AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: అక్కడ హనుమంతునికి పూజ చేయనిదే కొత్త వాహనం రోడ్డెక్కదు..!

శ్రీదాసాంజనేయ స్వామి ఆలయానికి కేవలం స్థానిక భక్తులే కాదు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా తరలివస్తారు. విజయవాడ పరిసర ప్రాంతాలతో పాటు.. ఇతర ప్రాంతాల నుంచి కొత్త వాహనాల పూజలు చేసేందుకు వస్తుంటారు భక్తులు. ఇక్కడ పూజ చేసిన తర్వాతే వాహనాలను రోడ్డు ఎక్కిస్తారంటే భక్తులకు ఉన్న విశ్వాసం అలాంటిది. కేవలం వాహనాల పూజ మాత్రమే కాదు. నిరుద్యోగులు, వివాహం కావాల్సి ఉన్నవారు సైతం ఇక్కడికి వస్తారు.

Andhra Pradesh: అక్కడ హనుమంతునికి పూజ చేయనిదే కొత్త వాహనం రోడ్డెక్కదు..!
Sri Dasanjaneya Swami Temple
M Sivakumar
| Edited By: Aravind B|

Updated on: Aug 28, 2023 | 3:47 PM

Share

విజయవాడ న్యూస్, ఆగస్టు 28: అది ఎంతో మహిమ గల హనుమాన్ ఆలయం. భక్తుల పాలిట కొంగు బంగారమై నిలిచిన శ్రీ ఆంజనేయస్వామిపై అక్కడి భక్తులు అమితమైన విశ్వాసం చూపిస్తుంటారు. అందుకే.. ఎలాంటి వాహనం అయినా సరే.. అక్కడి ఆంజనేయుడి ఆలయంలో పూజ చేశాకే రోడ్డెక్కుతుంది. భక్తుల పాలిట కొంగుబంగారంగా మారిన ఆ హనుమాన్ ఆలయం ఎక్కడ ఉంది..? ఏమిటా విశేషం..? పూర్తిగా తెలుసుకుందాం. సాధారణంగా ఎక్కువ మంది ప్రజలు తమ వాహనాలకు హనుమాన్ ఆలయంలో పూజ చేస్తారు. కానీ విజయవాడ మాచవరంలోని శ్రీ దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం వాహనాల పూజకు ఎంతో ప్రత్యేకమైనది. భక్తుల పాలిట కొంగు బంగారమై నిలుస్తోంది. దాసాంజనేయ స్వామి ఆలయంలో స్థానికంగా ఉండే ప్రజలు ఏదైన కొత్త వాహనం తీసుకుంటే ముందుగా ఆ ఆలయంలో పూజ చేస్తారు. అక్కడ పూజ చేయనిదే కొత్త వాహనం రోడ్డు మీదకు వెళ్లలేదు. అలాగే ఈ ఆలయం ఎంతో విశిష్టత కలిగి ఉంది. ఈ దేవస్థానానికి భక్తుల తాకిడి ఎక్కువే. నిత్యం వందలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని.. తమ కోరికలు నెరవేరాలని పూజలు చేస్తుంటారు.

శ్రీదాసాంజనేయ స్వామి ఆలయానికి కేవలం స్థానిక భక్తులే కాదు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా తరలివస్తారు. విజయవాడ పరిసర ప్రాంతాలతో పాటు.. ఇతర ప్రాంతాల నుంచి కొత్త వాహనాల పూజలు చేసేందుకు వస్తుంటారు భక్తులు. ఇక్కడ పూజ చేసిన తర్వాతే వాహనాలను రోడ్డు ఎక్కిస్తారంటే భక్తులకు ఉన్న విశ్వాసం అలాంటిది. కేవలం వాహనాల పూజ మాత్రమే కాదు. నిరుద్యోగులు, వివాహం కావాల్సి ఉన్నవారు.. శ్రీదాసాంజనేయ స్వామిని దర్శనం చేసుకుని కొబ్బరికాయతో మొక్కు చెల్లిస్తే.. వారు కోరుకున్న కోరిక ఏదైనా తీరుతుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం.

మాచవరం శ్రీదాసాంజనేయ స్వామి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు, చరిత్ర కూడా ఉంది. ఇక్కడ ప్రతినిత్యం వాహనాలకు పూజలు జరుగుతాయి. ఇటు తూర్పుగోదావరి జిల్లా నుంచి అటు ఒంగోలు వరకు.. పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. అంతేకాదు.. వాహనాల పూజ కోసం తెలంగాణా నుంచి కూడా పెద్దఎత్తున భక్తులు వచ్చి పూజలు చేయించుకుంటారు. ఇక్కడ పూజ చేయించుకుంటే.. ప్రమాదాలు జరగకుండా.. సజావుగా సాగుతుందని భక్తుల విశ్వాసం. అయితే.. ఈ గుడికి వాహనపూజ అనేది ఆనాది కాలం నుంచి వస్తోంది. ఒక విద్యార్థి సైకిల్ కొన్నా కానీ.. ఈ ఆలయానికి వచ్చి పూజలు చేయించుకుంటారు. అంతేకాదు.. వీవీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు, వారి వాహనాలకు కూడా ఇక్కడ పూజలు జరుగుతాయి. ముఖ్యంగా న్యాయమూర్తులు ప్రత్యేకంగా శనివారం, మంగళవారం పూజలు చేయించుకుంటారని ఆలయ అధికారులు చెబుతున్నారు. విజయవాడ ఏలూరురోడ్డు పక్కనే ఈ ఆలయం ఉంటుంది. ఆలయంలో సంజీవిని పర్వతంతో.. స్వామి వారు కొలువుదీరారు. స్వామి వారికి తమలపాకులతో నిత్యం పూజలు చేయడం ఇక్కడి ప్రత్యేకత. దేవస్థానం మొత్తం కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. శ్రీదాసాంజనేయ స్వామిపై భక్తులకు అమితమైన విశ్వాసం, నమ్మకం ఉండటంతో నిత్యం ప్రత్యేక పూజలు చేసేందుకు క్యూలు కడుతుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..