Jagan Tirumala Visit: డిక్లరేషన్‌ ఢీ.. ఇవాళ సాయంత్రం తిరుమలకు జగన్‌

ఇటు కొండకు ఆయన కమింగ్‌...అటు వాళ్ల వార్నింగ్‌..మధ్యలో పోలీసుల మోహరింపులు. డిక్లరేషన్‌పై ఢీ అంటోంది ఏపీ రాజకీయం. లడ్డూ కల్తీ వివాదం కాస్తా...డిక్లరేషన్‌ వార్‌గా మారిపోయింది. ఇవాళ తిరుమలకు వస్తున్న మాజీ సీఎం జగన్‌..డిక్లరేషన్‌ ఇస్తేనే ఎంట్రీ...లేదంటే ఆయనను అడ్డుకుంటామంటున్నారు కూటమి నేతలు. భగవంతుడికి భక్తుడికి మధ్య డిక్లరేషన్‌ గోడ ఎందుకంటోంది వైసీపీ. మరి జగన్‌ డిక్లరేషన్‌ ఇస్తారా? ఇవ్వరా? ఏడు కొండల వాడి సాక్షిగా ఇవాళ ఏం జరగనుంది?

Jagan Tirumala Visit: డిక్లరేషన్‌ ఢీ.. ఇవాళ సాయంత్రం తిరుమలకు జగన్‌
Jagan Tirumala Visit
Follow us

|

Updated on: Sep 27, 2024 | 8:56 AM

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం కరిగి కరిగి ఏపీ రాజకీయాలను సలసలా మరిగేలా చేస్తోంది. దీంతో రాజకీయం పాకం ముదిరి పీక్స్‌కి చేరింది. అది ఇప్పుడు డిక్లరేషన్‌ వార్‌గా టర్న్‌ తీసుకుంది. ఇవాళ సాయంత్రం తిరుమల వెళుతున్నారు మాజీ సీఎం జగన్‌. అయితే డిక్లరేషన్‌ ఇచ్చాకే తిరుమలలో ఎంటర్‌ అవాలంటూ వార్నింగులు ఇస్తున్నారు కూటమి నేతలు, హిందుత్వ వాదులు. లేకుంటే నో ఎంట్రీ అంటున్నారు. అలిపిరి దగ్గరే ఆపేస్తామంటున్నారు. భగవంతుడి దగ్గరకు వెళ్లే భక్తుడిని ఎలా ఆపుతారంటోంది వైసీపీ. ఇక జగన్‌ పర్యటన నేపథ్యంలో…పోలీస్‌ యాక్ట్ 30 అమల్లోకి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో…భక్తి భావం పొంగి పొర్లే తిరుమల కొండల్లో రాజకీయ సెగలు రాజుకుంటున్నాయి.

జగన్‌ తిరుమల పర్యటనపై కూటమి నేతలు ఘాటు కామెంట్లు చేస్తున్నారు. దర్శనానికి ముందు జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందే అంటున్నారు కూటమి నేతలు. తిరుమలలో ఆలయ సంప్రదాయాలు, సనాతన ధర్మాన్ని గౌరవించాల్సిన బాధ్యత లేదా అంటూ జగన్‌ని నిలదీశారు సీఎం చంద్రబాబు. ఇక ఎక్కడికి వెళ్తే అక్కడి విధానాలు పాటించాలని, జగన్‌ కూడా తిరుమల దేవస్థానం నిబంధనలు పాటించాలన్నారు మంత్రి నారా లోకేష్‌. జగన్ తిరుమల దర్శించుకోవాలంటే డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందే అని మంత్రి పయ్యావుల కూడా పట్టు పట్టారు. డిక్లరేషన్‌ సమర్పించాకే జగన్‌ను అనుమతించాలన్నారు ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి.

డిక్లరేషన్‌ ఇవ్వకపోతే అడ్డుకుంటామన్న బీజేపీ

శ్రీవారిని నమ్ముతున్నానంటూ గరుత్మంతుని విగ్రహం దగ్గర డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే వైసీపీ అధినేత జగన్ తిరుమలకు వెళ్లాలని బీజేపీ నేత భానుప్రకాష్‌ రెడ్డి డిమాండ్ చేశారు. డిక్లరేషన్‌లో ధర్మారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన సాక్షి సంతకాలు చేయాలని, వైసీపీ హయాంలో తిరుమలలో జరిగిన తప్పులకు క్షమాపణ చెప్పాలని.. లేదంటే బీజేపీ కార్యకర్తలంతా జగన్‌ను అడ్డుకుంటారని భానుప్రకాష్‌ రెడ్డి హెచ్చరించారు. జగన్‌ నుంచి డిక్లరేషన్‌ తీసుకోవాలంటూ టీటీడీ ఈవోకు బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు. హిందుత్వ వాదులు కూడా అదే మాట చెబుతున్నారు.

జగన్ డిక్లరేషన్‌పై పవన్ ఏమన్నారంటే..?

జగన్ తిరుమల డిక్లరేషన్‌పై జనసేన అధినేత పవన్ మాత్రం ఈ వ్యవహారంపై తనదైన రీతిలో స్పందించారు. జగన్ తిరుమల యాత్రలో డిక్లరేషన్ అనేది టీటీడీ చూసుకొనే ప్రక్రియ అన్నారు. ఆ ప్రక్రియపై కూటమి పక్షాలు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. వ్యక్తులను… అన్య మతాలను లక్ష్యంగా చేసుకొని మాట్లాడవద్దని సూచించారు. తుని, కోనసీమ ఘటనలతో కులాల చిచ్చు రగిలించాలని చూసిన వైసీపీ ఇప్పుడు మతం మంటలు రేపాలని చూస్తోందని ఫైరయ్యారు. పోలీసులు… ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

డిక్లరేషన్‌ ఎందుకంటున్న వైసీపీ

అదే సమయంలో భగవంతుడికి భక్తుడికి మధ్య డిక్లరేషన్‌ ఎందుకని వైసీపీ ప్రశ్నిస్తోంది. జగన్‌ను రాజకీయంగా అణగదొక్కేందుకే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చంద్రబాబు ఆరోపణలు చేశారన్నారు వైసీపీ నేత వంగా గీత. జగన్ డిక్లరేషన్ ఇవ్వాలంటే టీడీపీ చేసిన ఆరోపణలను నిజాలని నిరూపించండి అంటూ సవాల్‌ విసిరారు ఆమె. జగన్ గతంలోనూ తిరుమల వెళ్లారు, అప్పుడు లేనిది ఇప్పుడు డిక్లరేషన్‌పై రాజకీయం ఎందుకుని వైసీపీ నేత, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు ప్రశ్నించారు.

తిరుపతిలో పోలీస్‌ యాక్ట్‌ 30

ఇక జగన్‌ పర్యటన సందర్భంగా తిరుపతిలో జిల్లాలో పోలీస్‌ యాక్ట్‌ 30 విధించారు. అక్టోబర్ 25 వరకు ఇది అమల్లో ఉంటుంది. నిరసనలు, సభలు, ర్యాలీలు చేయాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి చేశారు. అలిపిరి దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్‌ డిక్లరేషన్‌ ఇస్తారా? ఇవ్వరా? ఇవాళ వెంకన్న పాదాల చెంత ఏం జరగనుంది? అన్నది సస్పెన్స్‌గా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..