AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inkollu: ఆదివారం కాదు, అమావాస్య లేదు.. అయినా కానీ వదల్లేదు…

బాపట్ల జిల్లా ఇంకొల్లు శివారులో క్షుద్రపూజలు కలకలం రేపాయి. మూడు రోడ్లు కలిసే రావిచెట్టు డొంక దగ్గర నిమ్మకాయలు, కుంకుమ, బొమ్మలు, కోడి కాల్చిన ఆనవాళ్లు కనిపించడంతో రైతులు భయభ్రాంతులయ్యారు. అర్ధరాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసి వెళ్లిపోయారని గ్రామంలో ప్రచారం మొదలైంది.

Inkollu: ఆదివారం కాదు, అమావాస్య లేదు.. అయినా కానీ వదల్లేదు...
Three Road Junction Ritual
Fairoz Baig
| Edited By: |

Updated on: Nov 25, 2025 | 3:27 PM

Share

అమావాస్య, పౌర్ణమి రోజుల్లో మంత్రగాళ్లు చెలరేగిపోతున్నారు. ఆయా రోజుల్లోనే కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ మూఢనమ్మకాలు నమ్మే అమాయకులను ఆసరాగా చేసుకుని క్షుద్రపూజలు చేసి పబ్బం గడుపుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడేవారిని, గుప్తనిధులు ఉన్నాయని, శత్రువులపై బాణామతి, చేతబడి వంటి దిక్కుమాలిన ప్రయోగాలు చేసి భీతిగొలిపే విధంగా పూజలు చేస్తుంటారు. ఇలాంటి వాటికి మూడు రోడ్లు కలిసే జంక్షన్లను వేదికగా చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి క్షుద్రపూజలు చేసిన ఘటన బాపట్ల జిల్లా ఇంకొల్లు శివారులో చోటు చేసుకుంది. నలుగురు నడిచే బాటలో మూడు రోడ్లు కలిసే కూడలిలో ముగ్గులు వేసి, పశుపు కుంకుమ చల్లి, నిమ్మకాయలు పెట్టి, కోడిని కాల్చిన ఆనవాళ్లు కనిపించడంతో పొలాలకు వెళ్లే రైతులు హడలిపోతున్నారు.

బాపట్ల జిల్లా ఇంకొల్లులో క్షుద్రపూజలు కలకలం రేపాయి. ఇంకొల్లు – పావులూరు రోడ్డులోని రావి చెట్టు డొంక మలుపు దగ్గర రహదారిపై క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. పొలాలకు వెళ్లే రోడ్డులో నిమ్మకాయలు, కుంకుమ, ఎండిన మిరప కాయలు, బొమ్మలతో క్షుద్రపూజలు చేశారు. ఉదయం అటుగా పొలాలకు వెళుతున్న రైతులు వీటిని చూసి భయబ్రాంతులకు గురయ్యారు. పొలాలకు వెళ్లే దారిలో రోడ్డుపై క్షుద్రపూజలు చేసి ఉండటంతో అది దాటి వెళితే అరిష్టం జరుగుతుందన్న భయంతో రైతులు పోలాలకు వెళ్ళకుండానే వెనుతిరిగారు. గ్రామంలోకి క్షుద్రపూజలు చేసే మాంత్రగాళ్లు వచ్చారన్న ప్రచారంతో గ్రామస్థులు అప్రమత్తమయ్యారు. ఈ క్షుద్రపూజలు గత రాత్రి చేసినట్టు అనుమానిస్తున్నారు. గ్రామంలోకి ఎవరైనా కొత్తవ్యక్తులు వచ్చారా అని ఆరా తీస్తున్నారు.. క్షుద్రపూజులు చేయాల్సిన అవసరం గ్రామంలో ఎవరికి లేదని, ఎవరో పక్క గ్రామానికి చెందిన వారు ఇక్కడికి వచ్చి అర్ధరాత్రి క్షుద్రపూజలు చేసి వెళ్ళిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. నిత్యం వ్యవసాయ కూలీలు, రైతుల రాకపోకలతో సందడిగా ఉంటే రావిచెట్టు డొంక మలుపు రోడ్డు క్షుద్ర పూజల ఆనవాళ్లతో భయానకంగా మారింది.  క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్ళను అక్కడినుంచి తొలగిస్తే కానీ తిరిగి రాకపోకలు చేయడానికి జనం జంకుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us