందని అధికారులు తెలిపారు. కడప పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ జరగనుంది. కంప్లీట్ డీటేల్స్ తెలుసుకుందాం పదండి ..

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సిబ్బందికి జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ సూచనలు చేశారు. పులివెందులలో మొత్తం ఓట్లు 10 వేల 601 కాగా.. 8 వేల 103 ఓట్లు పోలయ్యాయి. ఇక ఒంటిమిట్టలో మొత్తం 24 వేల 606 ఓట్లు ఉండగా.. 20 వేల 681 ఓట్లు పోలయ్యాయి.
కౌంటింగ్ విధుల్లో 30 మంది సూపర్‌వైజర్లు, 60 కౌంటింగ్ అసిస్టెంట్లు
కౌంటింగ్ విధుల్లో 30 మంది సూపర్ వైజర్లు 60 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, ముగ్గురు అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు ఉంటారని తెలిపారు జెడ్పీ సీఈవో ఓబులమ్మ. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి 10 టేబుళ్లు ఏర్పాటు ఒక రౌండులో లెక్కింపు పూర్తి పూర్తవుతుందని తెలిపారు. ఒక ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి 10 టేబుళ్లు ఏర్పాటు చేయగా 2 రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుందని వివరించారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు వేర్వేరుగా లెక్కింపు ఉంటుందన్నారు. మధ్యాహ్నంకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.
ప్రశాంతంగా ముగిసిన రీపోలింగ్
మరోవైపు పులివెందుల ZPTC స్థానంలో రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అవకతవకలు జరిగాయనే ఫిర్యాదుల నేపథ్యంలో అచ్చవెల్లి, ఈ.కొత్తపల్లెలో రీపోలింగ్ నిర్వహించారు. అయితే పులివెందులలో రీపోలింగ్‌ను వైసీపీ బహిష్కరించింది. కోర్టుకు వివరాలు సమర్పించేందుకే 2 చోట్ల రీపోలింగ్ జరిపారని ఆరోపించారు.




