Amalapuram: అమలాపురంలో మంత్రి విశ్వరూప్ Vs డీఎస్పీ మాధవరెడ్డి.. అసలేం జరిగిందంటే..?
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మంత్రి విశ్వరూప్, అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి మధ్య వివాదం తలెత్తింది. అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా బైక్ సైలెన్సర్లు తీసేసిన కొందరు యువకులు.. రోడ్లపై హల్చల్ చేయడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మంత్రి విశ్వరూప్, అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి మధ్య వివాదం తలెత్తింది. అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా బైక్ సైలెన్సర్లు తీసేసిన కొందరు యువకులు.. రోడ్లపై హల్చల్ చేయడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి తనయుడు శ్రీకాంత్ బైకులు విడిచిపెట్టాలని కోరగా పోలీసులు పట్టించుకోకపోవడంతో దళిత యువకులతో కలిసి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మంత్రి విశ్వరూప్ అక్కడకు చేరుకుని డీఎస్పీ మాధవరెడ్డిపై విశ్వరూపం చూపించారు.
యువకులను అడ్డుకోవడం తగదంటూ డీఎస్పీ మాధవ్‌రెడ్డిపై మంత్రి విశ్వరూప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో.. కేవలం సైలెన్సర్లు లేని బైకులను మాత్రమే ఆపామని చెప్పారు డీఎస్పీ మాధవరెడ్డి. కానీ.. మంత్రి విశ్వరూప్ మాత్రం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఛలో అమలాపురం పిలుపునివ్వమంటావా అని కన్నెర్ర చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. 100 రెట్లు పోలీసులను పెట్టుకున్నా.. ఏమీ చేయలేవంటూ డీఎస్పీ మాధవరెడ్డిని హెచ్చరించారు.
ఇక.. మంత్రి విశ్వరూప్ మాట్లాడుతుండగానే డీఎస్పీ మాధవ్‌రెడ్డి మధ్యలోనే వెళ్లిపోవడంతో అక్కడున్న నేతలు షాకయ్యారు. సాక్షాత్తు మంత్రి ఉండగా లోపలికి వెళ్లిపోవడంతో ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితుల్లో ఉండిపోయారు. బైకులు పంపించేస్తారులే.. పదండి అంటూ మంత్రి విశ్వరూప్‌ను కూల్ చేస్తూ డీఎస్పీ కార్యాలయం నుండి తీసుకుని వెళ్లిపోయారు అనుచరులు. అయితే.. గతంలో.. అంబేద్కర్ కోనసీమ జిల్లా నూతనంగా ప్రకటించిన సమయంలో పెద్దయెత్తున అల్లర్లు జరిగాయి. ఈ క్రమంలోనే పోలీసులు అలెర్ట్ అయినట్లు తెలుస్తోంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..