Vizianagaram: దేశంలోనే మొట్టమొదటి వాల్మీకి రిసెర్చ్ సెంటర్ ప్రారంభం

విజయనగరంలో వాల్మీకి రీసెర్చ్‌ సెంటర్‌ను ప్రారంభించారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రామాయణంపై అధ్యయనం,పరిశోధనల కోసం రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు నారాయణం కుటుంబసభ్యులు. మూడు రోజుల పాటు జరిగే వేడుకల్లో తొలిరోజు రామయణాన్ని కళ్లకు కట్టింది లేజర్‌ షో.

Vizianagaram: దేశంలోనే మొట్టమొదటి వాల్మీకి రిసెర్చ్ సెంటర్ ప్రారంభం
M Venkaiah Naidu inaugurates the Valmiki Research Centre
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Sep 27, 2024 | 10:33 AM

వింటే రామాయణం వినాలి. చూస్తే ఇదిగో రామనారాయణంలో ఇలా రామాయణ వైభవాన్ని చూసి తరించాలి. నాడు..నేడు.. ఏనాటికైనా సరే  రామాయణం సర్వ మానవాళికి  జీవనసారం.  రామాయణం గురించి మరింత తెలుసుకోవాలనే వారికి. అధ్యయనం చేయాలనే  ఆసక్తి వున్నవారికి  ఆత్మీయ స్వాగతమే  ఈ వేడుక. జీవకళ ఉట్టిపడే రామాయణ ఘట్టాలు…  పిబరే రామరసం అంటూ మహాకవి మళ్లీ మన మధ్యకు వచ్చారా? అని ఆశ్చర్యపోయేలా వాల్మీకి విగ్రహం.. ఒకటా రెండా..రామనారాయణంలో అడుగు పెడితే చాలు సంపూర్ణ రామాయణం కళ్లెదుట కదలాడుతుంది.

విజయనగరంలో మరో  శ్రీరామతీర్థమే ఈ రామనారాయణ క్షేత్రం. నారాయణం నాగేశ్వరరావు కుటుంబం ఆధ్వర్యంలో నెలకొల్పిన వాల్మీకి రీసెర్చ్‌ సెంటర్‌ను ఘనంగా ప్రారంభించారు  మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సుందర రాజన్ రంగరాజన్, టిటిడి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, అవధాని మాడుగుల నాగఫణి శర్మ, మాజీ ఎంపి టిజి వెంకటేష్‌ సహా అనేక మంది  పండితులు, ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొన్నారు.  ఇంటింటికి రామయాణాన్ని చేరువ చేయాలనుకున్న పెద్దలు నారాయణం నరసింహ మూర్తి సంకల్పాన్ని సాకారం చేస్తున్నారని ఆయన కుటుంబసభ్యులను అభినందించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

రామాయణంపై పరిశోధనకు,అధ్యయానికి ఇలాంటి వేదిక దేశంలో మరెక్కడా లేదు. సంస్కృతం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ నాలుగు భాషల్లో రామాయణ గ్రంథాలు,రచనలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. వాల్మీకి రీసెర్చ్‌ సెంటర్‌ను జాతీయ సంస్కృత యూనివర్సిటీతో అనుసంధానం చేశారు. టిటిడి సంస్కృత యూనివర్సిటీ పర్యవేక్షణలో  కార్యక్రమాలు  కొనసాగుతాయిక్కడ. అంతేకాదు ఉచిత వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు  రామనారాయణ ట్రస్ట్ నిర్వాహాకులు. ఈ రీసెర్చ్ సెంటర్‌లో ప్రస్తుతం 20వేలకు పైగా రామాయణ గ్రంథాలు, పుస్తకాలు ఉన్నాయి. త్వరలో లక్ష పుస్తకాలను అందుబాటులోకి  తేనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..