AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మండుతున్న నిత్యావసరాల ధరలు.. పండగ సీజన్‌లో మధ్యతరగతికి క్రొకొడైల్ ఫెస్టివల్!

ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. ధరలిట్టా మండబట్టే.. అంటూ సీజను సీజనుకూ పాటందుకోవడం తప్ప మరో దిక్కు లేకుండా పోతోంది. కడుపులో పేగులు చల్లబడాలంటే.. నోట్లోకి నాలుగువేళ్లూ పోవాలంటే.. కలో గంజో కాయో కూరో వండుకోవాలిగా. కానీ.. పొయ్యిలో మండాల్సిన మంట గుండెల్లో మండుతోంది. ఇప్పుడున్న ధరాఘాతానికి.. మరీముఖ్యంగా మధ్యతరగతి జీవుడి బతుకు మళ్లీమళ్లీ దుర్భరమౌతోంది.

మండుతున్న నిత్యావసరాల ధరలు.. పండగ సీజన్‌లో మధ్యతరగతికి క్రొకొడైల్ ఫెస్టివల్!
Essentials
Ram Naramaneni
|

Updated on: Sep 27, 2024 | 7:19 AM

Share

పచారీ సామాన్లకో, కాయగూరలకో సంచి పట్టుకుని బైటికెళితే.. గుండెలు బరువెక్కకుండా ఇంటికొస్తామన్న గ్యారంటీ లేకుండా పోతోంది. ఔను మరి.. కొండెక్కి చుక్కలనంటుకున్నాయి నిత్యావసరాల ధరలు. వంట నూనెలు భగ్గుమంటుంటే.. కూరగాయల ధరలు కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. కొత్తిమీర కొనాలన్నా యాభైనోటు బైటికి తియ్యాల్సిన పరిస్థితి. పండగ సీజన్లో మిడిల్‌క్లాసోడ్ని భయపెట్టి చంపేస్తున్నాయి తాజా ధరలు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడం, దిగుబడి తగ్గిపోవడం, రవాణా సమస్యలు.. అన్నీ కలిపి కూరగాయల ధరల్ని కొండెక్కేలా చేశాయి. బహిరంగ మార్కెట్లే కాదు.. రైతుబజార్లలో కూడా ఏది కొనబోయినా కొరివే. సరిగ్గా నెలరోజుల కిందట కిలో పాతిక రూపాయలకొచ్చిన టమోటా ఇప్పుడు రెండింతలై హాఫ్ సెంచరీ పలుకుతోంది. 50 నుంచి 70 రూపాయలు ఇచ్చుకుంటే తప్ప కిలో కూరగాయలు రావడం లేదు. దానికి తోడు వెల్లుల్లి, ఉల్లి ధరలు సైతం కొన్నవాళ్లకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.

మార్కెట్లో వంట నూనెలు సైతం భగ్గుమంటున్నాయి. పామాయిల్, సన్ ఫ్లవర్ నూనెలు లీటర్‌కు 20 రూపాయలకు పైగా పెరిగింది. వేరుశనగ నూనె 160 రూపాయలు దాటి.. డబుల్ సెంచరీని టచ్ చెయ్యబోతోంది. కొబ్బరి నూనెదీ అదే దారి. వంట నూనెలపై కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలు భారీగా పెంచడమే ఈ మంటకు కారణమట. బుక్కయ్యేది మాత్రం వినియోగదారుడే.

ఆకుకూరలైతే ముట్టుకుంటే చాలు అగ్గి రాజుకుంటోంది. మార్కెట్లో ఇతర కూరగాయలతో పోలిస్తే ఆకుకూరల రేట్లు కాసింత కనికరిస్తాయి. అందరికీ అందుబాటులో ఉంటాయి. 20 రూపాయలకు ఆరు కట్టల పాలకూరొచ్చేది. పదిరూపాయలిస్తే రెండుమూడు కొత్తిమీర, పుదీనా కట్టలొచ్చేవి. ఇప్పుడైతే. వందనోటిస్తే తప్ప వచ్చేదే లే అంటోంది కొత్తిమీర.

రెండు వందనోట్లు పట్టుకెళితే కనీసం నాలుగైదు రకాల కూరగాయలతో చేతిలో సంచి నిండేది. ఇప్పుడైతే వెజిటబుల్ బడ్జెట్ కూడా ఐదొందలు దాటిపోతోంది. సాధారణంగా కార్తీక మాసంలో కూరగాయల ధరలు పెరుగుతాయి. ఖరీఫ్ సీజన్ పూర్తయ్యి రబీ పంట మొదలయ్యే లోపు కూరగాయలు ధరలు పెరగడం కామన్. కానీ.. కూరగాయలే కాదు.. నూనె ప్యాకెట్టు కూడా భగ్గుమంటుంటే.. సగటు వినియోగదారుడి గుండె గుభేల్‌మంటోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..