- Telugu News Photo Gallery US H1B/H4 Visa Vetting: Temporary Revocations, Social Media Checks and Immigrant Concerns
హెచ్-1బీ, హెచ్-4 వీసాలపై అమెరికా సంచలన నిర్ణయం.. వెట్టింగ్ పేరుతో భారతీయులపై ఉక్కుపాదం!
అమెరికాలో పనిచేస్తున్న వలస కార్మికులకు గట్టి షాక్ తగిలింది. హెచ్-1బీ, హెచ్-4 వీసాలపై వెట్టింగ్ ప్రక్రియను మరింత కఠినతరం చేసింది అమెరికా ప్రభుత్వం, ముందుజాగ్రత్త చర్యలుగా భారీ సంఖ్యలో వర్కింగ్ వీసాలను తాత్కాలికంగా రద్దు చేసింది. కాన్సులేట్ నుంచి ఈమెయిల్స్ రావడంతో వీసాదారుల్లో ఆందోళన నెలకొంది.
Updated on: Dec 18, 2025 | 2:24 PM

హెచ్-1బీ, హెచ్-4 వీసాలకు సంబంధించి సోషల్ మీడియా వెట్టింగ్ సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ ప్రక్రియ మొదలైన వెంటనే ‘ప్రుడెన్షియల్ రివోకేషన్’ పేరుతో వీసాల రద్దు జరగడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇది శాశ్వత రద్దు కాదని, కేవలం తాత్కాలిక చర్య మాత్రమేనని ఇమిగ్రేషన్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ఇమిగ్రేషన్ అటార్నీ ఎమిలీ నాయ్మెన్ మాట్లాడుతూ, ప్రుడెన్షియల్ వీసా రద్దు వల్ల వీసాదారుల చట్టబద్ధ నివాస హక్కులకు ఎలాంటి భంగం ఉండదని వెల్లడించారు. అయితే, భవిష్యత్తులో వీసా అపాయింట్‌మెంట్ లేదా రీ-స్టాంపింగ్ సమయంలో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని దరఖాస్తులను మరింత క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు.

ఇదిలా ఉండగా, అమెరికాలోకి ప్రవేశించాలనుకునే హెచ్-1బీ, హెచ్-4తో పాటు ఎఫ్, ఎం, జే వీసా దరఖాస్తుదారుల ఆన్లైన్ ఉనికిని ప్రభుత్వం సమీక్షిస్తోంది. వెట్టింగ్ ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు తమ సోషల్ మీడియా ఖాతాలను ప్రైవేట్ నుంచి పబ్లిక్‌కు మార్చుకోవాల్సి ఉంటుందని స్టేట్ డిపార్ట్మెంట్ ఇప్పటికే సూచించింది. ఈ కారణంగా భారతీయులు సహా పలువురి వీసా ఇంటర్వ్యూలు వాయిదా పడినట్లు తెలుస్తోంది.

అమెరికాలోకి వచ్చే వ్యక్తులు దేశ భద్రతకు ఎలాంటి ముప్పు కలిగించరని ప్రభుత్వం నమ్మగలగాలని, అందుకే ఈ వెట్టింగ్ తప్పనిసరి అని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. విశ్వసనీయతను నిరూపించుకోవాల్సిన బాధ్యత వీసాదారులపైనే ఉంటుందని కూడా పేర్కొంది. అయితే వీసాదారుల అర్హతలపై ప్రభుత్వానికి ఏదైనా అనుమానం కలిగినప్పుడు తాత్కాలికంగా వీసాను రద్దు చేస్తుంది. ఈ సమయంలో వీసా స్టాంప్ చెల్లుబాటు కాకపోయితే గడువు ముగిసే వరకు వారు అమెరికాలో ఉండవచ్చు. అయితే, ఒకసారి దేశం విడిచి వెళ్తే మళ్లీ ప్రవేశానికి అవకాశం ఉండదు.

జనవరి నుంచి ఇప్పటివరకు సుమారు 85 వేల వీసాలు రద్దయ్యాయని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. అక్రమ వలసలు, నేరాలు, ట్రాఫిక్ ఉల్లంఘనలు వంటి అంశాలపై ట్రంప్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. అదే సమయంలో హెచ్-1బీ వీసా దరఖాస్తుదారుల లింక్‌డిన్ ప్రొఫైళ్లు, రెజ్యూమెలను కూడా సమీక్షించాలని దౌత్యవేత్తలకు ఆదేశాలు జారీ చేసింది. అమెరికా పౌరుల భద్రతే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు స్టేట్ డిపార్ట్మెంట్ స్పష్టం చేస్తుండటంతో, వర్కింగ్ వీసాలపై ఆధారపడిన లక్షల మంది భవితవ్యంపై ఆందోళన నెలకొంది.
